పిలిపించుకున్నోళ్లే.. ముంచేసిన్రు!

  •     ఓటమిపై అధికార పార్టీ అభ్యర్థుల పోస్టుమార్టం
  •     పైసలిచ్చి మరీ నిరుద్యోగులను ఓటింగ్ కు రప్పించిన లీడర్లు
  •     పేరెంట్స్​కు చెప్పి మరీ వ్యతిరేకంగా ఓటేయించిన యూత్
  •     ఉద్యోగులు కూడా ప్రభుత్వానికి మద్దతివ్వలేదని అంచనా

‘నా ఓటమికి ఇతర ప్రాంతాల నుంచి మేం రప్పించిన ఓటర్లే కారణం. మా నియోజకవర్గానికి చెందిన దాదాపు వందలాది మంది హైదరాబాద్​ తో పాటు, వివిధ ప్రాంతాల్లో ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకుంటున్నారు. వాళ్లందరికీ ఫోన్​ చేసి అప్​ అండ్​ డౌన్ ​ఛార్జీలిస్తామని రప్పించాం. తీరా వచ్చిన తర్వాత వాళ్లంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేశారు. డిగ్రీలు పూర్తి చేసుకొని, ప్రభుత్వ ఉద్యోగాలు రాక, నోటిఫికేషన్లు లేకపోవడంతో ఏదో ఒక ప్రైవేట్ జాబ్​ చేసుకుంటున్నారు.

సొంతూర్లకు వచ్చిన తర్వాత వారి తల్లిదండ్రులను కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేయాలని ఒప్పించారు. వాళ్లను రప్పించడం ద్వారా పైసలు ఇచ్చి మరీ ఓటమిని తెచ్చుకున్నట్టయింది. ప్రభుత్వ ఉద్యోగులు కూడా వ్యతిరేకంగా ఓటేశారు’ ఇది ఖమ్మం జిల్లాలో తాజాగా ఓడిపోయిన అధికార పార్టీ ఎమ్మెల్యే మనోవేదన.

ఖమ్మం, వెలుగు : అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థులు అందుకు గల కారణాలను వెతికే  పనిలో ఉన్నారు. ఎక్కడ పొరపాటు జరిగిందని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. పార్టీ లీడర్లు, కార్యకర్తలు, పోలింగ్ రోజున ఓటింగ్ సరళిని ప్రత్యక్షంగా చూసిన వాళ్ల ఫీడ్​ బ్యాక్​ తీసుకోవడంతో పాటు వివిధ వర్గాలతో మాట్లాడి తప్పులను లోతుగా విశ్లేషించుకుంటున్నారు.

ఫలానా గ్రామంలో పంచిన పైసలెంత, వచ్చిన ఓట్లెన్ని అని లెక్కలేసుకుంటున్నారు. ఈ సందర్భంగా అధికార పార్టీకి చెందిన అభ్యర్థులకు ప్రభుత్వ తప్పిదాలతో పాటు, సొంత తప్పులు కూడా దెబ్బతీసినట్టుగా భావిస్తున్నారు. ప్రభుత్వంపై వ్యతిరేకతకు తోడు, అలా వ్యతిరేకంగా ఉన్న వారిని పైసలిచ్చి మరీ పోలింగ్ కు రప్పించడం ఖరీదైన మిస్టేక్​ గా మారిందని చెప్పుకుంటున్నారు. 

ఫలితాల్లో కీలక పాత్ర వారిదే.. 

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది నియోజకవర్గాల్లో 21,83,235 మంది ఓటర్లుండగా, 18,07,733 మంది ఓటేశారు. మొత్తం ఓటర్లలో 19 ఏళ్ల వయస్సున్న వారు 76,886 మంది ఉన్నారు. 20 నుంచి 29 ఏళ్ల లోపున్న వారు 4,31,478 మంది ఉండగా, 30 నుంచి 39 ఏళ్ల లోపున్న వారు 6,11,935 మంది ఉన్నారు. అంటే 18 నుంచి 39 ఏళ్ల లోపు వయస్సున్న వారు 11,20,279 మంది ఉండగా, ఈ ఫలితాల్లో వారే కీలక పాత్ర పోషించారు.

మొత్తం ఉన్న ఓటర్లలో 51 శాతం ఉన్న వారు రాష్ట్రంలో నిరుద్యోగుల పరిస్థితి గురించి అవగాహన కలిగి ఉండడం, చాలా మంది సొంతంగా ఉద్యోగాలు దొరక్క, ప్రభుత్వ నోటిఫకేషన్లు లేకపోవడం వల్ల బాధితులే కావడంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పిచ్చారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 సీట్లకు గాను కేవలం ఒక్క స్థానంలోనే బీఆర్ఎస్​ అభ్యర్థి విజయం సాధించగా, మిగిలిన ఎనిమిది సెగ్మెంట్లలో కాంగ్రెస్​, ఒక స్థానంలో సీపీఐ గెలిచింది.

భద్రాచలంలో గెలిచిన బీఆర్ఎస్​ అభ్యర్థికి ఆరు వేల లోపు మెజార్టీ రాగా, మిగిలిన అందరు క్యాండిడేట్లు 20వేలకు పైగా మెజార్టీతో గెలుపొందడం, ముగ్గురు ఏకంగా 50వేలకు పైగా మెజార్టీలు సాధించడం ప్రభుత్వ వ్యతిరేకతను రుజువు చేస్తోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

పిల్లల ఇబ్బందులు చూడలేక.. 

ఖమ్మం జిల్లాలోని ఒక నియోజకవర్గంలో దాదాపు 30వేల మంది ఎస్టీలున్నారు. వారిలో కుటుంబానికి ఒకరు చొప్పున కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిపేర్​ అవుతున్న వారున్నారు. దీంతో తమ పిల్లల ఇబ్బందులు చూసిన తల్లిదండ్రులు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేశారు. ఇక మరో నియోజకవర్గంలోని గ్రామంలో దాదాపు 260 మంది కానిస్టేబుళ్లుగా పనిచేస్తున్న వారున్నారు.

వాళ్లంతా ప్రతినెలా సకాలంలో వేతనాలు అందక తాము ఇబ్బంది పడుతున్నామని, బ్యాంకు లోన్లకు పెట్టుకున్న ఈఎంఐలకు ప్రతినెలా పెనాల్టీ పడుతున్నాయంటూ తాజాగా సిట్టింగ్ ఎమ్మెల్యేకు చెప్పుకున్నారు.

స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత లేని నియోజకవర్గాల్లో కూడా ఇలాంటి వేర్వేరు కారణాలు అధికార పార్టీ అభ్యర్థులను ఓడించాయని తేలింది. ఇక డబుల్ బెడ్​రూమ్​లు దక్కనివారు, దళితబంధు స్కీమ్ కు నోచుకోని వాళ్లు కూడా వ్యతిరేకంగా ఓటేశారని అభ్యర్థులు అంచనా వేసుకుంటున్నారు.