ఇండిపెండెంట్లకూ మస్తు ఓట్లు!

ఇండిపెండెంట్లకూ మస్తు ఓట్లు!
  • స్వతంత్రులు, చిన్న పార్టీలకు రాష్ట్రంలో వచ్చిన ఓట్లు 9,48,137
  • అత్యధికంగా వరంగల్​లో 85,284 ఓట్లు వాళ్లకే
  • మెదక్​లో 81,537, కరీంనగర్​లో 80,228, పెద్దపల్లిలో 76,718 ఓట్లు 
  • 5  స్థానాల్లో ఏఐడీఆర్​ పార్టీకి నాలుగో స్థానం.. నోటాకూ రాష్ట్రవ్యాప్తంగా 1.04 లక్షల ఓట్లు
  • మల్కాజిగిరిలో అత్యధికంగా 13,366.. ఆదిలాబాద్​లో 11,762 ఓట్లు నోటాకు 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో లోక్​సభ ఎన్నికల్లో ఇండిపెండెంట్లు, చిన్న పార్టీల అభ్యర్థులు ప్రభావం చూపించారు. ప్రత్యేకించి వరంగల్​, మెదక్​, కరీంనగర్​, పెద్దపల్లి, మహబూబ్​నగర్​, భువనగిరి సెగ్మెంట్లలో ఒక్కో చోట దాదాపు 80 వేల దాకా ఓట్లు వీళ్లకే వచ్చాయి. మొత్తంగా 17 నియోజకవర్గాల్లోనూ ఇండిపెండెంట్లు, చిన్న పార్టీల అభ్యర్థులకు కలిపి 9,48,137 ఓట్లు పోలయ్యాయి.

అత్యధికంగా వరంగల్​లో ఇండిపెండెంట్లు, చిన్న పార్టీల అభ్యర్థులకు కలిపి 85,284 ఓట్లు పోలయ్యాయి. మెదక్​లో 81,537, కరీంనగర్​లో 80,228, పెద్దపల్లిలో 76,718, మహబూబాబాద్​లో 76,232, భువనగిరిలో 75,717 ఓట్లు వారికి పడ్డాయి. అత్యల్పంగా హైదరాబాద్​ సెగ్మెంట్​లో ఇండిపెండెంట్లకు 9,940 ఓట్లు పోలయ్యాయి.

ఇటు నోటాకూ రాష్ట్రవ్యాప్తంగా 1,04,244 ఓట్లు పడగా.. అత్యధికంగా మల్కాజ్​గిరి నియోజకవర్గంలో 13,366 మంది నోటాకు ఓటేశారు. ఆదిలాబాద్​లోనూ 11,762 ఓట్లు నోటాకు పడ్డాయి.

ఏఐడీఆర్​కు చాలా చోట్ల ఫోర్త్​ ప్లేస్​

ఆలిండియా డెమొక్రటిక్​ రీఫార్మ్స్​(ఏఐడీఆర్) పార్టీ రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో ఫోర్త్​ ప్లేస్​లో నిలిచింది. ఆదిలాబాద్​, మహబూబ్​నగర్​, మెదక్​, నాగర్​కర్నూల్​, వరంగల్​ నియోజకవర్గాల్లో ఆ పార్టీ నాలుగో ప్లేస్​లో ఉంది.  అయితే, బహుజన్​ సమాజ్​ పార్టీ ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోయిది. చాలా చోట్ల ఇండిపెండెంట్లకు వచ్చినన్ని ఓట్లను కూడా ఆ పార్టీ సాధించలేకపోయింది.