- ఆత్మీయ సమ్మేళనంలో తుమ్మల నాగేశ్వరరావు
ఖమ్మం టౌన్, వెలుగు : ఈ ఎన్నికలు మనందరికీ గౌరవం తెచ్చేవని, అందరినీ ఐక్యంగా ఉంచే పార్టీ కాంగ్రెస్సేనని మాజీ మంత్రి, ఖమ్మం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సిటీలోని 45వ డివిజన్ మామిళ్లగూడెంలోని శ్రీ లక్ష్మీగాయత్రి అపార్ట్మెంట్ లో ఆయన మాట్లాడారు. ఖమ్మం నియోజకవర్గంలో ప్రస్తుతం అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోందన్నారు.
మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు ఎవ్వరు వ్యతిరేకంగా మాట్లాడినా కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు. మంత్రికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన పాపానికి సామినేని సాయి గణేశ్‌పై అక్రమ కేసులు పెట్టి వేధించి అతడి ఆత్మహత్యకు కారణమయ్యారని మండిపడ్డారు. ఇలాంటి అరాచకాలకు అడ్డుకట్ట వేయాలనే కాంగ్రెస్ హైకమాండ్ తనను ఖమ్మంలో పోటీ చేయించిందని చెప్పారు.
సాయి గణేశ్కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం తుమ్మల 28, 29 డివిజన్ లలో క్రిస్టియన్లు నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో తుమ్మల పాల్గొన్నారు. 27వ డివిజన్ కార్పొరేటర్ దొడ్డ నగేశ్ఆధ్వర్యంలో స్థానిక 17 డివిజన్ కు చెందిన యువ నాయకులకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. టీడీపీ ఆఫీస్‌లో ఆపార్టీ జిల్లా అధ్యక్షుడు వాసిరెడ్డి రామనాథంను తుమ్మల కలిసి మద్దతు కోరారు.