కరీంనగర్, వెలుగు అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో ఎమ్మెల్యే అభ్యర్థులకు కంటి నిండా నిద్ర ఉండడం లేదు. రోజు ఏడెనిమిది సభల్లో, కార్యకర్తల మీటింగ్స్ లో, ముఖ్య నాయకులతో ఫోన్లలో నిరంతరం మాట్లాడాల్సి రావడంతో గొంతుకు రికాం ఉండడం లేదు. ఎలాగైనా గెలవాలనే లక్ష్యంతో పగలు, రాత్రి అనే తేడా లేకుండా నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఈ పది రోజులు కష్టపడితే అయిదేండ్లు పవర్ లో ఉండొచ్చనే ధీమాతో ఆరోగ్యాన్ని అసలే పట్టించుకోవడం లేదు.
తెల్లవారుజామున ఐదారుగంటలకు లేచింది మొదలు అర్ధరాత్రి ఒంటి గంట వరకు రెస్ట్ లేకుండా ఎన్నికల ప్రచారం, పార్టీలో చేరికలు, అసమ్మతులకు బుజ్జగింపులు, ఇంటర్నల్ మీటింగ్స్, ఎన్నికల స్ట్రాటజీపై చర్చలు, నిధుల సర్దుబాటులో బిజిబిజీగా గడుపుతున్నారు. దీంతో సమయానికి అన్నం తినడం లేదు. రోజుకు నాలుగైదు గంటలకు మించి నిద్ర పోవడం లేదు. రాష్ట్రంలో పోటీ చేస్తున్న ప్రధాన పార్టీల్లోని మెజార్టీ అభ్యర్థులు 50, 60 ఏండ్లకు పైబడినవాళ్లే కావడం, వారిలో కొందరికి ఇప్పటికే బీపీ, షుగర్ తదితర సమస్యలు ఉండడంతో వారి కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు.
ఇక స్టార్ క్యాంపెయినర్లకు తమ నియోజకవర్గాలతో పాటు ఇతర నియోజకవర్గాల బాధ్యతలు ఉండడంతో వీళ్లపై మరింత ఒత్తిడి ఉంటోంది. బీజేపీ స్టార్ క్యాంపెయినర్, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పొద్దున, సాయంత్రం కరీంనగర్ లో, మధ్యాహ్నం బయటి నియోజకవర్గాల్లో రెస్ట్ లేకుండా ప్రచారం చేయడంతో ఇటీవల లోబీపీకి గురయ్యారు.
రోజుకు ఏడెనిమిది మీటింగ్స్..
అభ్యర్థులు రోజుకు ఏడెనిమిది పబ్లిక్ మీటింగ్స్ లో మాట్లాడాల్సి వస్తోంది. గట్టిగా నినాదాలు చేయాల్సి వస్తోంది. దీంతో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ చెన్నూరు అభ్యర్థి వివేక్ వెంకటస్వామి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ తదితర అనేక మంది నాయకుల గొంతులు బొంగురుపోయాయి. చాలామంది నాయకులు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇంటింటి ప్రచారం, పాదయాత్రలతో డీహైడ్రేషన్ కు గురవుతున్నారు. ప్రచారంలో తోపులాటలు, ఎక్కువ మందిని అడ్రస్ చేయాల్సి రావడంతో అభ్యర్థులు బాగా అలిసిపోతున్నారు. నీరసం, నాలుక తడారిపోవడం, మూత్రం రంగు మారడం లాంటి లక్షణాలు కనిపిస్తే డాక్టర్ల సలహా మేరకు ఓఆర్ఎస్, ఉప్పు, చక్కెర కలిపి మజ్జిగ, కొబ్బరి నీళ్ల లాంటివి తీసుకుంటున్నారు.
ఎరుపెక్కుతున్న కండ్లు..
ఎమ్మెల్యే అభ్యర్థుల్లో చాలా మందికి కంటి నిండా నిద్రలేక ముఖాలు పాలిపోతున్నాయి. కండ్లు ఎరుపెక్కుతున్నాయి. దీంతో కొందరు మధ్యాహ్నం ఏదో ఒక సమయంలో 10, 20 నిమిషాలు చిన్న కునుకు తీస్తున్నారు. అయినా నిద్ర సరిపోకపోవడంతో ప్రచార రథాలపై వారికి ఆవలింతలు తప్పడం లేదు. పోలింగ్ రోజు వరకు ఇది తప్పదని అభ్యర్థులు అంటుండగా.. డాక్టర్లు మాత్రం నిద్ర, భోజనాన్ని నిర్లక్ష్యం చేయొద్దని బీపీ, షుగర్, గుండె సంబంధిత అనారోగ్య సమస్యలకు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు.
స్పృహ తప్పిన కవిత..
జగిత్యాల నియోజకవర్గంలోని రాయికల్ మండలం ఇటిక్యాల గ్రామంలో ఈ నెల 19న ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా ఎమ్మెల్సీ కవిత స్పృహ తప్పారు. ప్రచార వాహనంలో ఉండగానే ఒక్కసారిగా కళ్లు తిరిగి కిందపడిపోయారు. పక్కనే ఉన్న మహిళా కార్యకర్తలు ఆమెకు సపర్యలు చేశారు. ఎన్నికల నేపథ్యంలో నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో రెగ్యులర్ గా ప్రచారం నిర్వహిస్తుండడంతో డీహైడ్రేషన్ వల్ల ఆమె పడిపోయినట్లు డాక్టర్లు వెల్లడించారు.
ALSO READ : మహిళల ఓట్లే కీలకం..వారిని ప్రసన్నం చేసుకునేందుకుపార్టీల పాట్లు
గంగులకు కాళ్ల నొప్పులు..
కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్ తెల్లవారుజామున 6 గంటలకు నిద్ర లేచింది మొదలు రాత్రి ఒంటి గంట వరకు ఎన్నికల ప్రచారం, పార్టీలో చేరికలు, ఇంటర్నల్ మీటింగ్స్ తో బిజీబిజీగా గడుపుతున్నారు. దీంతో ఆయనకు 15 రోజులుగా రోజుకు నాలుగైదు గంటలకు మించి నిద్ర ఉండడం లేదు. దీనికితోడు ఆయనకు డస్ట్ అలర్జీ కారణంగా తరచూ దగ్గు వస్తోంది. గతంలో రెండుసార్లు కాళ్లకు ఫ్యాక్చర్ కావడం వల్ల ఎక్కువసేపు నిలబడినా నొప్పితో ఇబ్బంది పడుతున్నారు.