అరెస్ట్ చేసినా బెదరకపోవడంతో గంజాయి, డ్రగ్స్ పెడ్లర్స్ పై మరింత కఠిన చర్యలకు తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో(టీన్యాబ్) సిద్ధమైంది. 24 మంది పెడ్లర్స్ ఆస్తులను జప్తు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. నిందితులపై నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ యాక్ట్ (ఎన్‌డీపీఎస్)తో పాటు ‘స్మగ్లింగ్ అం డ్ ఫారిన్ ఎక్స్చేంజ్ మానిప్యులేటర్స్ యాక్ట్’(- సఫెమా) ను అమలు చేస్తున్నది. ఈ మేరకు చెన్నైలోని ‘సౌత్ ఇండియా సఫెమా కాంపిటెంట్ అథారిటీ’కి రిపోర్ట్ పంపించారు.
గ్రామాల్లోనూ విస్తరిస్తోంది:
గంజాయి, డ్రగ్స్ కల్చర్ పట్టణాల నుంచి గ్రామాలకు పాకింది. గంజాయి మత్తుకు బానిసలైన యువత ఈజీ మనీ కోసం తామే సప్లయర్స్‌గా మారుతున్నారు. దీంతో హైదరాబాద్‌తోపాటు రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి చైన్ లింక్ పెరిగిపోతున్నది. ఇదే అవకాశంగా చేసుకుని గంజాయి, డ్రగ్స్ సప్లయర్స్ ఆర్గనైజ్డ్ నెట్‌వర్క్ ఏర్పాటు చేసుకున్నారు.
విశాఖ, ఒడిశా ఏజెన్సీ ప్రాంతాల నుంచి హైదరాబాద్ మీదుగా దేశవ్యాప్తంగా ట్రాన్స్‌పోర్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఏజెంట్స్ నెట్‌వర్క్ ఏర్పాటు చేసుకున్నారు. వీరి ద్వారా స్థానికంగా గంజాయి అమ్మకాలు జరుపుతూనే ఇతర రాష్ట్రాలకు ట్రాన్స్‌పోర్ట్ చేస్తున్నారు.