
కరెంట్ అఫైర్స్‌కు సంబంధించి అభ్యర్థులు మెమొరీ టెక్నిక్స్‌ను పాటించడం ఉత్తమం. ప్రతి అభ్యర్థికి తనకంటూ సొంత మెమొరీ టెక్నిక్స్ ఉంటాయి. కొందరు విజువలైజేషన్ టెక్నిక్స్, కొందరు మైండ్ మ్యాపింగ్(మనసులోనే ఆయా అంశాలను ముద్రించుకునే విధానం) వంటివి అనుసరిస్తారు. మరికొందరికి ఆయా అంశాలను టేబుల్స్, గ్రాఫ్స్‌లో రూపంలో రాసుకుని సులువుగా జ్ఞప్తికి తెచ్చుకునే లక్షణం ఉంటుంది. అభ్యర్థులు తమకు అనుకూలంగా ఉండే విధానాన్ని ఆచరణలో పెట్టాలి. ఇలా.. సమకాలీన ప్రాధాన్యం ఉన్న అంశాలు, కోర్ టాపిక్స్‌తో అనుసంధానం, మంచి పుస్తకాల ఎంపిక, పేపర్ రీడింగ్ వరకూ.. అడుగడుగునా శాస్త్రీయంగా ప్రిపరేషన్ సాగిస్తే ఈ విభాగంలో మంచి మార్కులు సాధించవచ్చు.
అభ్యర్థులు అన్ని టాపిక్స్‌పైన కాకుండా ముఖ్యమైన అంశాలను రివిజన్ చేయడానికి ఈ సమయాన్ని కేటాయించాలి. అభ్యర్థులు ప్రధానమైన అంశాలపై బేసిక్స్ మొదలు సమకాలీన అంశాల వరకు పూర్తి స్థాయి అవగాహన ఉంటేనే ఎగ్జామ్‌లో సక్సెస్ కావొచ్చు. మొత్తం 300 మార్కుల గ్రూప్ 4 పరీక్షలో 200 టార్గెట్‌తో ప్రిపేర్ అయితే కొలువు దక్కడం సులువే.
పేపర్-1 జనరల్ స్టడీస్
జనరల్ స్టడీస్ పేపర్‌లో ముందుగా ఆయా అంశాలకు లభించే వెయిటేజీపై ప్రాథమికంగా ఒక అంచనా ఏర్పరచుకోవాలి. తెలంగాణ రాష్ట్ర చరిత్ర, తెలంగాణ ప్రాంత ప్రాధాన్యత అంశాల నుంచి ఎక్కువ ప్రశ్నలు అడిగే వీలుంది. కాబట్టి అభ్యర్థులు తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమం, తెలంగాణ సమాజం, సంస్కృతి, వారసత్వం, కళలు, సాహిత్యం, తెలంగాణ రాష్ట్ర విధానాలపై ఫోకస్ చేయాలి. ముఖ్యంగా ఇటీవల కాలంలో ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు, వాటి ఉద్దేశాలు తెలుసుకోవాలి
భారత రాజ్యాంగం: ఈ విభాగం నుంచి ఎక్కువ ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. కరెంట్ ఆఫైర్స్‌ను అనుసంధానించుకుంటూ, చాప్టర్ల వారీగా చదవాలి. ముఖ్యంగా ప్రాథమిక హక్కులు, రాజ్యాంగ సవరణలు, కోర్టు కేసులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, రాష్ట్రపతి, గవర్నర్ వ్యవస్థ మీద ఎక్కువ ప్రశ్నలు అడుగుతారు.
జాగ్రఫీ: భారతదేశ భౌగోళిక అంశాలపై ప్రశ్నలుంటాయి. బేసిక్ స్థాయిలోనే వీటిని అడిగే అవకాశం ఉంటుంది. ప్రిపరేషన్‌లో స్కూల్, డిగ్రీ స్థాయి పుస్తకాలకు ప్రాధాన్యం ఇవ్వడం మేలు చేస్తుంది.
భారత ఆర్థిక వ్యవస్థ: ఈ విభాగం నుంచి 10–15 ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. ఇందులో ముఖ్యంగా సోషియో ఎకానమిక్ అవుట్‌లుక్ 2023తో పాటు ఆర్థిక సర్వే, బడ్జెట్ గురించి తెలుసుకోవాలి. ముఖ్యంగా ప్రణాళికలు, నీతిఆయోగ్, పేదరికం, నిరుద్యోగం, జాతీయ ఆదాయం అంశాల నుంచి ప్రశ్నలు ఇస్తారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల గురించి తెలుసుకోవాలి.
