న్యూ ఇయర్​ టార్గెట్​గా సిటీకి గంజాయి..

న్యూ ఇయర్​ టార్గెట్​గా సిటీకి గంజాయి..
  • పలు చోట్ల పోలీసులు దాడులు.. రూ. లక్షల సరుకు స్వాధీనం

న్యూఇయర్​ టార్గెట్​గా గంజాయిని ఒడిశా, మహారాష్ట్ర నుంచి రైళ్లలో, బస్సుల్లో హైదరాబాద్​ తీసుకువచ్చి అమ్మేందుకు ప్లాన్​ చేసిన పలువురు నిందితులను ఎక్సైజ్​, టాస్క్​ఫోర్స్​పోలీసులు పట్టుకున్నారు.  

మలక్ పేట,వెలుగు: ఒడిశా నుంచి గంజాయి తెచ్చి మలక్​పేటలో అమ్మేందుకు యత్నిస్తున్న ఐదుగురిని మలక్ పేట పోలీసులు పట్టుకొని, 30 కిలోల  గంజాయి స్వాధీనం చేసుకున్నారు. సౌత్ ఈస్ట్ జోన్ అడిషనల్ డీసీపీ స్వామి మలక్ పేట పీఎస్​లో వివరాలు వెల్లడించారు.

 యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ కు చెందిన ఇక్కిరి భాస్కర్ , వల్లందాస్ వంశీ , జిట్టా కిరణ్, బోయిని వంశీ , మహబూబ్ నగర జిల్లాకు చెందిన ఆళ్ల భరత్ కుమార్ రెడ్డి ఒడిశా నుంచి గంజాయి తెచ్చి హైదరాబాద్​లో అమ్మేందుకు ప్లాన్​ వేశారు. గడ్డి అన్నారం ఎక్స్ రోడ్, మలక్ పేట్ మీదుగా ధూల్ పేట్ వైపు బైక్​ ఎస్కార్ట్ తో కారులో తరలిస్తుండగా  పోలీసులు పట్టుకున్నారు. గంజాయి తో పాటు కారు, బైక్ స్వాధీనం చేసుకున్నారు. వీరిని అరెస్ట్​ చేసి రిమాండ్​కు పంపినట్టు డీసీపీ తెలిపారు.

సికింద్రాబాద్ లో​ రూ.3.6 లక్షల గంజాయి

సికింద్రాబాద్​: ఒడిశా నుంచి సికింద్రాబాద్​ మీదుగా షోలాపూర్​కు గంజాయి తరలిస్తున్న ఓ స్మగ్లర్​ను రై ల్వే పోలీసులు అరెస్టు చేసి, రూ.3. 6 లక్షల విలువ చేసే 12.3 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్టు రైల్వే అర్బన్​ డీఎస్సీ జావేద్​ , సికింద్రాబాద్ రైల్వే ఇన్ స్పెక్టర్​ సాయి ఈశ్వర్​ గౌడ్​ వెల్లడించారు. 

షోలాపూర్​ కు చెందిన రోహన్​ రాజు సర్తాలే, శరత్​, పవార్​ అవా జాదవ్ ఒడిస్సాలో గంజాయి కొని షోలాపూర్​కు తీసుకువెళ్లి అమ్ముతున్నారు. సికింద్రాబాద్​ రైల్వే స్టేషన్​కు చేరుకున్న వీరు షోలాపూర్​ వెళ్లేందుకు స్టేషన్​లో వేచి ఉండగా పోలీసులకు అనుమానం వచ్చి బ్యాగు చెక్​ చేశారు. గంజాయి దొరకడంతో అరెస్ట్​ చేశారు. 

ట్రావెల్స్ బస్సులో 4 కిలోలు.. 

హైదరాబాద్​సిటీ : మహారాష్ట్ర నుంచి ఓ ట్రావెల్స్​బస్సులో  గంజాయి రవాణా చేస్తుండగా సుచిత్ర సర్కిల్​లో  పట్టుకున్నారు. పక్కా సమాచారంతో ఎస్టీఎఫ్​ బిక్షారెడ్డి, ఎస్సై బాలరాజు తనిఖీ చేయగా 4 కిలోల గంజాయి దొరికింది.  నాగ్‌పూర్‌ కు చెందిన చాచా అలియాస్‌ ఐజాష్‌ మరికొంతమందితో కలిసి ఈ గంజాయిని హైదరాబాద్‌కు తరలిస్తున్నట్టు తేలింది. గంజాయిని తీసుకు వచ్చిన అమ్జద్‌ను, రూ. 75 వేలు పెట్టి గంజాయి కొన్న అమీర్‌ను పట్టుకొని కేసు నమోదు చేశారు.