- హైదరాబాద్ పైనే అందరి దష్టి
- ఏపీ లోనూ సేమ్ డే అసెంబ్లీ ఎలక్షన్
- డబుల్ ఓట్లున్న వారు ఎటు వెళ్తారు?
- ఎండలు బ్రేక్ చేస్తాయా..? ఏపీ లాక్కెళ్తుందా?
- వరుస సెలువులు దెబ్బతీస్తాయా?
- ఓటింగ్ శాతం తగ్గితే ఎవరికి నష్టం
- అంచనాలు వేసుకుంటున్న అభ్యర్థులు
హైదరాబాద్: లోక్ సభ ఎన్నికల పోలింగ్ కు కౌంట్ డౌన్ మొదలైంది. మరో పది రోజుల్లో పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో పార్టీలు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలో పోలింగ్ శాతం పడిపోతుండటం పార్టీలను, ఎన్నికల కమిషన్ ను ఆందోళనకు గురి చేస్తోంది. ఇదే తరుణంలో ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు, తెలంగాణలో పార్లమెంటు ఎన్నికలు ఒకే రోజును జరుగుతున్నాయి. చాలా మంది ఏపీ వాసులు హైదరాబాద్ లో ఓటర్లుగా ఉన్నారు. రాష్ట్ర విడిపోయిన తర్వాత ఏపీలో ఓటునే పక్కా చేసుకున్నారని తెలుస్తోంది. అక్కడ ఆధార్ కార్డుతో లింక్ చేసుకున్నారు. కానీ ఇక్కడున్న పాత ఓటు అలాగే కొనసాగుతోంది. అదే బేస్ చేసుకొని ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు.
మే 13వ తేదీన ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నందున మెజార్టీ ఏపీ వాసులు అక్కడికి వెళ్లి ఓటు హక్కు వినియోగించుకుంటే ఇక్కడ పోలింగ్ పర్సంటేజీ పడిపోయే అవకాశం ఉంది. ముఖ్యంగా ఏపీ అసెంబ్లీ ఎన్నికల ప్రభావం జీహెచ్ఎంసీ పరిధిలోని 24 అసెంబ్లీ, మూడు పార్లమెంటు నియోజకవర్గాలపై ఉంటుంది. జీహెచ్ఎంసీ పరిధిలోని కూకట్ పల్లి, శేరిలింగంపల్లి, మియాపూర్, చందానగర్, ప్రగతినగర్, కేపీహెచ్బీ, బీహెచ్ఈఎల్, అశోక్ నగర్, నిజాంపేట, కుత్బుల్లాపూర్, దిల్ సుఖ్ నగర్, మలక్ పేట, సరూర్ నగర్, చైతన్యపురి, ఎల్బీనగర్, వనస్థలిపురం, ఉప్పల్, సనత్ నగర్ తదితర ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారు 40 లక్షల మంది ఓటర్లున్నారు. వీళ్లంతా సొంత రాష్ట్రంపై మమకారంతో అక్కడికి వెళ్లి ఓట్లు వేస్తే పోలింగ్ శాతం ఇంకా పడిపోయే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది.
అసెంబ్లీ ఎన్నికల్లోనూ..
గత ఏడాది డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ జిల్లాలోనే తక్కువ పోలింగ్ శాతం నమోదవడం గమనార్హం. హైదారాబాద్ జిల్లాలో 15 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 46.68శాతం ఓటింగ్ నమోదైంది. ఏపీ వాసులు ఎక్కవగా నివసించే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 14 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా ఓటింగ్ శాతం అరవై లోపే నమోదైంది. పక్కనే సిటీకి ఆనుకొని ఉన్న యాదాద్రి జిల్లాలో రికార్డు స్థాయిలో 90.03శాతం పోలింగ్ తో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలవడం విశేషం.
పోలింగ్ పై నీలినీడలు?!
ఈ సారి పోలింగ్ పై ఏపీ ఎన్నికల ప్రభావం ఉంటుందనే టాక్ జోరుగా వినిపిస్తోంది. వేసవి సెలవులు కావడంతో హైదరాబాద్ లో స్థిరపడ్డ ఏపీ వాసులకు సంబంధించిన చాలా ఫ్యామిలీలు సొంత రాష్ట్రానికి వెళ్లాయని తెలుస్తోంది. వాళ్లంతా ఓటు హక్కు అక్కడే వినియోగించుకుంటే ఇక్కడ పోలింగ్ శాతం తగ్గే ప్రమాదం ఉంది. పోలింగ్ ఈ సారి సోమవారం జరుగుతోంది. రెండో శనివారం, ఆదివారం, తర్వాత పోలింగ్ డే (సోమవారం) ఉంటుంది. అంటే ఐటీ ఉద్యోగులకు, బ్యాంకు ఉద్యోగులు, పలు ప్రభుత్వ రంగ సెలవులకు వరుస సెలవులు వస్తున్నాయి. దీంతో శుక్రవారం సాయంత్రమే ట్రిప్ కు బయల్దేరితే పోలింగ్ పర్సంటేజ్ పడిపోవడం ఖాయమనే వాదన బలంగా వినిపిస్తోంది.
అంచనాల్లో అభ్యర్థులు
ఏపీ ఎన్నికలు, వరుస సెలవుల ప్రభావం పోలింగ్ శాతంపై పడితే ఎలా..? అన్న టెన్షన్ రాజకీయ పార్టీలను వెంటాడుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో జీహెచ్ఎంసీ పరిధిలోని దాదాపు అన్ని సెగ్మెంట్లలో బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు. బీజేపీ, ఎంఐఎం పాతనగరంలోని పలు స్థానాల్లో విజయం సాధించాయి. ఏపీ వాసులు అక్కడ ఓటు హక్కు వినియోగించుకుంటే బీఆర్ఎస్ ఓట్లకు గండిపడే ప్రమాదం ఉందన్న విశ్లేషణలున్నాయి. ఓటింగ్ శాతం తగ్గడం ఎవరికి లాభం చేకూర్చతుందనేది ఆసక్తికరంగా మారింది.
హైదరాబాద్ పరిధిలోని
4 సెగ్మెంట్లలో ఇదీ పరిస్థితి
నియోజకవర్గం 2014 2019
హైదరాబాద్ 53.27 39.49
సికింద్రాబాద్ 53.06 44.99
మల్కాజ్ గిరి 51.05 49.11
చేవెళ్ల 60.51 53.80