
కోపెన్ హాగెన్(డెన్మార్క్): టాటూలతో క్యాన్సర్ ముప్పు పొంచి ఉందని గతంలోనే తేల్చిన పరిశోధకులు తాజాగా ఆ ముప్పు తీవ్రతకు సంబంధించి సంచలన విషయాలు వెల్లడించారు. శరీరంపై వేసుకునే టాటూ పరిమాణాన్ని బట్టి క్యాన్సర్ ముప్పు కూడా పెరుగుతుందన్నారు. అంటే.. టాటూ పెద్దగా ఉంటే రిస్క్ కూడా ఎక్కువేనని హెచ్చరించారు. దీనికి ప్రధాన కారణం టాటూలు వేసేందుకు ఉపయోగించే సిరానేనని డెన్మార్క్ పరిశోధకులు చెప్పారు.
ఈమేరకు 2 వేల మంది కవలలపై జరిపిన అధ్యయనంలో ఈ విషయం తేలిందని అన్నారు. డెన్మార్క్ వర్సిటీ పరిశోధకులు నిర్వహించిన అధ్యయన వివరాలను బీఎంసీ పబ్లిక్ హెల్త్ జర్నల్ ప్రచురించింది. టాటూలు వేసుకోని వారితో పోలిస్తే టాటూలు వేయించుకున్న వారిలో క్యాన్సర్ ముప్పు 62 శాతం ఎక్కువని ఈ అధ్యయనం తేల్చింది.
సాధారణంగా టాటూలు వేసేందుకు నలుపు రంగు ఇంక్ ను వాడతారని, ఇందులోని కార్బన్ బ్లాక్ క్యాన్సర్ కు దారితీస్తుందని ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ (ఐఏఆర్ సీ) గతంలోనే హెచ్చరించింది. తాజా స్టడీలోనూ ఈ ఇంక్ వల్ల చర్మ క్యాన్సర్ ముప్పు 137%, బ్లడ్ క్యాన్సర్ ముప్పు 173% పెరుగుతోందని తేల్చింది. దీనికి తోడు టాటూ వేసుకున్న భాగంపై సూర్యకాంతి పడినపుడు లేదా టాటూను తొలగించేందుకు లేజర్ కిరణాలు పడినపుడు ఈ ఇంక్ లో నుంచి విషపూరిత పదార్థాలు వెలువడతాయని సైంటిస్టులు తెలిపారు.
ఇవి క్యాన్సర్ ముప్పును ప్రమాదకర స్థాయిలో పెంచుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవలి కాలంలో శరీరంపై టాటూ వేసుకోవడం ఫ్యాషన్ కు, ట్రెండ్ కు సింబల్ గా యువత భావిస్తోందని గుర్తుచేశారు. టాటూ వేయించుకునే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోందని, తాజా అధ్యయన ఫలితాలతో క్యాన్సర్ కేసులు పెరిగే ప్రమాదం ఉందని డెన్మార్క్ వర్సిటీ పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేశారు.