- ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ లోకి భారీ చేరికలు
- సీపీఐని వీడుతున్న నేతలు
- జూలూరుపాడులో బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్‌లో చేరిన సర్పంచ్‌లు, ఎంపీటీసీలు
ఉమ్మడి జిల్లాలో బుధవారం ప్రధాన పార్టీల అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ఖమ్మంలో ఒకేరోజు 24, భద్రాద్రి కొత్తగూడెంలో 18 మంది నామినేషన్లు వచ్చాయి. ఇలా ఓ వైపు నామినేషన్లు పడుతుండగానే.. మరోవైపు బీఆర్ఎస్, సీపీఐ, బీజేపీని నాయకులు ఆ పార్టీలను వీడుతున్నారు. ఖమ్మం జిల్లాల్లో పొంగులేటి శ్రీనివాస్ ఆధ్వర్యంలో వందల మంది కాంగ్రెస్‌లో చేరారు.
భద్రాద్రికొత్తగూడెం : జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో బుధవారం 18 మంది 20 నామినేషన్లు వేశారు. పినపాక నియోజకవర్గంలో రెండు, ఇల్లెందులో మూడు, కొత్తగూడెంలో ఆరు, అశ్వారావుపేటలో నాలుగు, భద్రాచలంలో మూడు నామినేషన్లు ఆర్వోలకు అందాయి. ఇల్లెందులో మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య కూతురు గుమ్మడి అనురాధ ఇండిపెండెంట్‌గా, కాంగ్రెస్ రెబల్‌గా భానోత్ వెంకట ప్రవీణ్‌కుమార్, ఇండిపెండెంట్‌గా భానోత్ మోహన్, కొత్తగూడెం నుంచి సీపీఐ తరుపున ఆ పార్టీ స్టేట్ సెక్రెటరీ కూనంనేని సాంబశివరావు, ఇండిపెండెంట్లుగా కటుకోజ్వుల నాగేశ్వరరావు, సరప కోటేశ్వరరావు, అజాం షేక్, అలియన్స్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫామ్స్ పార్టీ తరుపున తల్లాడ వెంకటేశ్వర్లు, బీఎస్పీ తరుపున యెర్రా కామేశ్, భద్రాచలం నుంచి బీజేపీ నుంచి కుంజా ధర్మారావు, కుంజా సంతోష్ కుమార్, సీపీఎం నుంచి కారం పుల్లయ్య నామినేషన్లు వేశారు. ఐదు నియోజకవర్గాల్లో ఇప్పటి వరకు 52 మంది నామినేషన్లు వేశారు.
అశ్వారావుపేట : అశ్వారావుపేట అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థి జారే ఆదినారాయణ బుధవారం నామినేషన్ వేశారు. పట్టణంలో ఆంజనేయస్వామి ఆలయం వద్ద నామినేషన్ పత్రాలకు ప్రత్యేక పూజలు చేసి, భారీ ర్యాలీ నిర్వహించారు.
బీజేపీ అభ్యర్థి కుంజా ధర్మారావు నామినేషన్:
భద్రాచలం : బీజేపీ నుంచి కుంజా ధర్మారావు నామినేషన్ వేశారు. పట్టణంలో ర్యాలీ నిర్వహించి, అంబేద్కర్ సెంటర్లో మాట్లాడారు. భద్రాచలం రాముణ్ణి సైతం తెలంగాణ సీఎం కేసీఆర్ దగా చేశారన్నారు. అనంతరం మన్యం వీరుల విగ్రహాలకు పూలమాలలు వేసి ఆర్డీవో కార్యాలయానికి చేరుకున్నారు. ఆయనతో పాటు జిల్లా అధ్యక్షుడు రంగా కిరణ్, బీజేపీ శ్రేణులు ఉన్నారు.
బీఆర్ఎస్ అభ్యర్థి కందాల నామినేషన్
ఖమ్మం రూరల్ : పాలేరు నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి కందాల ఉపేందర్‌రెడ్డి బుధవారం ఎన్నికల అధికారి (ఆర్ఓ) రాజేశ్వరికీ నామినేషన్ పత్రాలు అందించారు. తన క్యాంప్ కార్యాలయం నుంచి బయల్దేరి మారెమ్మ తల్లి దేవాలయం దర్శించుకున్నారు. అనంతరం నామినేషన్ వేశారు.
