- కొత్తపేట చౌరస్తాలో పోలీసు కాళ్లపై పడి వేడుకున్న కానిస్టేబుల్ అభ్యర్థి
- ప్రభుత్వం స్పందించకపోతే ఆత్మహత్యలు చేసుకుంటామని హెచ్చరిక
ఎల్ బీనగర్,వెలుగు: ‘సారూ..మీ కాళ్లు మొక్కుతం. జీవో 46ను రద్దు చేయండి’.. అంటూ ఓ పోలీస్ కాళ్లు మొక్కి కానిస్టేబుల్ అభ్యర్థులు వేడుకున్నారు. ఆ జీవోను రద్దు చేయకుంటే గ్రామీణ ప్రాంతాలకు చెందిన తమకు అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తంచేశారు. కొత్తపేట్ చౌరస్తాలో రోడ్డుపై జీవో 46ను వ్యతిరేకిస్తూ సోమవారం అభ్యర్థులు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ గత నియామకాల మాదిరిగానే ప్రస్తుతం కొనసాగించాలని డిమాండ్ చేశారు. నోటిఫికేషన్ సమయంలో ఎక్కడా జీవో ప్రస్తావన లేదని, సెలక్షన్ సమయంలో తెరపైకి తెచ్చారన్నారని మండిపడ్డారు.
జీవో 46 ప్రకారం ఉమ్మడి హైదరాబాద్ జిల్లాకు 53శాతం రిజర్వేషన్లు కల్పించి మిగతా జిల్లాలకు 47శాతం కేటాయిస్తున్నారన్నారని అభ్యర్థులు తెలిపారు. దీంతో జిల్లాల్లోని అభ్యర్థులకు 130 మార్కులు వచ్చినా అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అదే ఈ జీవో తో సిటీకి చెందిన వారికి 80మార్కులు వచ్చినా జాబ్ వస్తుందని ఆవేదన వ్యక్తంచేశారు. వెంటనే జీవో46ను రద్దు చేయాలని, లేదంటే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు చేపడతామని హెచ్చరించారు. దీంతో ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు.