- ఓటింగ్ సరళిపై లెక్కలేసుకుంటున్న పార్టీలు
- గెలుపు ధీమాలో కాంగ్రెస్,బీజేపీ.. మళ్లీ మేమే అంటున్న బీఆర్ఎస్
ఆదిలాబాద్ నెట్వర్క్, వెలుగు : ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నాటి నుంచే గెలుపే ధ్యేయంగా ఊరువాడా విస్తృత ప్రచారం చేసిన ఆయా పార్టీల అభ్యర్థులు పోలింగ్ ముగియడంతోనే గెలుపోటములపై లెక్కలేసుకుంటున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పది అసెంబ్లీ సెగ్మెంట్లలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ల అభ్యర్థులు ఎవరికి వారే గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. సిర్పూర్ లో బీఎస్పీ అభ్యర్థి డాక్టర్ ప్రవీణ్ కుమార్ సైతం గెలుపుపై ధీమాతో ఉన్నారు. అభ్యర్థులంతా తమ నియోజకవర్గ పరిధిలోని పోలింగ్ స్టేషన్ల వారీగా పోలైన ఓటింగ్ సరళిని విశ్లేషిస్తూ గెలుపోటములపై అంచనాలు వేసుకుంటున్నారు.
ముఖ్యంగా అభ్యర్థుల తలరాతలు మార్చే అవకాశాలున్న మైనార్టీలతోపాటు మహిళా ఓటర్లు, యూత్ ఏ పార్టీకి మొగ్గు చూపారోనని ఆరా తీస్తున్నారు. వర్గాల వారీగా పోలైన ఓట్లను అంచనా వేస్తున్నారు. అన్ని పార్టీల కార్యకర్తలు కూడా తమకే మెజారిటీ వస్తుందంటూ అభ్యర్థులకు భరోసానిస్తున్నారు. అయితే ఈసారి బీఆర్ఎస్ సర్కార్‌పై ఉమ్మడి జిల్లాలో పెద్ద ఎత్తున వ్యతిరేక ఉన్నట్లు కనిపిస్తోంది.
సంక్షేమ అభివృద్ధి పథకాల పంపకం, ఎమ్మెల్యేలపై వచ్చిన ఆరోపణలు, టీఎస్సీపీఎస్సీ పేపర్ లీకేజీలు, ఉద్యోగాల భర్తీ చేపట్టకపోవడం తదితర అంశాలు యూత్ ఓటర్లలో బీఆర్ఎస్పై వ్యతిరేకత పెరగడానికి కారణమైనట్లు తెలుస్తోంది. దీని ఆధారంగా మూడు పార్టీలు గెలుపోటములపై లెక్కలు వేసుకుంటున్నాయి. సర్కార్ వ్యతిరేక ఓటు ఏ పార్టీకి అనుకూలిస్తుందోననే చర్చ జోరుగా సాగుతోంది. ఆదివారం ఫలితాలు వెల్లడికానుండడంతో అభ్యర్థుల్లో ఉత్కంఠ పెరిగిపోతోంది.
సిర్పూర్ లో బీఆర్ఎస్ వర్సెస్ బీఎస్పీ..
జనరల్ నియోజకవర్గం సిర్పూర్లో యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. ఈ స్థానం నుంచి బీఆర్ఎస్ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, బీజేపీ నుంచి హరీశ్ బాబు, కాంగ్రెస్ నుంచి రావి శ్రీనివాస్ బరిలో దిగగా.. బీఎస్పీ నుంచి ఆ పార్టీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇదే స్థానంలో పోటీలో నిలవడం తీవ్రతను మరింత పెంచింది. నాలుగు పార్టీల అభ్యర్థులు గెలుపు కోసం అన్ని ఆయుధాలను వినియోగించారు.
అయినప్పటికీ పోలింగ్ తర్వాత ఓటరు నాడీ అంతుచిక్కకపోవడంతో ఆందోళనకు గురవుతున్నారు. ఓటింగ్ శాతాన్ని తెప్పించుకుని గెలుపు ఓటములపై లెక్కలు వేసుకుంటున్నారు. తొలుత బీఎస్పీ, బీజేపీ మధ్యనే ప్రధాన పోటీ ఉన్నట్టు రాజకీయ విశ్లేషకులు భావిస్తూ వచ్చారు. మొన్నటి వరకు వ్యతిరేక గాలి వీచిన సిట్టింగ్ఎమ్మెల్యే కోనప్ప కు పోలింగ్ రోజు పరిస్థితి కొంత సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆర్‌ఎస్‌ప్రవీణ్‌కుమార్ భారీ మెజారిటీతో గెలుస్తాననే ధీమాతో ఉన్నప్పటికీ ఆయనకు అనుకున్న స్థాయిలో ఓట్లు పడలేదనే చర్చ జరుగుతోంది. పోటీలోనే లేడనుకున్న కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాస్ చివరి రోజున అనూహ్యంగా పుంజుకున్నట్లు కనిపించింది. ఓట్లు చీలినప్పటికీ బీఆర్ఎస్, బీఎస్పీ మధ్యే ప్రధాన పోటీ ఉండనున్నట్లు చర్చ సాగుతోంది.
