డాక్టర్లు లేరన్న మాటే వినపడొద్దు : దామోదర రాజనర్సింహ

డాక్టర్లు లేరన్న మాటే వినపడొద్దు : దామోదర రాజనర్సింహ
  •     వరంగల్‌‌‌‌లో క్యాన్సర్, కిడ్నీ ట్రాన్స్‌‌‌‌ప్లాంటేషన్‌‌‌‌, ఐవీఎఫ్‌‌‌‌ సెంటర్లు
  •     మంత్రి దామోదర రాజనర్సింహ
  •     నర్సంపేటలో మెడికల్‌‌‌‌ కాలేజీ, హాస్పిటల్‌‌‌‌ ప్రారంభం
  •     హాజరైన పొంగులేటి, కొండా సురేఖ

వరంగల్/నర్సంపేట, వెలుగు : రాష్ట్రంలోని ఏ హాస్పిటల్‌‌‌‌లోనూ డాక్టర్లు, వైద్య సిబ్బంది లేరన్న మాట వినపడొద్దన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం అన్ని రకాల పోస్ట్‌‌‌‌లను భర్తీ చేస్తోందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ చెప్పారు. వరంగల్‌‌‌‌ జిల్లా నర్సంపేటలో నిర్మించిన మెడికల్‌‌‌‌ కాలేజీ, గవర్నమెంట్‌‌‌‌ హాస్పిటల్‌‌‌‌ను గురువారం మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌‌‌‌రెడ్డి, కొండా సురేఖ, ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన మీటింగ్‌‌‌‌లో రాజనర్సింహ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 4 వేల వైద్య ప్రొఫెసర్లు, అసిస్టెంట్, అసోసియేట్‌‌‌‌ ప్రొఫెసర్ల ఖాళీలు భర్తీ చేసినట్లు వెల్లడించారు. 

ప్రమాదం జరిగిన తర్వాత గంటలోనే ట్రీట్‌‌‌‌మెంట్‌‌‌‌ అందేలా రాష్ట్రమంతటా నాలుగైదు ట్రామా సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కాంగ్రెస్‌‌‌‌ అధికారంలోకి రాగానే 7 వేల నర్సింగ్‌‌‌‌ పోస్టులను ఇచ్చిందని, మరో 2,050 నర్సింగ్, 1,200 ల్యాబ్‌‌‌‌ టెక్నీషియన్‌‌‌‌ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు. రూ.2 వేల కోట్లతో హైదరాబాద్‌‌‌‌ గోషామహల్‌‌‌‌లో ఉస్మానియా కొత్త హాస్పిటల్‌‌‌‌ నిర్మిస్తామని చెప్పారు. గత ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకాన్ని పట్టించుకోలేదని విమర్శించారు. అబద్ధాలతో నెట్టుకొచ్చేవారు మీడియాలో, ట్విట్టర్‌‌‌‌, ఇన్‌‌‌‌స్ట్రాగ్రామ్‌‌‌‌కే పరిమితం అవుతారని ఎద్దేవా చేశారు. 

వరంగల్‌‌‌‌ను హెల్త్‌‌‌‌ హబ్‌‌‌‌గా అభివృద్ధి చేసి అన్ని రకాల సేవలు ఇక్కడే అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఇందులో భాగంగా రూ.30 కోట్లతో క్యాన్సర్‌‌‌‌ హాస్పిటల్‌‌‌‌, ఐవీఎఫ్‌‌‌‌ సెంటర్, కిడ్నీ ట్రాన్స్‌‌‌‌ప్లాంటేషన్‌‌‌‌, ట్రామా సెంటర్లను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. నర్సంపేట మెడికల్‌‌‌‌ కాలేజీ సీట్లను 150కి పెంచేలా చూస్తామన్నారు.

త్వరలో రేషన్‌‌‌‌ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గులు

ఈ నెలాఖరు లేదంటే వచ్చే నెల మొదటివారంలో రేషన్‌‌‌‌ కార్డులు ఇవ్వడంతో పాటు, వర్షాకాలంలోపే ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గు పోయనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌‌‌‌రెడ్డి ప్రకటించారు. తమ ప్రభుత్వం హెల్త్, ఎడ్యుకేషన్‌‌‌‌కు అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా రూ.657 కోట్లతో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించినట్లు గుర్తు చేశారు. అన్ని నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్‌‌‌‌ స్కూల్స్‌‌‌‌ నిర్మించనున్నట్లు చెప్పారు. గత ప్రభుత్వం మిషన్‌‌‌‌ భగీరథ పేరుతో అవినీతి, అక్రమాలకు పాల్పడిందని ఆరోపించారు. 

ఇప్పటికీ 53 శాతం ఇండ్లకు మంచినీరు అందడం లేదని తమ సర్వేలో తేలిందన్నారు. అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. ఎంజీఎం హాస్పిటల్‌‌‌‌ను గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్​విప్‌‌‌‌ రాంచంద్రునాయక్‌‌‌‌, ఎంపీ బలరాంనాయక్‌‌‌‌, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‌‌‌‌రెడ్డి, కేఆర్. నాగరాజు, మురళీనాయక్, కుడా చైర్మన్‌‌‌‌ ఇనుగాల వెంకట్రామిరెడ్డి, కలెక్టర్‌‌‌‌ సత్యశారద, డీఎంఈ వాణి పాల్గొన్నారు.