ఆసిఫాబాద్ ఏజెన్సీ అడ్డాగా..గంజాయి దందా

  •     అంతర పంటల్లో సాగు
  •     కేసులు పెట్టినా ఆగని స్మగ్లింగ్
  •     పోలీసులు మరింత నిఘా పెట్టాలని కోరుతున్న జనం

ఆసిఫాబాద్, వెలుగు : అడవుల జిల్లా ఆసిఫాబాద్​లో గంజాయి సాగు జోరుగా సాగుతోంది. స్మగ్లర్లు ఏజెన్సీ ప్రాంతాలకు దగ్గరగా ఉంటే వ్యవసాయ భూముల్లో గంజాయి సాగు చేస్తూ ఇతర ప్రాంతాలకు సప్లై చేస్తున్నారు. గంజాయిని అంతర పంటగా సాగు చేస్తూ కోతకు వచ్చిన తర్వాత ఎవరికీ డౌట్ రాకుండా ఇండ్లలోనే దాచి అనువైనప్పుడు గుట్టుచప్పుడు కాకుండా సరఫరా చేస్తున్నారు. కొంత కాలంగా గంజాయి సాగు, స్మగ్లింగ్ జోరుగా సాగుతోంది.

గిరిజనుల భూములు అద్దెకు తీసుకొని..

తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చనే ఆశతో కొందరు ఈ దందాకు తెరలేపారు. ఏజెన్సీ ప్రాంతాల్లోని అమాయక గిరిజనులకు మాయమాటలు చెప్పి వారి భూములకు కౌలుకు తీసుకుంటుంటున్న స్మగ్లర్లు అంతర పంటగా గంజాయి సాగు చేస్తున్నారు. ముఖ్యంగా ఆసిఫాబాద్, కెరమెరి జైనూర్, సిర్పూర్ యు, తిర్యాణి, వాంకిడితో పాటు కాగజ్ నగర్ పరిసర ప్రాంతాల్లో పత్తి, మిర్చి , జొన్న, బంతి పూల చెట్ల మధ్య గుట్టుచప్పుడు కాకుండా పండిస్తున్నారు. ఎవరూ గుర్తుపట్టకపోవడంతో వారి దందా మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగుతోంది. ఇక్కడ సాగు చేసిన గంజాయిని ఆదిలాబాద్, మంచిర్యాల, కరీంనగర్, హైదరాబాద్, మహారాష్ట్రకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు.

అటవీ మార్గంలో సులువుగా..

జిల్లాకు మహారాష్ట్ర పక్కనే ఉండటం, అక్కడ డిమాండ్ విపరీతంగా ఉండడంతో స్మగ్లర్లకు కలిసొస్తోంది. అక్కడి జనాలు జిల్లాకు నిత్యం రాకపోకలు సాగిస్తుండడంతో అటవీ మార్గంలో గంజాయిని సులువుగా తరలిస్తున్నారు. పంట కోత దశలోకి రాగానే కోసి కొన్ని రోజులు ఎండబెట్టి సంచుల్లో నింపి అక్రమ మార్గాల్లో బైకులు, కార్లు, ఆటోల్లో ఇతర ప్రాంతాలకు సప్లై చేస్తున్నారు. కొంత కాలంలో ఏజెన్సీ ప్రాంతాల్లో విచ్చలవిడిగా గంజాయి సాగు చేస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. తనిఖీల్లో ఎక్కడో ఓ చోట స్మగ్లర్లు పట్టుబడుతూనే ఉన్నారు. గంజాయి స్మగ్లింగ్​పై పోలీసులు శాఖ మరింత నిఘా ఏర్పాటు చేసి అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.

  •     తిర్యాణి మండలం లచ్చుగుడా గ్రామానికి చెందిన ఆత్రం లింగరావ్ తన పెరట్లో గంజాయి సాగు చేస్తున్నారని సమాచారం అందుకున్న పోలీసులు డిసెంబర్ 28న దాడులు చేసి గంజాయి మొక్కలను ధ్వంసం చేశారు. 9 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.
  •     జైనూర్ మండలం బాబుల్ గుడా గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తన పత్తి పొలంలో పెంచుకున్న 14 గంజాయి మొక్కలు స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు ఫైల్ చేశారు.
  •     ఈనెల 7న కాగజ్ నగర్ మండలం ఇస్లాం పోలీస్ స్టేషన్ పరిధిలో రాజ్ సర్కార్ అనే వ్యక్తి నుంచి 30 గ్రాముల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. విలేజ్ నంబర్ 3 కు చెందిన రాహుల్ మండల్ వద్ద కొనుగోలు చేసి బైక్​పై తీసుకెళ్తుండగా పట్టుకుని కేసు నమోదు చేశారు. 

పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నం

జిల్లాలో గంజాయి సాగు, స్మగ్లింగ్ అరికట్టేందుకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నాం. సిబ్బంది ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తున్నారు. గంజాయి సాగు చేసినా, విక్రయించినా, తాగినా నేరం. గంజాయి రహిత జిల్లాగా మార్చడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నం.

 సురేశ్ కుమార్, ఎస్పీ, ఆసిఫాబాద్