ఆర్మూర్, వెలుగు: ఆర్మూర్ నియోజకవర్గ అభివృద్ధి కోసం బీజేపీని గెలిపించాలని అభ్యర్థి పైడి రాకేశ్‌రెడ్డి కోరారు. శుక్రవారం ఆర్మూర్ మండలం పిప్రిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రాకేశ్‌రెడ్డి మాట్లాడుతూ.. జీతగాడిలా ఉంటానని చెప్పిన ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి పెద్ద కాపు అయ్యాడని, అనేక మంది నుంచి దౌర్జన్యంగా భూములు లాక్కున్నాడని విమర్శించారు. ప్రజల నుంచి దోచుకున్న డబ్బులతోనే ఆర్మూర్, హైదరాబాద్ లో హైటెక్ బంగ్లాలు, షాపింగ్‌మాల్‌లు కట్టాడన్నారు.
నియోజకవర్గంలో రాజకీయ హత్యలకు చరమగీతం పాడాలంటే కమలంపువ్వుపై ఓటేసి బీజేపీని గెలిపించాలన్నారు. జీవన్‌రెడ్డి పంచిన కుక్కర్లు, చీరల మాయలో మీ విలువైన భవిష్యత్ ను తాకట్టు పెట్టొదన్నారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి, మండల ప్రెసిడెంట్ రోహిత్ రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ కంచెట్టి గంగాధర్,యామద్రి భాస్కర్, పాలెపు రాజు, గెంట్యాల పండరి, భూషణ్ పాల్గొన్నారు.