
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాల్లో భాగంగా గన్‌పార్కులోని అమరవీరుల స్తూపం నుంచి సెక్రటేరియట్ ముందున్న అమరజ్యోతి వరకూ బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. అమరువీరుల స్తూపానికి ఆ పార్టీ ప్రెసిడెంట్ కేసీఆర్ నివాళులు అర్పించి ర్యాలీని ప్రారంభించారు. అనంతరం అక్కడి నుంచే ఆయన ఇంటికి వెళ్లిపోయారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీశ్ రావు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు క్యాండిల్స్ పట్టుకుని అమరజ్యోతి వరకూ ర్యాలీగా వెళ్లారు. డప్పుచప్పుళ్లు, బోనాలు, కళాకారుల నృత్యాలు, పాటల మధ్య ప్రదర్శన సాగింది.
ప్రజా సంక్షేమాన్ని ప్రస్తుత ప్రభుత్వం కొనసాగించాలి: కేసీఆర్
ర్యాలీ అయిపోయాక కాసేపటికి తెలంగాణ ప్రజలకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ కేసీఆర్ ఓ ప్రకటన విడుదల చేశారు. ర్యాలీ సక్సెస్ అయిందని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య వాతావరణంలో, పార్లమెంటరీ పంథాలో, ప్రజలందరి భాగస్వామ్యంతో తెలంగాణ సాధించుకున్నామని ఆయన పేర్కొన్నారు. అమరుల త్యాగాలను వృథా పోనీయకుండా పదేండ్ల ప్రగతిని, ప్రజా సంక్షేమాన్ని ప్రస్తుత ప్రభుత్వం కొనసాగించాలన్నారు. వ్యక్తిగత ద్వేష భావనలకు తావివ్వకుండా తెలంగాణ సమాజ ప్రగతి, సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగడం ద్వారానే ప్రస్తుత ప్రభుత్వం అమరుల ఆకాంక్షలను నెరవేర్చగలదని ఆయన పేర్కొన్నారు.