క్యాన్సర్​ని జయించి.. పచ్చళ్ల వ్యాపారం​లో సక్సెస్​ !

క్యాన్సర్​ని జయించి..  పచ్చళ్ల వ్యాపారం​లో సక్సెస్​ !

యూభై పదుల వయస్సులో లవీనా, దీపక్ దంపతులకు క్యాన్సర్​ ఉందని తేలింది.   దంపతులు కుంగిపోయారు. ... అయినా ఆత్మవిశ్వాసం దెబ్బతినలేదు. అప్పటివరకు సంపాదించింది ట్రీట్ మెంట్​కు ఖర్చు పెట్టారు.. అయినా సరిపోలేదు.. అప్పు చేశారు.  ఉన్న చిన్న ఇంటిని అమ్మి అప్పులు తరుద్దామనుకున్నారు.  కాని మనసు రాజీపడలేదు. కాని తప్పని పరిస్థితిలో ఇంటిని కూడా అమ్మేశారు. పిల్లల స్కూలు ఫీజులు కూడా కట్టలేని పరిస్థితి.  

క్యాన్సర్​ నుంచి కోలుకోవడం కంటే.. ఆర్థికంగా నిలదొక్కుకోవడానికే చాలా ఇబ్బందిపడ్డారు. కానీ.. లవీనా అవేవీ లెక్కచేయకుండా క్యాన్సర్​ నుంచి కోలుకున్న వెంటనే  రూ. 1500లతో ఫుడ్​ బిజినెస్​ మొదలుపెట్టింది. ఇప్పుడదే.. లక్షల్లో టర్నోవర్​ చేస్తోంది.  

లవీనా జైన్, దీపక్​లు.. ఉత్తరప్రదేశ్‌‌‌‌‌‌‌‌లోని మీరట్​లో ప్రైవేట్ ట్రాన్స్​పోర్ట్‌‌‌‌‌‌‌‌ బిజినెస్​ నడిపేవాళ్లు. అయితే.. 2010లో లవీనాకు బ్రెస్ట్‌‌‌‌‌‌‌‌ క్యాన్సర్, దీపక్​కు నోటి క్యాన్సర్​ ఉన్నట్లు తెలిసింది. దాంతో హాయిగా సాగుతున్న వాళ్ల జీవితం ఒక్కసారిగా తలకిందులైంది. ఇద్దరికీ సర్జరీలు.. ఆ తర్వాత కీమోథెరపీ, రేడియోథెరపీలు జరగడంతో బిజినెస్​ను చూసుకోలేకపోయారు. 

నష్టాలు వచ్చి చివరికి వ్యాపారం మూతపడింది. మరోవైపు ట్రీట్​మెంట్ కోసం వాళ్ల శక్తికి మించి ఖర్చు చేసి అప్పులపాలయ్యారు. రోజు గడవడం కూడా కష్టమైంది. మరో వైపు పిల్లల స్కూల్​ ఫీజులు కట్టలేకపోయారు. దాంతో.. మరో దారి లేక ఇంటిని అమ్మేశారు. ఒకప్పుడు తాను ఎదుర్కొన్న ఈ భయంకరమైన పరిస్థితులను గుర్తుచేసుకుంటూ లవీనా “మేము ఆర్థికంగా మాత్రమే కాదు.. మానసికంగా, శారీరకంగా కూడా చాలా నష్టపోయాం. అయినప్పటికీ, మా కోసం, మా పిల్లల భవిష్యత్తు కోసం మళ్లీ జీవిత పోరాటం మొదలుపెట్టాం. నా కొడుకు వయసు 14 ఏండ్లు, కూతురికి 12 ఏండ్లు. అలాంటి టైంలో మా ఇంటిని అమ్మేయడం ఓటమిని ఒప్పుకున్నట్టే అనిపించింది” అన్నది.

వంట చేయడం ఇష్టం.. 

క్యాన్సర్​ నుంచి కాస్త కోలుకున్నాక భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను అధిగమించడానికి తనను తాను సిద్ధం చేసుకుంది లవీనా. ఆ సంకల్ప బలమే వాళ్ల కుటుంబాన్ని మళ్లీ నిలబెట్టింది. లవీనాకి ముందు నుంచి వంట చేయడమంటే బాగా ఇష్టం. ఆ ఇష్టం వల్లే 2011లో ఫుడ్​ బిజినెస్​ పెట్టాలని నిర్ణయించుకుంది. 

1980ల్లో లవీనా చదువుకుంటున్నప్పుడు.. ఫుడ్​ ప్రిజర్వేషన్​ మీద ఒక కోర్సు చేసింది. అప్పట్లో మురబ్బా, ఊరగాయలు, జామ్‌‌‌‌‌‌‌‌లు తయారుచేయడం నేర్చుకుంది. అప్పుడు నేర్చుకున్న స్కిల్స్​ ఫుడ్​ బిజినెస్​ పెట్టిన తర్వాత ఆమెకు పనికొచ్చాయి. యంగేజ్​లో నేర్చుకున్న ఆ స్కిల్స్​ ఆమెకు ఇలాంటి టైంలో ఉపయోగపడతాయని ఎప్పుడూ ఊహించలేదు. 

