టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్(టీఆర్టీ) నోటిఫికేషన్ పై అభ్యర్థులు భారీ ఆశలు పెట్టుకున్నారు. 80 వేల ఖాళీల భర్తీలో భాగంగా ఇప్పటికే వివిధ ఉద్యోగాలకు ఆర్థిక శాఖ అనుమతి ఇవ్వడం, ఆ వెంటనే నోటిఫికేషన్లు జారీ కావడం జరిగింది. కానీ టెట్ ముగిసి 8 నెలలు అవుతున్నా ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి ఇవ్వడం లేదు. దీంతో రాష్ట్రంలో 4 లక్షల మంది అభ్యర్థులు నిరాశకు గురవుతున్నారు. టీచర్ల పదోన్నతులు బదిలీల ప్రక్రియ రాబోయే 40 రోజుల్లో పూర్తి చేసిన తర్వాత మళ్లీ కొత్తగా టీచర్ల ఖాళీల వివరాలు తేలతాయి. కొత్త ఖాళీలకు మార్చి లేదా ఏప్రిల్ లో ఆర్థిక శాఖ అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తే మే నెలలో టీఆర్టీ నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశం ఉంది.
ఏడాది క్రితం ఆర్థిక శాఖ అనుమతి కోసం 9600 పోస్టులతో విద్య శాఖ అధికారులు ఫైల్ పంపారు. ఆ ఫైల్ ఇప్పటికీ పెండింగ్ లోనే ఉంది. ఇప్పుడు టీచర్ల బదిలీలు, పదోన్నతులు ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత ప్రమోషన్ల ద్వారా ఏర్పడే 10 వేల ఖాళీలను కూడా పాత ఖాళీల్లో కలిపి భారీ నోటిఫికేషన్విడుదల చేయాలని నిరుద్యోగులు కోరుకుంటున్నారు. గత 8 ఏండ్లుగా పదోన్నతులు ఆపడం వల్ల విద్యా వ్యవస్థ గాడి తప్పింది. ఇక ఉద్యోగుల పదవీ విరమణ వయసు 58 నుంచి 61 ఏండ్లకు పెంచడం వల్ల నిరుద్యోగ యువతకు తీవ్ర అన్యాయం జరిగింది. గత 6 సంవత్సరాలుగా టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ రాలేదు. ప్రభుత్వం ఇప్పటికైనా పారదర్శకంగా బదిలీల, పదోన్నతుల ప్రక్రియ పూర్తి చేసి, కొత్త ఖాళీలతో కలిపి టీఆర్టీ నోటిఫికేషన్ వేయాలి.
‑ రావుల రామ్మోహన్ రెడ్డి, డీఎడ్, బీఎడ్ అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు