- మా దేశంలో మైనారిటీలను గౌరవిస్తున్నాం: అఫ్ఘాన్
న్యూఢిల్లీ: ‘దయ చేసి మమ్మల్ని పాకిస్థాన్‌తో జతకట్టొద్దు. మైనారిటీలను గౌరవించే విషయంలో ఆ దేశంతో మమ్మల్ని పోల్చొద్దు’ అని అఫ్ఘానిస్థాన్ కోరింది. తమ దేశంలో మైనారిటీలకు మంచి గౌరవం దక్కుతోందని, వారికి పార్లమెంటు సీట్లలో కోటా కూడా ఇచ్చామని తెలిపింది.
పాకిస్థాన్, అఫ్ఘానిస్థాన్, బంగ్లాదేశ్‌లో హింసకు గురవుతూ 2015కు ముందు శరణార్థులుగా భారత్‌కు వచ్చిన హిందూ, సిక్కు, బౌద్ద, క్రైస్తవ, ఇతర మైనారిటీ మతాల వాళ్లకు ఇక్కడి పౌరసత్వం ఇచ్చేలా సిటిజన్‌షిప్ చట్టం-1955లో సవరణకు బిల్లు తెచ్చింది భారత ప్రభుత్వం. ఆ దేశాల్లో మత స్వేచ్ఛ లేదని, మైనారిటీలుగా ఉన్న ముస్లిమేతరులను హింసిస్తున్నారని అమిత్ షా పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంగా అన్నారు.
ఈ బిల్లుపై ఇండియాలోని అఫ్ఘాన్ రాయబారి జాతీయ మీడియాతో మాట్లాడారు. మైనారిటీల పట్ల వ్యవహరించే తీరు విషయంలో తమను పాకిస్థాన్‌తో పోల్చొద్దన్నారు. నాలుగు దశాబ్దాల పాటు తమ దేశంలో యుద్ధం కొనసాగిందని, దేశంలో ప్రతి ఒక్కరూ బాధితులుగానే ఉన్నారని చెప్పారాయన. అయితే తాలిబన్ల బారి నుంచి బయటపడిన తర్వాత ఏర్పడిన కొత్త ప్రభుత్వం మైనారిటీలను మంచిగానే గౌరవిస్తోందని అన్నారు. సిక్కులను సోదర భావంతో చూస్తున్నామని, వారికి పార్లమెంటులో సీట్లు కూడా కేటాయించామని తెలిపారు. అఫ్ఘాన్ ప్రెసిడెంట్ ఆఫీసులో సిక్కులకు ఒక ప్రత్యేక రాయబారిని కూడా నియమించినట్లు చెప్పారు. భారత్‌లో ఉన్న అఫ్ఘాన్ సిక్కులకు ప్రత్యేకంగా ఐడీ కార్డులు కూడా ఇచ్చామన్నారు. తాము మైనారిటీల పట్ల ఎప్పుడూ గౌరవంగా వ్యవహరించామని తెలిపారు.