ఆసిఫాబాద్‌లో అంతుచిక్కని ఓటరు నాడి
ఎస్టీ నియోజకవర్గమైన ఆసిఫాబాద్‌లో మొన్నటి వరకు గెలుపు ధీమాతో ఉన్న బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు పోలింగ్ తర్వాత ఒకింత గందరగోళానికి గురవుతున్నారు. ఇక్కడి భారీగా ఉండే ఆదివాసీలు, లంబాడా ఓటర్లు రెండు గ్రూపులుగా చీలిపోయారు. గోండు ఓట్లు బీఆర్ఎస్ అభ్యర్థి కోవ లక్ష్మికి, లంబాడాల ఓట్లు కాంగ్రెస్ అభ్యర్థి శ్యామ్ నాయక్‌కు పోల్ అవుతాయని మొదట అందరూ భావించారు. కానీ గోండు సామాజిక వర్గానికి చెందిన ఇండిపెండెంట్ అభ్యర్థి కోట్నాక్ విజయ్ కుమార్, బీజేపీ అభ్యర్థి ఆత్మరామ్ నాయక్ ఎవరి ఓట్లు చీలుస్తారోననే విషయం చర్చనీయాంశంగా మారింది.
బీజేపీ టికెట్ దక్కకపోవడంతో ఇండిపెండెంట్ బరిలో దిగిన విజయ్ కుమార్ ఆదివాసీ మండలాల్లో ఉనికి చాటుకోవడంపై బీఆర్ఎస్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఏజెన్సీ మండాలలైన తిర్యాణి, జైనూర్, సిర్పూర్ యు, కెరమెరి, లింగాపుర్, వాంకిడి మండలాల్లో భారీ స్థాయిలో ఆయన ఆదివాసీల ఓట్లు కొల్లగొట్టినట్లు పోలింగ్ సరళిని బట్టి తెలుస్తోంది. ఇదే జరిగితే కోవ లక్ష్మికి భారీ మూల్యం తప్పదు. అయితే ఏజెన్సీ మండలాలతోపాటు కెరమెరి, లింగాపుర్, నార్నూర్ మండలాల్లోని లంబాడా ఓటర్లు తమవైపే మొగ్గు చూపారని గులాబీ శ్రేణులు ధీమాగా ఉన్నారు. ఈ పరిస్థితిని బట్టి చూస్తే చివరి క్షణంలో అదృష్టం ఎవరిని వరిస్తుందోననే ఉత్కంఠ సాగుతోంది.
మంచిర్యాల జిల్లాలోని అన్ని స్థానాల్లో కాంగ్రెస్ హవా
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఏ సర్వే సంస్థ కూడా ఏ ఒక్క పార్టీకి మెజారిటీ సీట్లు కట్టబెట్టలేదు. అన్ని పార్టీలు మూడు నుంచి నాలుగు స్థానాలు గెలుస్తాయంటూ వెల్లడించడంతో ఆ స్థానాల్లో అభ్యర్థులు టెన్షన్ పడుతున్నారు. సర్వేలు ఇచ్చిన రిపోర్టులపై ఓటర్ల నాడి ఎలా కనిపించిందనే విషయంపై మండల, గ్రామ స్థాయిలో కార్యకర్తల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూర్ లో కాంగ్రెస్‌వైపే ఎగ్జిట్ పోల్స్ మొగ్గు చూపాయి.
ఆదిలాబాద్ జిల్లాలోని అదిలాబాద్, బోథ్ నియోజకవర్గాలో పెద్ద ఎత్తున పోలింగ్ జరగడంతో అభ్యర్థులు ఎవరి ధీమాలో వారు ఉన్నారు. ఈసారి బీఆర్ఎస్కు కాంగ్రెస్, బీజేపీ గట్టి పోటీనిచ్చాయని.. మూడు ప్రధాన పార్టీలకు అర్బన్, రూరల్ ఏరియాలో త్రిముఖ పోరు తప్పదంటున్నారు. దీంతో ఈ రెండు నియోజకవర్గాల్లో అభ్యర్థుల గెలుపోటముల్లో ఓట్ల తేడా స్వల్పంగానే ఉండే అవకాశాలున్నాయి. అదిలాబాదులో మైనార్టీ, మున్నూరు కాపు సామాజిక వర్గాల ఓట్లపై బీఆర్ఎస్ ఆశలు పెట్టుకున్నప్పటికీ.. ఓటింగ్ సరళిని చూస్తే ఏ సామాజికవర్గం కూడా ఏ ఒక్క పార్టీకి పూర్తిస్థాయి మద్దతు ఇచ్చినట్లు కనిపించడంలేదు. నెలరోజుల ప్రచారం ఒక ఎత్తయితే.. ఎలక్షన్లకు ఒక రోజు ముందు భారీగా నగదు, మద్యం పంపిణీతో సమీకరణాలు మారినట్లు తెలుస్తోంది.