కరీంనగర్ జిల్లాలో 13 మంది విత్ డ్రా

నామినేషన్ల ఉపసంహరణ చివరి రోజు బుధవారం ఉమ్మడి కరీంనగర్​ జిల్లా వ్యాప్తంగా అభ్యర్థులు భారీగా నామినేషన్లు విత్​ డ్రా చేసుకున్నారు. కరీంనగర్​ జిల్లాలో 13 మంది, రాజన్న సిరిసిల్ల జిల్లాలో  6గురు, జగిత్యాల జిల్లాలో  12 మంది , పెద్దపల్లి జిల్లాలో   14 మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. 

కరీంనగర్ టౌన్,వెలుగు: కరీంనగర్ జిల్లాలోని కరీంనగర్, హుజూరాబాద్, మానకొండూరు, చొప్పదండి నియోజక వర్గాల్లో బుధవారం నామినేషన్ల ఉపసంహరణ చివరి రోజు 13 మంది పోటీ నుంచి తప్పుకున్నారు. 73 మంది బరిలో నిలిచారు. వీరిలో అత్యధికంగా  కరీంనగర్    నియోజకవర్గం నుంచి 27 మంది,  చొప్పదండి నుంచి 14 మంది, హుజూరాబాద్ లో 22 మంది, మానకొండూర్ లో 10 మంది పోటీలో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

కరీంనగర్  పోటీలో 27 మంది

కరీంనగర్ లో నలుగురు అభ్యర్థులు తమ నామినేషన్ ఉపసంహరించుకున్నారు. వీరిలో  అబ్దుల్ మహ్మద్ షుక్రొద్దీన్, కొట్టె రమేశ్, కంది అశోక్ రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్ కు మద్దతుగా ఉపసంహరించుకున్నట్లు తెలిపారు. ఇండిపెండెంట్ గా నామినేషన్ వేసిన మంత్రి గంగుల సతీమణి రజిత కూడా విత్ డ్రా చేసుకున్నారు. కరీంనగర్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్, బండి సంజయ్(బీజేపీ), పురుమళ్ల శ్రీనివాస్(కాంగ్రెస్), నల్లాల శ్రీనివాస్(బీఎస్పీ), అంబటి జోజిరెడ్డి(ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్),   సహా 27 మంది పోటీలో ఉన్నారు.  

హుజురాబాద్ లో 22 మంది..  

హుజురాబాద్ లో  ఇండిపెండెంట్ అభ్యర్థులు పైడిపల్లి అంజయ్య, కొత్తూరి రమేశ్, బండి శ్రీనివాస్ తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. ఈటల రాజేందర్(బీజేపీ), పాడి కౌశిక్ రెడ్డి(బీఆర్ఎస్), వొడితెల ప్రణవ్(కాంగ్రెస్), పల్లె ప్రశాంత్(బీఎస్పీ) సహా 22 మంది బరిలో నిలిచారు. 

చొప్పదండిలో 14  మంది పోటీ.. 

చొప్పదండిలో కల్లెపల్లి అంజయ్య( తెలంగాణ ద్రావిడ ప్రజల పార్టీ), తడగొండ మల్లేశం( యుగ తులసి), కాంగ్రెస్ రెబల్ నాగి శేఖర్- తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు.  సుంకె రవిశంకర్(బీఆర్ఎస్), మేడిపల్లి సత్యం(కాంగ్రెస్), బొడిగె శోభ గాలన్న(బీజేపీ), కంకటి శేఖర్(బీఎస్పీ),  ఎంఎస్ విజయ్ కుమార్(ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్)తోపాటు  14 మంది పోటీలో ఉన్నారు. 

మానకొండూరులో 10 మంది.. 

మానకొండూర్  లో పట్నం శ్రీనివాస్(యుగ తులసి),  ఇండిపెండెంట్లు ప్రభాకర్ మోరె, ఉప్పులేటి లక్ష్మణ్ తమ నామినేషన్లను విత్ డ్రా చేసుకున్నారు.  ఆరెపల్లి మోహన్(బీజేపీ), కవ్వంపల్లి సత్యనారాయణ(కాంగ్రెస్), ఇరుపుల బాలకిషన్ (బీఆర్ఎస్), నిషాని రామచంద్రం(బీఎస్పీ) సహా 10  మంది బరిలో నిలిచారు. 

