పెర్త్ గడ్డపై అద్భుత విజయాన్ని అందుకున్న టీమిండియా.. అడిలైడ్‌లో చిత్తయ్యింది. ఏకంగా 10 వికెట్ల తేడాతో ఆతిథ్య జట్టు చేతిలో భంగపోయింది. ఆటలో గెలుపోటములు సహజమే అయినప్పటికీ.. ఐదు రోజుల టెస్టు కాస్త రెండున్నర రోజుల్లోనే ముగిసిందంటే మనోళ్ల ఆట అర్థం చేసుకోవాలి. పింక్‌బాల్‌పై భారత యువ ఆటగాళ్లకు అనుభవం లేకపోవడం ఒక్కటే ఇక్కడ సమస్య కాదు.. గంపెడు ఆశలు పెట్టుకున్న ఐపీఎల్ హీరోలంతా అడిలైడ్ గడ్డపై చిత్తవ్వడం ప్రధాన సమస్య. ఈ పేలవ ప్రదర్శన మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్‌కు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది.
ALSO READ | SA vs SL, 2nd Test: ఊహించని అద్భుతం: సౌతాఫ్రికా వికెట్ కీపర్ సంచలన క్యాచ్
అడిలైడ్ టెస్టులో టీమిండియా పేలవ ప్రదర్శన తరువాత.. ఆటగాళ్ల సన్నద్ధతపై గవాస్కర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. పింక్ బాల్ పోరుకు అవసరమైన సన్నద్దత భారత ఆటగాళ్లకు లభించలేదన్న గవాస్కర్.. మూడో టెస్టు నాటికైనా కావలసినంత ప్రాక్టీస్ చేయమని సూచించారు. రెండున్నర రోజుల్లోనే ఆడిలైడ్ టెస్టు ఫలితం తేలడంతో.. చివరి రెండు రోజులు మిగిలిపోయాయి. ఈ రెండు రోజులను ప్రాక్టీస్ కోసం ఉపయోగించుకోవాలని భారత క్రికెటర్లకు మాజీ దిగ్గజం సూచించారు. రోహిత్, కోహ్లీ సహా ఇతరులు తమ హోటల్ గదులలో కూర్చోకుండా బయటకు వచ్చి ప్రాక్టీస్ చేయాలని కోరారు.
"మిగిలిన సిరీస్‌ను మూడు మ్యాచ్‌ల సిరీస్‌గా చూడండి. ఇది ఐదు టెస్టుల సిరీస్ అని మర్చిపోండి. రాబోయే రెండు రోజులను భారత జట్టు ప్రాక్టీస్ కోసం ఉపయోగించాలని నేను కోరుకుంటున్నా.. ఇది మనకు లభించిన విలువైన సమయం. మీరు చేయగలరు. మీరు క్రికెట్ ఆడేందుకు ఇక్కడికి వచ్చారు. కావున ఈ విషయాన్ని గుర్తుంచుకొని హోటల్ రూములకు పరిమితం అవ్వకుండా మైదానంలోకి దిగండి. మరింత ఎక్కువ ప్రాక్టీస్ చేయండి.."
"మీరు రోజంతా ప్రాక్టీస్ చేయనవసరం లేదు. మీరు ఉదయం లేదా మధ్యాహ్నం సెషన్‌లో ఏ సమయంలోనైనా ప్రాక్టీస్ చేయవచ్చు. కానీ విలువైన సమయాన్ని వృథా చేయకండి. టెస్ట్ మ్యాచ్ జరిగితే మీరు ఇక్కడ టెస్ట్ మ్యాచ్ ఆడుతూ ఉండేవారు. అలా అనుకునే మీ సన్నద్ధతను కొనసాగించండి. బ్యాటర్లు పరుగులు చేయడంలో విఫలమైనందున లయలోకి రావడానికి ఎక్కువ సమయం తీసుకోవాలి. బౌలర్లకు రిథమ్ లభించలేదు. మధ్యలో సమయం అవసరమయ్యే ఇతరులు కూడా ఉన్నారు."
"ప్రాక్టీస్ ఎవరికి అవసరం.. ఎవరికీ అవసరం లేదనేది.. కెప్టెన్, కోచ్ నిర్ణయిస్తారు. మీరు 150 కొట్టారు, మీరు ప్రాక్టీస్‌కు రావలసిన అవసరం లేదు. అరే, నువ్వు మ్యాచ్‌లో 40 ఓవర్లు బౌలింగ్ చేశావు. ప్రాక్టీస్‌కి రానవసరం లేదు అని వారు నిర్ణయిస్తారు. అంతేతప్ప, వాళ్లకు ఆప్షన్ ఇవ్వకూడదు. ప్లేయర్స్‌కి ఆ ఆప్షన్ ఇస్తే నేను బాగానే ఆడాను.. నేను నా రూమ్‌లోనే ఉంటాను అని చెబుతారు. మరి భారత క్రికెట్‌కు అవసరం లేదు. దేశం కోసం ఆడటం ఒక గౌరవం. గెలుపుకోసం ఆడదాం.." అని గవాస్కర్ భారత క్రికెటర్లకు గుర్తు చేశాడు.
ఆ ముగ్గురూ..
అదే సమయంలో గవాస్కర్.. జస్ప్రీత్ బుమ్రా , రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలకు ఉన్న అనుభవం కారణంగా వారిని పెద్దగా విమర్శించలేదు.
"దయచేసి వచ్చి ప్రాక్టీస్ చేయమని వారికి నా విన్నపం. మళ్లీ బుమ్రా ప్రాక్టీస్ చేయనవసరం లేదు. రోహిత్, విరాట్‌లు ప్రాక్టీస్ చేయనవసరం లేదు. ఫర్వాలేదు, ఎందుకంటే వారు అనుభవజ్ఞులైన ఆటగాళ్లు. ఇతరులు బయటకు వచ్చి ప్రాక్టీస్ చేయనివ్వండి. "అని గవాస్కర్ అన్నారు.
ప్రస్తుతం ఇరు జట్ల మధ్య జరుగుతున్న ఈ బోర్డర్- గవాస్కర్ ట్రోఫీ. ఆయన పేరిట జరుగుతున్నదే. సిరీస్ గెలిచి తన పేరు నిలబెట్టాలని ఈ తాపత్రయమంతా..
డిసెంబర్ 14 నుంచి గబ్బా వేదికగా మూడో టెస్టు ప్రారంభం కానుంది. తొలి టెస్టులో భారత్ గెలవగా.. రెండో టెస్టులో ఆసీస్ గెలిచి సిరీస్ సమం చేసింది.
INDIA'S WTC FINAL SCENARIO 🇮🇳
— Mufaddal Vohra (@mufaddal_vohra) December 9, 2024
Win BGT 4-1 or 3-1 - India qualifies.
Win BGT 3-2 - India qualifies if SL beat Aus in one of two Tests.
If BGT 2-2 - India qualifies if SL beat Aus 2-0.
If India lose BGT 2-3 - India qualifies if Pak beat SA 2-0 & Aus beat SL in one of two Tests. pic.twitter.com/WQsAbn848m