జనాల డేటా వాడేస్తున్నరు బీఆర్ఎస్ చేతిలో పథకాల లబ్ధిదారుల లిస్టు

జనాల డేటా వాడేస్తున్నరు బీఆర్ఎస్ చేతిలో పథకాల లబ్ధిదారుల లిస్టు
  •     కారుకే ఓటేయాలని ఫోన్లు, మెసేజ్​లు 
  •     సీఎం ఇంట్ల నుంచి ఇస్తున్నరా? 
  •     అని ఓటర్ల ఎదురు ప్రశ్నలు  
  •     జాబ్ నోటిఫికేషన్లపై నిరుద్యోగుల ఫైర్ 
  •     మరో వైపు ఆరు గ్యారంటీలపై కాంగ్రెస్ ​ప్రచారం 

కరీంనగర్, వెలుగు: ఓటర్లకు సంబంధించిన డేటాను ప్రధాన పార్టీల అభ్యర్థులు తమ ప్రచారానికి వాడుకుంటున్నారు. ఓటర్లను నేరుగా కలవకుండానే వారి రిజిష్టర్డ్ మొబైల్ నంబర్ కు రోజూ మూడు, నాలుగు సార్లు కంప్యూటర్ జనరేటెడ్ కాల్స్ చేయిస్తున్నారు. దీంతో వీటిని చాలామంది స్పామ్ కాల్స్ గా గుర్తించి రిజెక్ట్ చేస్తున్నారు. అధికారికంగా ప్రకటించే ఓటరు లిస్టులో ఎక్కడా ఓటర్ మొబైల్​నంబర్​లేకపోయినా.. అభ్యర్థులకు తమ నంబర్లు ఎలా చేరాయనేది ఓటర్లకు అంతుచిక్కడం లేదు.

 మరో వైపు తొమ్మిదేండ్లలో ప్రభుత్వ పథకాలతో లబ్ధిపొందిన వారి జాబితాను వివిధ శాఖల నుంచి బీఆర్ఎస్ పార్టీ తీసుకుని ఎన్నికల ప్రచారానికి వాడుకుంటోంది. నియోజకవర్గాల వారీగా ఏర్పాటు చేసిన కాల్ సెంటర్స్ నుంచి టెలీ కాలర్స్ తో లబ్ధిదారులకు ఫోన్లు చేయించి కారు గుర్తుకే ఓటేయాలని కోరుతున్నారు. వారి ఫోన్ నంబర్లకు ‘మీరు ఫలానా స్కీమ్ లో ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందారు. అందుకని మీ ఓటు కారుకే వేయాలి’ అంటూ బీఆర్ఎస్ అభ్యర్థుల పేరుతో మెసేజ్​లు పంపడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు కాంగ్రెస్​కూడా ఓటర్లను ఫోన్లు చేస్తే ఆరు గ్యారంటీలు పక్కాగా అమలు చేస్తామని ఓటేసి గెలిపించాలని కోరుతోంది. 

కారుకే ఎందుకు వేయాలంటూ...

కారు గుర్తుకు ఓటేయాలని ఫోన్ చేసి అడుగుతున్న బీఆర్ఎస్ టెలీ కాలర్స్ కు జనం షాకిస్తున్నారు. కారుకు ఓటెందుకు వేయాలంటూ రివర్స్ అటాక్ చేస్తున్నారు. ‘బీఆర్ఎస్ ప్రభుత్వం మీకు ఫలానా స్కీమ్ కింద డబ్బులు ఇచ్చింది కదా’ అంటే.. 'ఆ పైసలేమన్నా కేసీఆర్ ఇంట్లకెళ్లి ఇస్తుండ్లా’ అని కౌంటర్ ఇస్తున్నరు. దీంతో ఏం సమాధానం చెప్పాలో అర్థంకాక టెలీకాలర్స్ తలలు పట్టుకుంటున్నారు. 

ఇటీవల చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ కు ఓటెయ్యాలని కోరిన టెలీకాలర్ కు మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారం గ్రామానికి చెందిన దివ్యాంగుడైన ఫయాజ్ ఖాన్ షాక్ ఇవ్వగా..తాజాగా చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ కు ఓటేయాలని కోరినందుకు కట్కూరి పోచయ్య అనే వ్యక్తి నిరుద్యోగుల సంగతేంటని ప్రశ్నించడం వైరల్ గా మారింది. 

దళితులకు మూడెకరాలు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం..చొప్పదండి నియోజకవర్గంలో ఒక్క గుంట భూమి అయినా ఇచ్చిందా అని ఆయన టెలీకాలర్ ను ప్రశ్నించాడు. 30, 40 ఏండ్ల క్రితం లెక్క ఇంటికొక విప్లవకారుడు తయారైతేనే సమాజానికి మేలు జరుగుతుందన్నారు. తాము ఉన్నది ఉన్నట్లు మాట్లాడితే తమ మీద అక్రమ కేసులు పెట్టారని పోచయ్య ఆవేదన వ్యక్తం చేశాడు. ఇవన్నీ విన్న టెలీకాలర్ తమను ఎమ్మెల్యే గారు సర్వే చేయమంటే చేస్తున్నామని, అంతకు మించి తమకు సంబంధం లేదన్నారు. చదువుకున్న మీలాంటి వారు ఇలా ఫోన్లు చేసి బీఆర్ఎస్ కు మద్దతు ఇవ్వండని కోరవద్దని కోరుతూ పోచయ్య  ఫోన్ కట్ చేశాడు. ఈ ఆడియో ప్రస్తుతం వైరలైంది. 

ఖాళీ పోస్టులు...పేపర్​ లీకేజీలపై.. 

బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థుల తరఫున ఫోన్లు చేస్తున్న టెలీ కాలర్స్ కు నిరుద్యోగులు సైతం రివర్స్​అవుతున్నారు. గ్రూప్ 1, ఇతర జాబ్స్ కు సంబంధించిన పేపర్ లీకేజీలు, ఖాళీ పోస్టులు భర్తీ చేయకపోవడంపై ఫైర్ అవుతున్నారు. ‘మీరు కూడా వేరే జాబ్ లేకనే టెలీ కాలర్ గా పని చేస్తున్నారు కదా’ అని టెలీకాలర్స్ నే క్వశ్చన్​చేస్తున్నారు. ఉద్యోగాలు వస్తాయని తెలంగాణ కొట్లాడి తెచ్చుకుంటే కేసీఆర్ కుటుంబమే బాగుపడిందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో టెలీకాలర్స్ ఇవన్నీ నోట్ చేసుకుని ఎమ్మెల్యే కు చెప్తామంటూ కాల్ కట్ చేస్తున్నారు.

ALSO READ : అబద్ధాలను వెంటాడుతున్న నిజాలు

కాంగ్రెస్ సైతం..

స్కీమ్ ల లబ్ధిదారులకు బీఆర్ఎస్ టెలీ కాలర్స్ ఫోన్లు చేసి ఓట్లడుగుతుండగా మరో వైపు కాంగ్రెస్ టెలీ కాలర్స్ కూడా ఫోన్ చేసి కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీల గురించి వివరిస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆరు గ్యారంటీలను కచ్చితంగా అమలు చేస్తారని, చేతి గుర్తుకే ఓటెయ్యాలని కోరుతున్నారు.