
- హైదరాబాద్, తదితర చోట్ల ఉంటున్న వారి వివరాల సేకరణ
- పోలింగ్ రోజు రప్పించేందుకు ఏర్పాట్లు
- ఛార్జీలు, ఖర్చులు భరించేందుకు రెడీ
మెదక్, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా మెజారిటీ ఓట్లు సాధించేందుకు ప్రధాన పార్టీల అభ్యర్థులుఅన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక్కో ఓటు ఎంతో కీలకమైనదిగా భావిస్తున్నారు. ఇందుకోసం ఎవరినీ వదలొద్దని డిసైడ్ అయ్యారు. ఓ వైపు పాదయాత్రలు, ఇంటింటి ప్రచారాల ద్వారా స్థానికంగా ఉంటున్న ఓటర్ల మద్దతు కూడగట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు ఉద్యోగం, వ్యాపారం, ఉపాధి, ఉన్నత చదువుల కోసం హైదరాబాద్, తదితర ప్రాంతాల్లో నివాసం ఉంటున్న ఓటర్లపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తున్నారు.
హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో..
జిల్లాలోని మెదక్, నర్సాపూర్, దుబ్బాక, గజ్వేల్నియోజకవర్గ పరిధిలోని పట్టణాలు, ఆయా మండలాల్లోని వివిధ గ్రామాలకు చెందిన అనేక కుటుంబాలు ఉద్యోగాలు, ఉపాధి, పిల్లల ఉన్నత చదువుల కోసం హైదరాబాద్చుట్టుపక్కల ప్రాంతాల్లో నివాసం ఉంటున్నారు. ప్రధానంగా ఉద్యోగులు, టీచర్లు, సాఫ్ట్వేర్ఇంజనీర్లు, బిజినెస్మెన్, ప్రైవేట్ఎంప్లాయిస్, ఆయా కంపెనీల్లో, అపార్ట్మెంట్లలో పనిచేస్తున్నవారు హైదరాబాద్నగర శివార్లలోని కొంపల్లి, సుచిత్ర, అల్వాల్, బొల్లారం, చింతల్, బాల్నగర్, జగద్గిరిగుట్ట, బాచుపల్లి, నిజాంపేట, మియాపూర్, కూకట్పల్లి, బీరంగూడ, అమీన్పూర్ ఏరియాల్లో ఉంటున్నారు.
గ్రామాలు, వార్డుల వారీగా..
వలస ఓటర్లపై కన్నేసిన క్యాండేట్లు స్థానిక నేతల ద్వారా ఓటరు లిస్టులు పరిశీలిస్తూ హైదరాబాద్, తదితర చోట్ల ఉంటున్న ఓటర్లు ఎవరనేది పరిశీలిస్తున్నారు. ఎవరెవరు, ఎక్కడెక్కడ ఉంటున్నారని ఆరా తీస్తున్నారు. వారందరినీ పోలింగ్ రోజు రప్పించే బాధ్యతను లోకల్ లీడర్లకు అప్పగిస్తున్నారు. ఇతర ప్రాంతాల్లో ఉంటున్న వారి సెల్‌ఫోన్ నెంబర్లు సేకరించి రెండు మూడు రోజులకు ఒకసారి వారితో మాట్లాడే ఏర్పాటు చేశారు. వారికి వాట్సప్ మెసేజ్ లు పంపుతున్నారు. కచ్చితంగా ఓటు వేసి వెళ్లాలని అభ్యర్థిస్తున్నారు.
వెహికల్, బస్‌చార్జీలు ఇస్తాం
పోలింగ్ రోజు సొంత ఊర్లకు వచ్చి ఓటు వేసేందుకు వీలుగా హైదరాబాద్, తదితర ప్రాంతాల్లో ఉంటున్న ఓటర్లకు పార్టీ లీడర్లు వెహికల్స్ ఏర్పాటు చేస్తామని చెబుతున్నారు. ఐదు, పది మందికి ఒక వెహికల్ చొప్పున ఏర్పాటు చేస్తామని అంటున్నారు. ఒకరిద్దరు ఉంటే వారికి రాను పోను బస్‌చార్జీలు చెల్లిస్తామని చెబుతున్నారు. ఇలా ఏ ఒక్క ఓటరు మిస్ కాకుండా అందరూ ఓటేసేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పొలిటికల్ లీడర్లు గెలవడానికి ఏ ఒక్క అవకాశాన్ని మిస్ చేసుకోవడం లేదు.