- గాంధీ భవన్ ఎదుట పలువురు అభ్యర్థుల ధర్నా
హైదరాబాద్, వెలుగు: డీఎస్సీలో ఉర్దూ టీచర్ల బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయాలని పలువురు అభ్యర్థులు సోమవారం గాంధీ భవన్ ఎదుట ధర్నా చేశారు. ఉర్దూ మీడియానికి సంబంధించిన 666 బ్యాక్ లాగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటిని భర్తీ చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరారు. ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి వెంటనే జోక్యం చేసుకొని తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో ఉర్దూ రెండో భాషగా ఉన్నప్పటికీ.. ఆ స్థాయిలో ఆదరణ లేదని అభ్యర్థులు వాపోయారు.
ఈ విషయంపై పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ను కలిసి వివరించేందుకు అభ్యర్థులు గాంధీ భవన్ కు రాగా.. ఆయన అందుబాటులో లేరు. దీంతో వారు గాంధీ భవన్ లో అందుబాటులో ఉన్న సిబ్బందికి వినతి పత్రం ఇచ్చారు. మరోవైపు, జీవో నంబర్ 81, 85 ప్రకారం వీఆర్ఏ వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పలువురు వీఆర్ఏలు సోమవారం గాంధీ భవన్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు.