- నామినేషన్లు ముగియడంతో ఊపందుకున్న ప్రచారం
- ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు బిజీగా గడుపుతున్న క్యాండిడేట్లు
- రాష్ర్ట, జాతీయ నాయకులతో సభలు, కార్నర్ మీటింగు
మహబూబ్‌నగర్, వెలుగు : లోక్‌సభ ఎలక్షన్లకు 17 రోజులే టైం ఉండటంతో క్యాండిడేట్లు ప్రచారంపైనే ఫుల్ ఫోకస్ పెట్టారు. ప్రతి క్షణం లెక్కబెట్టుకుంటూ ఫుల్ టైం ఓటర్ల కోసమే కేటాయిస్తున్నారు. పోలింగ్ నాటికి పార్లమెంట్ పరిధిలోని ప్రతి గ్రామాన్ని విజిట్ చేసేలా రూట్ మ్యాప్‌ను తయారు చేయించుకున్నారు. ప్రతి రోజూ పది నుంచి 14 గ్రామాల్లో రూట్ మ్యాప్‌లో ఉండేలా చూసుకుంటున్నారు. నియోజకవర్గంలోని దూరప్రాంతంలో ఉన్న గ్రామాల్లో ప్రచారానికి వెళ్లాల్సి వస్తే నైట్అక్కడే బస చేసేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇందు కోసం ప్రత్యేకంగా కారావాన్ లను సిద్ధం చేసుకుంటున్నారు. లంచ్ బ్రేక్ హవర్స్‌లో స్థానిక లీడర్లు, కేడర్‌తో సమావేశం అవుతున్నారు. అక్కడి పార్టీ పరిస్థితులపై చర్చించి, తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు, సలహాలు చేస్తున్నారు.
ప్రచార స్పీడ్‌ను పెంచిన క్యాండిడేట్లు
ప్రధాన పార్టీల క్యాండిడేట్లు ప్రచారంలో స్పీడ్ పెంచారు. నాలుగు రోజుల నుంచి గ్రామాల్లో విస్తృతంగా తిరుగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ చల్లా వంశీచంద్ రెడ్డి ఇంటింటికీ తిరిగి ప్రతి ఓటరును కలుస్తున్నారు. ఉదయమే క్యాంపెయిన్‌ను స్టార్ట్ చేసి రాత్రి వరకు కొనసాగిస్తున్నారు. ప్రతి ఓటు కీలకం కావడంతో ఓటర్ల మధ్యనే ఎక్కువగా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. బీజేపీ క్యాండిడేట్ డీకే అరుణ సైతం ప్రచారంలో బిజీగా ఉంటున్నారు. ప్రతి రోజూ 14 గ్రామాల్లో పర్యటించేలా రూట్ మ్యాప్ సెట్ చేసుకున్నారు.
ఎండలు మండుతుండటంతో ఉదయం ఏడు గంటల నుంచే క్యాంపెయిన్‌ను స్టార్ట్ చేసి. మధ్యాహ్నం రెండు గంటల వరకు కొనసాగిస్తున్నారు. రెండు గంటల లంచ్ బ్రేక్ తర్వాత తిరిగి ఈవెనింగ్ నాలుగు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు క్యాంపెయిన్‌ను నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్ క్యాండిడేట్ మన్నె శ్రీనివాస్ రెడ్డి పార్టీ కేడర్‌ను సమాయత్తం చేస్తున్నారు. నియోజకవర్గాల వారీగా వారితో ఇంటరాక్ట్ అవుతున్నారు. కేసీఆర్ సభ తర్వాత డైరెక్ట్‌గా ప్రజల వద్దకు వెళ్లి ఓట్లను అభ్యర్థించేందుకు రూట్ మ్యాప్‌ను సిద్ధం చేసుకున్నారు. శుక్రవారం పార్లమెంట్ నియోజకవర్గ కేంద్రం నుంచి ఎలక్షన్ క్యాంపెయిన్‌ను స్టార్ట్ చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు.
సవాళ్లు.. విమర్శలు..
ఎన్నికల ప్రచారాల్లో భాగంగా పార్టీ క్యాండిడేట్లు ఒకరిపై ఒకరు సవాళ్లు.. ప్రతి సవాళ్లు చేసుకుంటున్నారు. వీరితో పాటు ఛీఫ్ గెస్టులుగా హాజరవుతున్న లీడర్లు కూడా ఇదే ఫాలో అవుతున్నారు. మా హయాంలోనే అభివృద్ధి జరిగిందని ఒకరు.. మేమే పాలమూరును డెవలప్ చేశామని ఇంకొకరు.. తమ ప్రభుత్వ హయాంలోనే పాలమూరు ప్రాజెక్టులు కట్టామని మరొకరు.. ఇలా ప్రకటనలు చేసుకుంటున్నారు. పాలమూరు అభివృద్ధిపై నువ్వా నేనా అన్నట్లు విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు.
ప్రముఖుల పర్యటనలు..
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ క్యాండిడేట్ల తనపున ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొనేందుకు ప్రముఖుల టూర్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఆ పార్టీ క్యాండిడేట్ చల్లా వంశీచంద్‌రెడ్డికి మద్దతుగా నారాయణపేట, మహబూబ్‌నగర్ కేంద్రాల్లో జరిగిన ప్రచార సభల్లో పాల్గొనగా, త్వరలో మక్తల్, దేవరకద్ర నియోజకవర్గాల్లో ఆయన టూర్ షెడ్యూల్‌ను రూపొందిస్తున్నారు. బీజేపీ క్యాండిడేట్ డీకే అరుణ తరపున ఎన్నికల ప్రచార సభకు దేశ ప్రధాని నరేంద్ర మోడీ అటెండ్ అవుతున్నారు.
మే 4న నారాయణపేట జిల్లా కేంద్రంలో నిర్వహించే బహిరంగ సభలో ఆయన పాల్గొననున్నారు. బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్ మన్నె శ్రీనివాస్ రెడ్డికి మద్దతుగా శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రానికి మాజీ సీఎం కేసీఆర్ హాజరై, ఆయన తరపున ఎన్నికల ప్రచార సభలో పాల్గొని మాట్లాడారు. వీరితో పాటు మరికొందరు జాతీయ నాయకుల టూర్లు పాలమూరు పార్లమెంట్లో ఉండేలా క్యాండిడేట్లు ప్రయత్నాలు చేసుకుంటున్నారు.