కాంగ్రెస్​ క్యాండిడేట్స్ ఎవరు?.. ఉమ్మడి జిల్లాలో 4 స్థానాలు పెండింగ్​

  • బాన్సువాడ, జుక్కల్, నిజామాబాద్ అర్బన్ లపై కొనసాగుతున్న సస్పెన్స్​
  • కామారెడ్డిలో ఇంకా ఖరారు కాని క్యాండిడేట్​ 
  • కేసీఆర్​పై నిలబడేదెవరు?

కామారెడ్డి, వెలుగు: ఉమ్మడి  నిజామాబాద్​ జిల్లాలో  పోటీచేసే అభ్యర్థులను ప్రకటించడంలో కాంగ్రెస్​ పార్టీ వేచి చేసే విధానాన్ని అవలంభిస్తున్నది. 9 అసెంబ్లీ నియోజక వర్గాలకు గాను  5 చోట్ల అభ్యర్థులను ప్రకటించింది.  4 చోట్ల పెండింగ్​లో పెట్టింది.     కామారెడ్డి జిల్లాలో 3, నిజామాబాద్​ జిల్లాలో  ఒక స్థానం పెండింగ్​లో ఉంది.  కామారెడ్డి, బాన్సువాడ, జుక్కల్, నిజామాబాద్​ ఆర్బన్​ సెగ్మెంట్లకు  అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.  బీఆర్ఎస్ నుంచి కామారెడ్డిలో  కేసీఆర్​ పోటీచేస్తుండగా  ఇక్కడ   కాంగ్రెస్​ పార్టీ ఇంకా అభ్యర్థిని ఖరారు చేయలేదు.  

ఫస్ట్​ లిస్టులోనే కామారెడ్డి అభ్యర్థి  పేరు ప్రకటిస్తారని  పార్టీ వర్గాలు భావించాయి. కానీ సెకండ్ లిస్టులో కూడా  అభ్యర్థి ఎవరనేది తేలలేదు.   ఇక్కడ  పోటీ చేయడానికి మొదటినుంచి ఆ పార్టీ సీనియర్​ నేత షబ్బీర్​ అలీ ఆసక్తి చూపుతున్నారు.  నియోజక వర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. కొద్ది నెలలుగా  గ్రామాల్లో  ప్రచారం కూడా  చేసుకుంటున్నారు. ఈయన పేరు ఫస్టు లిస్టులోనే ఉంటుందని అందరూ అనుకున్నారు.

కానీ   కేసీఆర్​పై టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్​రెడ్డిని నిలబెట్టేలా హైకమాండ్ ఆలోచిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.  ఈ కారణంగానే ఫస్ట్​, సెకండ్​ లిస్టులో  పేరు ప్రకటించలేదని భావిస్తున్నారు.  నిజామాబాద్​ ఆర్బన్​ నుంచి  పోటీచేయాలని షబ్బీర్ అలీకి హైకమాండ్ సూచించిందనే  ప్రచారం పార్టీ వర్గాల్లో  జరుగుతోంది. మరోవైపు కామారెడ్డిలో  ఖచ్చితంగా  షబ్బీర్​ అలీయే  బరిలో ఉంటారనే వాదన కూడా వినిపిస్తోంది. 

జుక్కల్​, బాన్సువాడపై  కొనసాగుతున్న సస్పెన్స్​

జుక్కల్, బాన్సువాడ నియోజక వర్గాలపై ఇంకా సస్పెన్స్​ కొనసాగుతోంది.  జుక్కల్​లో  టికెట్​ కోసం  ముగ్గురు అప్లయ్​ చేసుకున్నారు. ఇందులో మాజీ ఎమ్మెల్యే సౌదగర్​ గంగారాం, ఎన్ఆర్ఐ  లక్ష్మీకాంతరావు మధ్య  టికెట్​ కోసం పోటీ నడుస్తోంది. సెకండ్ లిస్టులో ఇక్కడి అభ్యర్థిని ప్రకటిస్తారనే ప్రచారం జరిగినా చివరి నిమిషంలో  ఆపారని చెబుతున్నారు. బాన్సువాడలో  టికెట్​ కోసం పలువురు అప్లయ్​ చేసుకున్నప్పటికీ పార్టీ హైకమాండ్ ఇంకా ఏవరికీటికెట్​ ఇవ్వలేదు.

 అధికార పార్టీ అభ్యర్థిని  దీటుగా  ఎదుర్కొనే వారికే టికెట్​ ఇవ్వాలనే ఆలోచనలో హైకమాండ్ ఉన్నట్లు పార్టీ నాయకులు పేర్కొంటున్నారు.  ఇటీవల పార్టీలో చేరిన ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే  ఏనుగు రవీందర్​రెడ్డికే  టికెట్ ఇచ్చే అవకాశముందని  అంటున్నారు. మరో వైపు  సోమవారం  బాన్సువాడ బీజేపీ ఇన్​చార్జి  మల్యాద్రిరెడ్డి  హైదరాబాద్​లో  టీపీపీసీ ప్రెసిడెంట్ రేవంత్​రెడ్డి సమక్షంలో  కాంగ్రెస్​లో చేరారు.  ఈ పరిస్థితుల్లో టికెట్ ఎవరిని వరిస్తుందనేది  ఆసక్తిగా మారింది. 

నిజామాబాద్​ ఆర్బన్​

నిజామాబాద్​ జిల్లాలో ఐదు అసెంబ్లీ  స్థానాలకు గాను  4 చోట్ల అప్పటికే అభ్యర్థులు ఖరారు అయ్యారు.  నిజామాబాద్ అర్బన్​ పెండింగ్​లో పెట్టారు.  ఇక్కడ బీసీ, మైనార్టీ వర్గాల ఓట్లు ఎక్కువగా  ఉన్నాయి.  కామారెడ్డిలో రేవంత్​రెడ్డి  పోటీ చేస్తే  నిజామాబాద్ అర్బన్​ టికెట్ షబ్బీర్​అలీకి ఇస్తారని భావిస్తున్నారు. ఇక్కడ బీసీ లేదా మైనార్టీ వర్గానికి చెందిన వారికి టికెట్​ ఇచ్చే అలోచనలో పార్టీ ఉన్నట్లు సమాచారం.  బీఆర్​ఎస్ నుంచి మాజీ ఎమ్మెల్సీ  ఆకుల లలిత ఇటీవల కాంగ్రెస్​లో చేరడంతో ఎవరిని ఎంపిక చేస్తారని పార్టీ శ్రేణులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.