అయితే..  బిజినెస్​ పెట్టేముందు ఆమె ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్​ ఫుడ్​ ప్రిజర్వేషన్​ మీద చేపట్టిన 100 రోజుల ఎంప్లాయిమెంట్​ డెవలప్​మెంట్ ప్రోగ్రాంలో కూడా చేరింది. ట్రైనింగ్​ పూర్తైన తర్వాత పెట్టుబడికి డబ్బు లేదు. దాంతో ఉన్నంతలోనే మొదలుపెట్టాలని రూ. 1,500తోనే ముడిసరుకులు తీసుకొచ్చింది. మొదటి బ్యాచ్ నిమ్మకాయ స్క్వాష్ ఇంట్లోనే చేసి అమ్మింది. అలా వచ్చిన డబ్బుతో వ్యాపారాన్ని విస్తరించి చివరికి ‘లవీనాస్ త్రిప్తి ఫుడ్స్’ స్టార్టప్​ని ప్రారంభించింది. 

కుటుంబం తోడుగా..

ఆమె క్యాన్సర్​ బారిన పడినప్పుడు, బిజినెస్​ పెట్టినప్పుడు భర్త, పిల్లలు ఆమె వెంటే ఉండి ప్రోత్సహించారు. తన కొడుకు కిన్షుక్​ని చార్టర్డ్ అకౌంటెంట్ చేయాలి అనుకుంది. కానీ.. అతను కూడా ఫ్యామిలీ బిజినెస్​లో భాగమయ్యాడు. ప్రస్తుతం అతనే కంపెనీ బాధ్యతలు చూసుకుంటున్నాడు. 

వ్యాపారం పెట్టిన కొత్తలో కిన్షుక్​కి చాలా చిన్న వయసు... అప్పుడు కూడా.. అతను తన తల్లికి చాలా సాయం చేశాడు. ప్రొడక్ట్స్​ అమ్మడానికి తల్లితోపాటు తాను కూడా వెళ్లేవాడు. ‘‘నేను ఒకసారి ప్రొడక్ట్స్‌‌‌‌‌‌‌‌ అమ్మలేక నిరూత్సాహ పడితే.. ​సర్జరీ తర్వాత మా నాన్న మాట్లాడలేకపోయినా  ఒక కాగితంపై సలహాలు రాసి ఇచ్చారు. 

‘నిరుత్సాహపడకు. నేను ట్రావెల్స్​ యజమానిని అయినప్పటికీ ప్రయాణీకులను బస్సులోకి స్వయంగా ఆహ్వానించేవాడిని’ అని చెప్పాడు. ఆయన మాటల వల్లే నాకు ఇంటింటికీ వెళ్లి ప్రొడక్ట్స్ అమ్మాలనే ఆలోచన వచ్చింది” అంటూ చెప్పుకొచ్చాడు కిన్షుక్.

ఎన్నో సవాళ్లు

లవీనా బిజినెస్​ పెట్టిన తొలి రోజుల్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొంది.  “కొత్తలో నా ప్రొడక్ట్స్‌‌‌‌‌‌‌‌ని ప్రజలు కొనేలా ఒప్పించేందుకు చాలా టైం పట్టింది. ఒక ప్రొడక్ట్‌‌‌‌‌‌‌‌ని అమ్మడం కంటే తయారు చేయడం చాలా సులభం”అంటోంది లవీనా. ఆమె మొదట్లో స్థానికంగా జరిగే కిట్టి పార్టీల్లో ప్రొడక్ట్స్‌‌‌‌‌‌‌‌ని అమ్మేది. వాటిలో నిమ్మకాయ పచ్చడికి బాగా ఆదరణ లభించింది. ఆ తర్వాత డిమాండ్ పెరగడంతో క్రమంగా మామిడికాయ పచ్చడి, మురబ్బా, జామ్‌‌‌‌‌‌‌‌, కచోరీల కోసం పొడి పప్పు దినుసులు లాంటివి తయారుచేసింది. ఇప్పుడు ఆమె ఫుడ్స్​కి ఎంత డిమాండ్​ పెరిగిందంటే.. కొన్నిసార్లు కస్టమర్లు ప్రీ ఆర్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసుకుంటున్నారు. ప్రస్తుతం.. 60 నుండి 70 రకాల ఫుడ్‌‌‌‌‌‌‌‌ ప్రొడక్ట్స్‌‌‌‌‌‌‌‌ని తయారుచేస్తోంది. 

నెలకు 300 ఆర్డర్లు 

ఒక పెద్ద సంకల్పంతో ప్రారంభమైన ఈ చిన్న వెంచర్ ఇప్పుడు మీరట్​ని దాటి మొరాదాబాద్, ఘజియాబాద్, అలీఘర్, నోయిడాలకు కూడా విస్తరించింది. లవీనా ఉత్పత్తులు అమెజాన్ లాంటి ఆన్​లైన్​ ప్లాట్‌‌‌‌‌‌‌‌ఫామ్స్​తో సహా ఆఫ్‌‌‌‌‌‌‌‌లైన్​లోనూ అందుబాటులో ఉన్నాయి. కంపెనీకి నెలకు సగటున 300 ఆర్డర్లు వస్తున్నాయి. వ్యాపారంలో వచ్చిన లాభాల వల్లే రూ.15 లక్షల అప్పు తీర్చేశారు. ఇప్పుడు వ్యాపారం విలువ రూ. 39 లక్షలకు చేరుకుంది.

–వెలుగు,లైఫ్​–