ఆధునిక భారతదేశ చరిత్ర: ఈ విభాగం నుంచి 10–15 ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. ఇందులో ఎక్కువ శాతం ప్రశ్నలు భారత జాతీయోద్యమం నుంచి ఉంటాయి. ఉద్యమంలోని వివిధ దశలు, ఉద్యమాన్ని నడిపిన వ్యక్తుల జీవిత చరిత్ర, నాటి గవర్నర్ జనరల్స్‌పై ప్రశ్నలు వస్తాయి.
జనరల్ సైన్స్: ఈ విభాగంలో సైన్స్ అనువర్తనాలపై ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. ఇందుకోసం పాఠశాల స్థాయి భౌతిక, జీవ, రసాయన శాస్త్ర అనువర్తనాలను చదువుకుంటే సరిపోతుంది. మౌలిక అంశాలను చదువుకుని అనువర్తనాలపై దృష్టి పెట్టాలి. నిత్యజీవితంలో అంతర్భాగంగా సైన్స్ టెక్నాలజీపై ప్రశ్నలు ఎదురవుతాయి.
పర్యావరణం-విపత్తుల నిర్వహణ: పాఠశాల స్థాయి పాఠ్యపుస్తకాలతోపాటు 12వ తరగతి స్థాయి విపత్తు నిర్వహణ, పర్యావరణ అంశాలు చదివితే మంచి ఫలితం సాధించవచ్చు. ఇటీవల జరిగిన విపత్తులపై ఫోకస్ చేయాలి. అంతర్జాతీయ సంబంధాలు, సంఘటనలు: సరిహద్దు దేశాలతో భారతదేశానికి ఉన్న సత్సంబంధాలపై ప్రశ్నలు వచ్చే వీలుంది. అంతర్జాతీయ సంఘటనలు, ప్రపంచ వేదికల్లో భాగస్వామ్యం తదితర అంశాలను అధ్యయనం చేయాలి. వివిధ అంతర్జాతీయ వేదికలు, వాటి ప్రారంభం, పలు అంతర్జాతీయ వేదికలపై భారతదేశ పాత్ర, ఆయా వేదికల సభ్య దేశాలు, ప్రస్తుత అధ్యక్షులు, రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, నాటో, ఐక్యరాజ్యసమితి, జీ20 సమ్మిట్స్, సార్క్, క్వాడ్, పర్యావరణ సదస్సులు తదితర అంశాలపై దృష్టి పెట్టాలి.
కరెంట్ అఫైర్స్: ఈ విభాగంలో పరీక్ష తేదీకి ముందు 6 నుంచి 9 నెలల కాలానికి సంబంధించిన కరెంట్ అఫైర్స్‌ను చదవాలి. ప్రశ్నలు ఏ విధంగా అడిగినా.. సమాధానాలు గుర్తించేలా ప్రిపరేషన్ సాగించాలి. అభ్యర్థులు ముందుగా కరెంట్ అఫైర్స్‌ను మూడు విభాగాలుగా(ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ) విభజించుకోవాలి. ఆ తర్వాత ఆ మూడు విభాగాల వార్తలు/తాజా ఘటనల్లో సామాజికంగా ప్రభావితం చేసే పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు, ముఖ్య నియామకాలపై దృష్టి పెట్టాలి. అంతర్జాతీయ పరిణామాలకు సంబంధించి భారతదేశ ప్రమేయం, అదే విధంగా భారత్‌పై ప్రభావం చూపే అవకాశమున్న అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి.
పేపర్-2 (సెక్రటేరియల్ ఎబిలిటీస్)
శ్రద్ధగా ప్రాక్టీస్ చేస్తే పేపర్–2లోఎక్కువ మార్కులు సాధించేందుకు అవకాశముంది. ఎస్‌ఎస్‌సీ, బ్యాంకింగ్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వారు మంచి స్కోర్ చేయొచ్చు. ఇప్పుడున్న సమయంలో రీజనింగ్‌పై ఎక్కువ ఫోకస్ చేయాలి.పేపర్–2లో ఐదు విభాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి.
