రెంజల్/ నిజామాబాద్ సిటీ, వెలుగు; రెంజల్ మండలం బోర్గంలో ఐకేసీ ఆధ్వర్యంలో కొనుగోలు సెంటర్ ప్రారంభించినా వడ్లు కొంటలేరని, ఇక్కడ పీఏసీఎస్ ద్వారా కొనుగోళ్లు చేయాలని అఖిలభారత ప్రగతిశీల రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి వి ప్రభాకర్ డిమాండ్ చేశారు. ఐకేసీ సెంటర్ఏర్పాటు చేసినా నిర్వాహకులు హమాలీలను నియమించకపోవడం, ఖాళీ సంచులు, లారీలు రాకపోవడంతో వడ్లు తడిసి రైతులు నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్లో ఏఓకు వినతిపత్రం అందజేశారు.
మార్చి, ఏప్రిల్ నెలల్లో నాలుగు సార్లు కురిసిన అకాల వర్షాలకు రాష్ట్రంలో లక్ష ఎకరాలకు పైగా వరి, మక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయని, మామిడికాయలు రాలిపోయాయని, వ్యవసాయ మార్కెట్లలో పసుపు,మిర్చి తడిసిపోయాయని చెప్పారు. పంట దెబ్బతిన్న రైతులకు కేసీఆర్ ఎకరానికి రూ. 10వేల పరిహారాన్ని ప్రకటించినా ఒక్క పైసా ఇవ్వలేదని మండిపడ్డారు. అకాల వర్షాలతో నష్టపోయిన వాణిజ్య పంటలకు ఎకరానికి రూ. లక్ష, మామిడితోటలకు ఎకరానికి రూ. 50 వేల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లాలో వడ్లు తరుగు తీస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సహాయ కార్యదర్శి బి దేవారం, జిల్లా అధ్యక్షులు ఎస్ సురేశ్, ప్రధాన కార్యదర్శి గుమ్ముల గంగాధర్, పుట్టి నాగన్న.నసీర్,బి బాబన్న, శంకరన్న,, కిషన్ రమేశ్, మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు.