- 79 కేసుల్లో పట్టుకున్న మాదక ద్రవ్యాలకు నిప్పు
హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్ ఎక్సైజ్ డివిజన్ లోని మూడు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లలో నమోదైన79 కేసుల్లో పట్టుకున్న గంజాయి, డ్రగ్స్ ను అధికారులు దహనం చేశారు. ఎక్సైజ్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సోమవారం జీజే మల్టీకౌవ్ ఇండియా సెంటర్ లో దగ్ధం చేశారు. హైదరాబాద్ డ్రగ్ డిస్పోజబుల్ కమిటీ చైర్మన్ కేఏబీ శాస్త్రీ ఆదేశాల మేరకు ఏఈఎస్ సికింద్రాబాద్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో డ్రగ్స్ దహన కార్యక్రమం జరిగింది. దగ్ధం చేసిన గంజాయి, డ్రగ్స్ విలువ రూ.2.78 కోట్ల మేర ఉంటుందని అధికారులు తెలిపారు.
ఈ 79 కేసుల్లో అమీర్ పేట్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో 27 కేసులు, చార్మినార్ స్టేషన్ లో 13 కేసులు, గోల్కొండ స్టేషన్ లో 39 కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో భాగంగా 135.8 కేజీల గంజాయి, 174.8 గ్రామలు ఎండిఎంఎ డ్రగ్, 1939.5 కేజీల పాపిష్టను, 2.1 గ్రాముల హాష్ అయిల్, 300.6 గ్రాముల చరస్, 5.14 గ్రాముల కొకైన్, 25 ఎల్ఎస్ డి బాస్ట్స్, 9.8కిలోల అల్ఫోజోలం,14 గ్రాముల ఎస్టోస్టి పీల్స్ ను మంటల్లో కాల్చేశారు. డ్రగ్స్ ను భారీ ఎత్తున దగ్ధం చేసినందుకు మూడు పోలీస్ స్టేషన్ల సీఐలు, సిబ్బందిని ఎక్సైజ్ శాఖ కమిషనర్ ఇ. శ్రీధర్, ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ వి.బి. కమలాసన్ రెడ్డి, హైదరాబాద్ డిప్యూటీ కమిషనర్ కేఏబీ శాస్త్రీ, అసిస్టెంట్ కమిషన్ అనిల్ కుమార్ రెడ్డి అభినందించారు.