మెంటల్ ఎబిలిటీ: కోడింగ్, డీకోడింగ్, రక్త సంబంధాలు, పజిల్స్, వర్గీకరణ, అనాలజీ, అసర్షన్–రీజన్, వెర్బల్–నాన్ వెర్బల్, రీజనింగ్ తదితర అంశాలపై ప్రశ్నలుంటాయి. ఈ ప్రశ్నల్లో ఉన్న లాజిక్, సమస్య పరిష్కార పద్దతిని తెలుసుకుంటే.. మంచి మార్కులు తెచ్చుకోవచ్చు.
న్యూమరికల్, అర్థమెటికల్ ఎబిలిటీస్
వడ్డీ లెక్కలు, కాలం–పని, కాలం–వేగం, నిష్పత్తులు, వాటాల లెక్కింపు మొదలైన పాఠ్యాంశాలపై ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. ప్రశ్నలు అర్థం చేసుకుంటే.. సమాధానాలు సులువే. ఇందుకోసం వీలైనన్నీ ఎక్కువ ప్రశ్నలను ప్రాక్టీస్ చేయాలి. బోడ్‌మాస్, అంకెల మధ్య ఉండే సహసంబంధాలు, అంకెల వరుసక్రమాలు మొదలైన సూత్రాల మీద ప్రశ్నలు ప్రాక్టీస్ చేయాలి.
కాంప్రహెన్షన్
సమాచారాన్ని ఒక పేరాగ్రాఫ్‌లో ఇస్తారు. దాన్ని చదివి వివిధ రకాలైన ప్రశ్నలకు సమాధానం గుర్తించాల్సి ఉంటుంది. ఈ ప్రశ్నలకు సమాధానాలు గుర్తించేందుకు ప్రాక్టీస్ బిట్స్ కలిగిన పేరాగ్రాఫ్‌లు చదివి సాధన చేయాలి. పేరాను వేగంగా ఏకాగ్రతతో చదవడం, అర్థం చేసుకుంటే ఈ విభాగంలో మంచి మార్కులు పొందవచ్చు.
సెంటెన్స్ రీ-అరేంజ్‌మెంట్: ఈ విభాగం కోసం ప్రత్యేకంగా సన్నద్ధం కావాల్సిన అవసరం లేదు. వరస మార్చిన వివిధ వాక్యాలను అర్థవంతమైన రూపంలో తిరిగి అమర్చాలి. ఎక్కువ ప్రాక్టీస్ ద్వారా ఇందులో సులభంగా మార్కులు సాధించొచ్చు.
ఇంగ్లీష్ కాంప్రహెన్షన్: వొకాబ్యులరీ, రీడింగ్ కాంప్రెహెన్షన్, గ్రామర్‌లపై పట్టు సాధించాలి. బేసిక్ గ్రామర్ అంశాలుగా భావించే సినానిమ్స్, యాంటానిమ్స్, ఇడియమ్స్/ఫ్రేజెస్, వన్ వర్డ్ సబ్‌స్టిట్యూషన్స్, సెంటెన్స్ ఇంప్రూవ్‌మెంట్, స్పెల్లింగ్ మిస్టేక్స్, ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ విభాగాలపై అవగాహన ఏర్పరచుకోవాలి. ఈ విభాగం నుంచి ప్యాసేజ్ ఆధారిత ప్రశ్నలు కూడా అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు రీడింగ్ కాంప్రహెన్షన్‌పై మరింత శ్రద్ధ చూపాలి.
ఎంతో మంది నిరుద్యోగులు ఎదురుచూస్తున్న గ్రూప్ 4 ఎగ్జామ్ జులై 1న నిర్వహించేందుకు టీఎస్పీఎస్సీ సిద్ధమవుతోంది. ఈ పోస్ట్‌ల కోసం డిగ్రీ మొదలు పీజీ, పీహెచ్‌డీ అభ్యర్థులు సైతం పోటీ పడుతుంటారు. ఈ నేపథ్యంలో పరీక్షకు సుమారు పది రోజుల సమయం మాత్రమే ఉండడంతో ఏ టాపిక్స్ మీద ఫోకస్ చేయాలి, జాబ్ సాధించేందుకు ఈ సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలుసుకుందాం..