ఖమ్మం జిల్లాలో రెండో రోజు 17 నామినేషన్లు

భద్రాద్రికొత్తగూడెం/ఖమ్మం టౌన్, వెలుగు  : అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా శనివారం ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్న 10 నియోజకవర్గాలలోని ఆయా రాజకీయ పార్టీల అభ్యర్థులు 17 నామినేషన్లు వేశారు. ఖమ్మం జిల్లాలో 10, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 7 నామినేషన్లు దాఖలయ్యాయి.  ఖమ్మం లో స్వతంత్ర అభ్యర్థిగా కొంకిమల్ల సాయికుమార్, కాంగ్రెస్ పార్టీ నుంచి తుమ్మల నాగేశ్వరరావు రోండో సెట్,  స్వతంత్ర అభ్యర్థిగా మార్కాపుడి శ్రీనివాసులు నామినేషన్​ వేశారు. 

పాలేరు అసెంబ్లీ స్థానానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తరపున పొంగులేటి ప్రసాద్ రెడ్డి నామినేషన్ పత్రాలు అందజేశారు. స్వతంత్ర అభ్యర్థులుగా భైరవబోట్ల శ్రీనివాసరావు, షేక్ సిరాజుద్దీన్ నామినేషన్​ వేశారు. మధిరలో పిరమిడ్ పార్టీ నుంచి బలవంతపు కళ్యాణ్ కుమార్, స్వతంత్ర అభ్యర్థిగా బొమ్మెర రామ్మూర్తి నామినేషన్ దాఖలు చేశారు. వైరాలో స్వతంత్ర అభ్యర్థిగా రాములు వర్సా, సత్తుపల్లి లో అలియన్స్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫామ్స్ పార్టీ  అభ్యర్థిగా ఆంబోజు సుమలత నామినేషన్ ​వేశారు. 

భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోని పినపాక, అశ్వారావుపేట, భద్రాచలం నియోజకవర్గాల నుంచి ఒక్కొక్కటి, ఇల్లెందు నియోజకవర్గంలో రెండు, కొత్తగూడెం నియోజకవర్గంలో రెండు నామినేషన్లు దాఖలయ్యాయి. ఏడుగురు క్యాండిడెట్లకు గానూ ఎనిమిది సెట్ల నామినేషన్లను వేశారు. ఇల్లెందు నుంచి కాంగ్రెస్​ తరుపున జడ్పీ చైర్మన్​ కోరం కనకయ్య, భూక్యా మంగీలాల్, పినపాక నియోజకవర్గం నుంచి కాంగ్రెస్​ తరుపున మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, కొత్తగూడెం నియోజకవర్గం నుంచి బీఎస్పీ తరుపున యెర్రా కామేశ్, ఆమ్​ఆద్మీ తరుపున అవుటుపల్లి రామ లింగేశ్వరరావు, అశ్వారావుపేట నుంచి బీఆర్​ఎస్​ తరుపున ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరరావు నామినేషన్లు వేశారు. భద్రాచలం నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్​గా పి.హేమసుందర్​ నామినేషన్లు దాఖలు చేశారు.