టీఎస్ పీఎస్ సీ (TSPSC) కార్యాలయం దగ్గర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. గ్రూప్ 2 పరీక్ష వాయిదా వేయాలంటూ బోర్డు అధికారులకు అభ్యర్థులు వినతిపత్రం అందజేశారు. గ్రూప్ 2 వాయిదాపై బోర్డు అధికారులు రెండు రోజులు టైమ్ అడిగారు. అయితే బోర్డు చైర్మన్ జనార్ధన్ రెడ్డి అందుబాటులో లేరని సమాచారం. దీంతో బోర్డు అధికారులు బోర్డుపై నమ్మకంలేదు.. చైర్మన్ ను మార్చాలని అభ్యర్థులు డిమాండ్ చేశారు. గ్రూప్ 2 ఎకానమీ పేపర్ లో అదనపు సిలబస్ పై ఆందోళన వ్యక్తం చేశారు. ఎకనామీకి సంబంధించిన ఒకే బుక్ సర్కార్ రిలీజ్ చేసిందని అభ్యర్థులు తెలిపారు. వారంలోనే గ్రూప్ 2, లెక్చరర్, గురుకులాల పరీక్షలు ఎలా నిర్వహిస్తారని మండిపడ్డారు. మేం రూ. 3వేల నిరుద్యోగ భృతి అడగట్లే.. మూన్నెళ్ల గడువు కోరుతున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు.
TSPSC ఆఫీస్ ముట్టడికి పిలుపునిచ్చిన గ్రూప్ 2 అభ్యర్థులు భారీగా తరలివచ్చారు. జిల్లాల నుంచి వేలాది మంది విద్యార్థులు తరలివచ్చి టీఎస్ పీఎస్ సీ ముట్టడికి యత్నించారు. దీంతో విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. టీఎస్ పీఎస్ సీ ముందు ప్లకార్డులు పట్టుకుని ఆందోళనకు దిగారు. వారంలోనే నాలుగు పోటీ పరీక్షలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రూప్ 2 అభ్యర్థులకు ఓయు జేఏసీ నాయకుల మద్దతు పలికారు. గ్రూప్ 2కు సంబంధించిన పుస్తకాలు కూడా అందుబాటులోకి రాలేవని అభ్యర్థులు వాపోయారు.
నిరుద్యోగులు అడిగేది న్యాయమైన డిమాండ్ అని కోదండరాం అన్నారు. గ్రూప్ 2 పరీక్ష వాయిదా వేయాలని ఆయన కోరారు. గ్రూప్ 2 వాయిదాపై ప్రభుత్వం ఆలోచన చేయాలని కోదండరాం తెలిపారు. గ్రూప్ 2 అభ్యర్థుల TSPSC కార్యాలయ ముట్టడి పిలుపుతో పోలీసుల అలర్ట్ అయ్యారు. అయితే TSPSC కార్యాలయ పరిసరాల్లోకి ఎవరు వచ్చినా వారిని పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు.