- హైదరాబాద్‌లో 46.08%, సికింద్రాబాద్‌లో 48.11%, మల్కాజ్‌గిరిలో 50.12% ఓటింగ్
- పోలైన ఓట్లలో ఎవరి షేర్ ఎంతో?
- జనం మొగ్గు ఎటువైపోనని అభ్యర్థుల ఆందోళన
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని పలు పార్లమెంట్ సెగ్మెంట్లలో ఓటింగ్‌శాతం భారీగా తగ్గడంతో అభ్యర్థులు టెన్షన్ లో పడ్డారు. ప్రధానంగా అర్బన్ ఏరియాల్లోనే ఓటింగ్‌శాతం గణనీయంగా పడిపోయింది. గ్రామీణ ప్రాంతాల్లో కొంత మెరుగ్గానే పోలింగ్ నమోదు కాగా, పట్టణ ప్రాంతాలకు వచ్చే సరికి పరిస్థితి తారుమారైంది. ఫలితంగా ఓటింగ్ సరళిని కూడా అంచనా వేయలేకపోతున్నారు. దీంతో ఇప్పటివరకు గెలుపుపై ధీమా వ్యక్తం చేసిన నేతలు అయోమయంలో పడ్డారు. బస్తీ ఓటర్లను తరలించలేకపోవడం, అపార్ట్మెంట్ వాసులను కదిలించలేక పోవడంతో ఇన్నాళ్లు గెలుపుపై అభ్యర్థులు పెట్టుకున్న ఆశలు గల్లంతయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఓట్ల పోలరైజేషన్ తో ఓటర్లు ఎటువైపు మొగ్గారో అన్నది అభ్యర్థులకు అంతుపట్టకుండా ఉంది.
సాయంత్రం 4 తర్వాతే కదిలిన ఓటర్లు
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి లోక్ సభ సెగ్మెంట్లలో పోలింగ్ ఆశించిన స్థాయిలో జరకపోవడం అభ్యర్థులను కలవరపరుస్తోంది. హైదరాబాద్ స్థానంలో కేవలం 46.08 శాతం మాత్రమే ఓటింగ్ నమోదైంది. సికింద్రాబాద్ సెగ్మెంట్ లోనూ 48.11 శాతమే ఓట్లు పడ్డాయి. ఇక దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గమైన మల్కాజిగిరి సెగ్మెంట్లో సైతం 50.12 శాతమే పోలింగ్ జరిగింది. హైదరాబాద్ పరిధిలోని అనేక పోలింగ్ కేంద్రాలకు సాయంత్రం 4 గంటల తర్వాతే ఓటర్లు ఎక్కువగా తరలివచ్చారు. సాయంత్రం 6 గంటలలోపు క్యూలైన్లలో ఉన్న వారందరికీ ఓటు వేసే అవకాశం ఉన్నందున సిటీలో రాత్రి వరకూ పోలింగ్ కొనసాగింది. అయితే, సాయంత్రం 6 గంటల తర్వాత నమోదైన పోలింగ్ ను లెక్కలోకి తీసుకున్నా.. హైదరాబాద్ స్థానంలో పోలింగ్ పర్సెంటేజీ 50%కు మించకపోవచ్చని అంచనా వేస్తున్నారు.
సెటిలర్లు ఏపీ బాట పట్టడంతోనే?
మల్కాజిగిరి పరిధిలో ఉన్న ఓటర్లలో చాలా వరకు సెటిలర్లు కావడంతో వారికి ఏపీ, తెలంగాణలో రెండు రాష్ట్రాల్లో ఓట్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికలు కీలకంగా మారడంతో వారంతా ఏపీలో ఓటు వేయడానికే మొగ్గు చూపారని, అందుకే ఓటింగ్ శాతం తగ్గిందని పొలిటికల్ ఎనలిస్టులు అంటున్నారు. అలాగే చేవెళ్ల పార్లమెంట్ స్థానంలోనూ 55.45 శాతం మాత్రమే పోలింగ్ జరిగింది. చేవెళ్ల పరిధిలోని శేరిలింగంపల్లి అసెంబ్లీ సెగ్మెంట్ లోనూ సెటిలర్లు ఎక్కువగా ఉండటం, వారంతా ఏపీలో ఓటేసేందుకే వెళ్లడంతో ఇక్కడ కూడా పోలింగ్ పర్సెంటేజీ తగ్గిందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
ఏ వర్గం ఓట్లు ఎటువైపో?
సికింద్రాబాద్ లోక్ సభ స్థానంలో 48.11 శాతం ఓటింగ్ మాత్రమే నమోదు కావడంతో అభ్యర్థుల గెలుపోటములు డేంజర్లో పడ్డాయి. ఇక్కడ పోటీ చేస్తున్న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అర్బన్ ఎడ్యుకేటెడ్ ఓటర్లపైనే ఆశలు పెట్టుకున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్, బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావుకు మాత్రం బస్తీ పబ్లిక్ ఓట్లపైనే ఆశలు ఉన్నాయి. అయితే, పోలింగ్ శాతం తగ్గడంతో ఎవరు ఎటువైపు టర్న్ అవుతారనేది అభ్యర్థులకు అంతుపట్టకుండా ఉంది. దీంతో ఇప్పటివరకు గెలుపు ధీమాతో ఉన్న వారు అయోమయంలో పడ్డారు.