 జగిత్యాల జిల్లాలో

జగిత్యాల,  :  జగిత్యాలలో 21 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ఇద్దరు అభ్యర్థుల నామినేషన్స్ రిజెక్ట్ అవ్వగా, నలుగురు అభ్యర్థులు విత్ డ్రా చేసుకున్నారు . దీంతో 15 మంది అభ్యర్థులు బరిలో ఉండనున్నారు. అలాగే ధర్మపురిలో 18 మంది అభ్యర్థులు నామినేషన్ వేశారు. ముగ్గురు అభ్యర్థులు నామినేషన్లు విత్ డ్రా చేసుకోవడంతో 15 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.

 కోరుట్ల బరిలో 15 మంది 

 కోరుట్ల : నామినేషన్లన ఉపసంహరణ అనంతరం కోరుట్ల నుంచి 15 మంది అభ్యర్థులు బరిలో నిలిచినట్లు కోరుట్ల ఆర్వో , ఆర్డీవో రాజేశ్వర్​ తెలిపారు. బుధవారం పట్టణంలోని ఆర్డీవో ఆఫీసులో 15 మంది జాబితాను ఆర్వో రాజేశ్వర్​ విడుదల చేశారు. అంతకు ముందు ఐదుగురు అభ్యర్థులు విత్​ డ్రా చేసుకున్నట్లు తెలిపారు. అర్వింద్​ ధర్మపురి (బీజేపీ), కల్వకుంట్ల సంజయ్ (బీఆర్ఎస్), నర్సింగరావు జువ్వాడి (కాంగ్రెస్), నిషాంత్​ కార్తీకేయ పూదరి (బీఎస్పీ) తో పాటు ఇతర పార్టీలు, ఇండిపెండెంట్లు 11 మంది బరిలో నిలిచారని పేర్కొన్నారు. 

పెద్దపల్లి బరిలో 17 మంది

పెద్దపల్లి, :   పెద్దపల్లి నియోజకవర్గంలో   25మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. చివరిరోజు 8 మంది నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. దీంతో  17 మంది పోటీలో మిగిలారు. 

మంథని నుంచి 21 మంది

మంథని అసెంబ్లీ నుంచి 24 మంది నామినేషన్​ వేయగా ముగ్గురు ఉపసంహరించుకున్నారు. దీంతో 21 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు.  రామగుండంలో 26  మందికి గాను  3 మంది అభ్యర్థులు ఉపసంహరించుకోగా,  23 మంది బరిలో నిలిచారు. పెద్దపల్లి జిల్లాలో మూడు నియోజక వర్గాల నుంచి  61 మంది  అభ్యర్థులు ఎన్నికల్లో పోటీలో ఉన్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.

రాజన్న  సిరిసిల్ల జిల్లాలో 

రాజన్నసిరిసిల్ల : రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ,  సిరిసిల్ల రెండు అసెంబ్లీ సెగ్మెంట్లలో 6 మంది  క్యాండిడేట్స్  తమ నామినేషన్లు విత్‌‌డ్రా చేసుకున్నారు. బుధవారం  విత్ డ్రాకు చివరి తేదీ కావడంతో నామినేషన్లను ఉపసంహరించుకున్నారు.  వేములవాడ సెగ్మెంట్ నుంచి ఆది వనజ, తుల ఉమ, ఎర్రం మహేశ్, ఎండీ నజీర్ తమ నామినేషన్లను విత్ డ్రా చేసుకున్నారు. కాగా సిరిసిల్ల నుంచి ఇద్దరు కటుకం మృత్యుంజయం, పల్లికొండ నర్సయ్య  విత్ డ్రా చేసుకున్నారు. కాగా బరిలో నిలిచిన స్వత్రంత్ర అభ్యర్థులకు అధికారులు గుర్తులు కేటాయించారు.