రాజీనామాలు - చేరికలు బీఆర్ఎస్ సర్పంచ్ లు, ఎంపీటీసీల రాజీనామా
జూలూరుపాడు : మండలంలోని బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఐదుగురు సర్పంచ్ లు, ఇద్దరు ఎంపీటీసీలు, మండల మాజీ అధ్య క్షుడు, సొసైటీ డైరెక్టర్, కార్యకర్తలు మూకుమ్మడిగా రాజీనామా చేసి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. బుధవారం ఆర్కే పంక్షన్ హాలు లో సమావేశం ఏర్పాటు చేసి పొంగులేటి వారిని ఆహ్వానించారు. అనంతరం వారు మాట్లాడారు. ఎలాంటి గ్రూపులు లేకుండా అందరు కలిసి కట్టుగా ఈనెల 30న జరగబోతున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పువ్వాళ్ళ దుర్గా ప్రసాద్, లేళ్ళ వెంకటరెడ్డి, బాలసాని లక్ష్మినారాయణ, బొర్రా రాజశేఖర్ పాల్గొన్నారు.
బీఆర్ఎస్, సీపీఎం నుంచి కాంగ్రెస్ లోకి
కూసుమంచి : మండలంలోని ధర్మతండా కు చెందిన సీపీఎం సర్పంచ్ రెంటాల ధనమ్మ, మాజీ ఎంపీటీసీ రెంటాల శ్రీనివాసరావు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జిల్లా నాయకులు పొంగులేటి ప్రసాద్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. అదే గ్రామం నుంచి 50 సీపీఎం కుటుంబాలు పార్టీని వీడాయి. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బానోతు కళావతి, రామోజీ, సుమన్, సురేశ్, నాగేశ్వరరావు పాల్గొన్నారు.
వైరా : వైరా మున్సిపాలిటి నుంచీ, మండలంలోని పలు గ్రామాల నుంచీ బీఆర్ఎస్, రాజకీయ పార్టీల నాయకులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పువ్వాడ దుర్గాప్రసాద్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. పార్టీలో చేరిన వారిలో బీఆర్ఎస్ జిల్లా నాయకులు మచ్చ బుజ్జి , వైరా మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బీడీకి రత్నం , కర్నాటి హనుమంతరావు, సూర్యదేవర శ్రీధర్, శ్రీరామనేని తిరుపతిరావు, చింత నిప్పుల రాంబాబు, ముత్తవరపు డేవిడ్, వైరా మున్సిపల్ పదో వార్డ్ కౌన్సిలర్ కర్నాటి నందిని, 9వ వార్డు కౌన్సిలర్ సూర్యదేవర వింధ్యారాణి, సిరిపురం సర్పంచ్ మట్టూరు ప్రసూనాంబ, పుణ్యపురం సర్పంచ్ గద్దె మల్లికార్జునరావు, గన్నవరం సర్పంచ్ వేమిరెడ్డి విజయలక్ష్మి, గోవిందపురం సర్పంచ్ సురేశ్, కొండకుడుమ సర్పంచ్ దొంతెబోయిన శ్రీనివాసరావు, గొల్లెనపాడు సర్పంచ్ కంచర్ల మరియమ్మ ఉన్నారు.
ఖమ్మం రూరల్ : ఖమ్మం రూరల్ మండలంలోని రేగులతండాలో 70 కుటుంబాలు బీఆర్ఎస్ ను వీడి
కాంగ్రెస్ జిల్లా నాయకులు పొంగులేటి ప్రసాద్ ఆధ్వర్యంలో కాంగ్రెస్‌లో చేరారు. అనంతరం ప్రసాద్ సీపీఐతో నాయకులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఆ తర్వాత గుదిమళ్లలో కరెంట్ షాక్‌తో చనిపోయిన బానోత్ శంకర్ కుటుంబాన్ని పరామర్శించారు. ఆయా కార్యక్రమాల్లో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కళ్లెం వెంకటరెడ్డి, కన్నేటి వెంకన్న, మద్ది మల్లారెడ్డి, వీరారెడ్డి, దరావత్ బాబు పాల్గొనారు.
భద్రాచలం : సీపీఐ సీనియర్ లీడయర్, మాజీ టౌన్ ప్రెసిడెంట్ తమ్మళ్ల వెంకటేశ్వరరావుతో పాటు, పార్టీలో సీనియర్ గిరిజన నేత కుంజా శ్రీనివాసరావు, మధు గోపి,కోటేశ్వరరావులు ఎమ్మెల్యే , డీసీసీ ప్రెసిడెంట్ పొదెం వీరయ్య సమక్షంలో కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నారు. బీఆర్ఎస్ మాజీ ఎంపీటీసీ గుండు ప్రదీప్, ఎన్డీకి చెందిన జక్కం కొండ కూడా కాంగ్రెస్‌లో చేరారు.