రిమ్స్​లో కనీస వైద్యసేవలు కూడా అందడంలేదు

  • ప్రధాని అసంతృప్తి.. నివేదిక ఇవ్వాలని పీఎంవోకు ఆదేశం
  • కేంద్ర నిధులతో దవాఖాన నిర్మాణం.. ఇటీవల సందర్శించిన రుపాలా
  • ఆసుపత్రిపై కేబినెట్ భేటీలో ప్రస్తావించిన కేంద్ర మంత్రి

ఆదిలాబాద్, వెలుగు:  ఆదిలాబాద్ రిమ్స్​ ఆవరణలో కేంద్రం నిధులతో ఏర్పాటు చేసిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్​లో వైద్యసేవలపై ప్రధాని నరేంద్రమోడీ ఆరా తీశారు. ప్రధాన మంత్రి స్వస్థ్య సురక్ష యోజన కింద రూ.150 కోట్లతో హాస్పిటల్ ను పూర్తి చేసి నెలలు గడుస్తున్నప్పటికీ రాష్ట్ర సర్కారు కనీసం డాక్టర్లను నియమించుకోకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. హాస్పిటల్​ప్రస్తుత పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని పీఎంవో ఆఫీసర్లను ఆదేశించారు. గురువారం ఢిల్లీలో జరిగిన కేబినెట్ మీటింగ్ లో కేంద్ర మత్స్య , పశుసంవర్థక శాఖ మంత్రి పురుషోత్తం రుపాలా.. రిమ్స్ లో ఏర్పాటైన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్​లో కనీస వైద్యసేవలు కూడా అందడంలేదని ప్రస్తావించారు. ఈ నెల 22న ఆదిలాబాద్​లో పర్యటించిన రుపాలా.. రిమ్స్ లోని సూపర్​స్పెషాలిటీ హాస్పిటల్​ను సందర్శించారు. వైద్య సేవలపై రోగులను, ఆఫీసర్లను అడిగి తెలుసుకున్నారు. హాస్పిటల్ కు 52 స్పెషలిస్టులు, డాక్టర్ పోస్టులు మంజూరు కాగా, 9 మంది డాక్టర్లను మాత్రమే నియమించిన విషయాన్ని గుర్తించారు. మొత్తం 43 పోస్టులు ఖాళీగా ఉండడంతో రెండు విభాగాల్లో ఓపీ సేవలు తప్ప ఐపీ సేవలు అందడం లేదని రిమ్స్ డైరెక్టర్ కేంద్ర మంత్రికి వివరించారు. డైరెక్టర్ నుంచి రిపోర్ట్​ తీసుకున్న రుపాలా గురువారం కేబినెట్ మీటింగ్​లో ఈ అంశాన్ని ప్రస్తావించినట్లు తెలుస్తోంది.

సర్కార్ ఆఫర్ కు ఆసక్తిచూపని డాక్టర్లు
రిమ్స్​ఆవరణలో రూ.150 కోట్ల అంచనాతో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పనులను 2016 జులైలో ప్రారంభించారు. ఇందులో కేంద్రం వాటా రూ.120 కోట్లు, రాష్ట్రం వాటా రూ.30 కోట్లు కాగా, రాష్ట్ర వాటా విడుదలలో జాప్యం వల్ల 2018లో పూర్తవ్వాల్సిన పనులు 2022 దాకా కొనసాగాయి. చివరికి 2022 మార్చి 4న హాస్పిటల్​ను హెల్త్​ మినిస్టర్ హరీశ్​రావు ప్రారంభించారు. కానీ ప్రభుత్వం ఇప్పటి వరకు 9 మంది డాక్టర్లను మాత్రమే నియమించింది. పలుమార్లు నోటిఫికేషన్లు ఇచ్చినా సర్కారు ఇచ్చే జీతాలు సరిపోక ఎవరూ ముందుకు రావడం లేదు. ప్రైవేట్​లో స్పెషలిస్టుల జీతాలు రూ.5 లక్షల వరకు ఉండగా.. సర్కారు నెలకు రూ.1.20 లక్షలే ఇస్తామనడం, అది కూడా కాంట్రాక్ట్ పద్ధతిలోనే నియమిస్తామనడంతో డాక్టర్లు ఆసక్తి చూపలేదని తెలుస్తోంది. ప్రస్తుతం 43 పోస్టులు ఖాళీగా ఉండడంతో కేవలం పీడియాట్రిక్, యూరాలజీకి సంబంధించిన ఓపీ సేవలు మాత్రమే అందుతున్నాయి.

నివేదికకు ప్రధాని ఆదేశం
రిమ్స్​లోని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్​లో పరిస్థితి దారుణంగా ఉన్నందునే ప్రధాని స్పందించినట్లు తెలుస్తోంది. వందల కోట్లు పెట్టి హాస్పిటల్ కడితే కనీసం డాక్టర్లను సైతం నియమించలేని పరిస్థితిలో తెలంగాణ ప్రభుత్వం ఉందా? అని ఆయన ప్రశ్నించినట్లు తెలిసింది. దీనిపై సమగ్ర నివేదిక అందించాలని ఆదేశించడంతో పీఎంవో సెక్రటరీ బీజేపీ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్‌‌‌‌కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. ఈ నెల 22న ఆదిలాబాద్​లో పర్యటించిన రూపాలకు రిమ్స్​పై ఫిర్యాదు చేసినందునే తనకు ఫోన్​చేసి ఆరా తీసినట్లు ఆయన చెప్పారు. పీఎంవో నుంచి గురువారం ఫోన్​ చేసిన ఆఫీసర్లకు రిమ్స్ పరిస్థితిపై అన్ని వివరాలు చెప్పినట్లు తెలిపారు. 

వృథాగా రూ.70 కోట్ల పరికరాలు 
రిమ్స్ లో పరికరాల కోసం రూ. 70 కోట్లు వెచ్చించారు. కానీ స్పెషలిస్టులు లేకపోవడంతో న్యూరాలజీ, న్యూరోసర్జరీ, నెఫ్రాలాజీ, గ్యాస్ట్రో ఎంట్రాలజీ, ప్లాస్టిక్ సర్జరీ, కార్డియాలజీ, సీటీవీఎస్, అనస్తీషియా విభాగాలు ఖాళీగా ఉన్నాయి. కోట్లు ఖర్చు పెట్టి ఏర్పాటుచేసిన వెంటిలేటర్ మానిటర్స్, బైపాస్ మిషన్స్, హై అండ్ ఆపరేషన్ ఎక్విప్​మెంట్, మల్టి పారామానిటర్, ఆంజియోప్లాస్టిక్, క్యాథలాబ్ లాంటివాటిని పక్కనపెట్టేశారు. 42 ఐసీయూ బెడ్లు, 9 ఎమర్జెన్సీ వార్డులు, 7 ఆపరేషన్ థియేటర్ల గదులకు తాళాలు వేశారు.