భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పార్టీల తరుపున పోటీ చేసిన అభ్యర్థులే ఈసారి బరిలో ఉన్నారు. కానీ ఈసారి గుర్తులు మారాయి. నాడు కారు గుర్తుపై పోటీ చేసిన క్యాండిడేట్లు ఈసారి హస్తం గుర్తుపై, అప్పుడు హస్తం గుర్తుపై పోటీ చేసిన వారు ఇప్పుడు కారు గుర్తుపై పోటీ చేస్తున్నారు. భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోని ఐదు నియోజకవర్గాలకు నాలుగు చోట్ల ఇదే పరిస్థితి ఉంది.
ఏ నియోజకవర్గంలో.. ఎవరెవరు?
- 2018 ఎన్నికల్లో ఇల్లెందు నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా కోరం కనకయ్య, కాంగ్రెస్ నుంచి భానోత్ హరిప్రియ పోటీ చేశారు. కనకయ్యపై హరిప్రియ గెలిచారు. ప్రస్తుతం జరుగుతున్న ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి కోరం కనకయ్య, బీఆర్ఎస్ నుంచి బానోత్ హరిప్రియ పోటీ చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో వీరిద్దరి మధ్య ప్రధాన పోటీ నెలకొంది.
- పినపాక నియోజకవర్గంలో గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి రేగా కాంతారావు, బీఆర్ఎస్ నుంచి పాయం వెంకటేశ్వర్లు పోటీ చేశారు. పాయంపై రేగా గెలిచారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి రేగా కాంతారావు, కాంగ్రెస్ నుంచి పాయం వెంకటేశ్వర్లు తలపడుతున్నారు.
- అశ్వారావుపేట నియోజకవర్గంలో గత ఎన్నికల్లో టీడీపీ నుంచి మెచ్చా నాగేశ్వరావు, బీఆర్ఎస్ నుంచి జారే ఆదినారాయణ, వైఎస్సార్ సీపీ నుంచి తాటి వెంకటేశ్వర్లు పోటీ చేశారు. త్రిముఖ పోటీలో తాటి వెంకటేశ్వర్లు గెలిచారు. కాగా ప్రస్తుత ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి కారు గుర్తుపై మెచ్చా నాగేశ్వరరావు, కాంగ్రెస్ నుంచి జారే ఆదినారాయణ పోటీ చేస్తున్నారు. వీరిద్దరి మధ్యే ప్రధాన పోటీ నెలకొంది.
- కొత్తగూడెం నియోజకవర్గంలో 2014 ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి జలగం వెంకట్రావ్, వైఎస్సార్ సీపీ నుంచి వనమా వెంకటేశ్వరరావు, సీపీఐ నుంచి కూనంనేని సాంబశివరావు పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో జలగం వెంకట్రావ్ గెలిచారు. 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి జలగం వెంకట్రావ్, కాంగ్రెస్ నుంచి వనమా వెంకటేశ్వరరావు పోటీ చేయగా వనమా విజయం సాధించారు. ప్రస్తుతం ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి వనమా వెంకటేశ్వరరావు, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి జలగం వెంకట్రావ్, సీపీఐ నుంచి కూనంనేని సాంబశివరావు పోటీ చేస్తున్నారు.
- భద్రాచలం నియోజకవర్గంలో గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పొదెం వీరయ్య, బీఆర్ఎస్ నుంచి తెల్లం వెంకట్రావ్ పోటీ చేశారు. తెల్లంపై పొదెం గెలిచారు. ప్రస్తుత ఎన్నికల్లోనూ పొదెం కాంగ్రెస్ నుంచి తెల్లం బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్నారు.