నీట్ పరీక్షను రద్దు చేయలేం: సుప్రీం కోర్టు

 నీట్ పరీక్షను రద్దు చేయలేం: సుప్రీం కోర్టు

నీట్‌ -యుజి పరీక్ష పవిత్రత దెబ్బతినేలా వ్యవస్థాగత ఉల్లంఘన జరగలేదని సుప్రీం కోర్టు తెలిపింది. ఆ కారణంగానే నీట్ పరీక్షను రద్దు చేయలేమని సుప్రీంకోర్టు శుక్రవారం పేర్కొంది. వచ్చే ఏడాది నిర్లక్ష్యం లేకుండా పరీక్షలు నిర్వహించేందుకు తగిన చర్యలు చేపట్టాలని కేంద్రానికి, ఎన్‌టిఎకి మొట్టికాయలేసింది. నీట్‌లో సంస్కరణలను పరిగణనలోకి తీసుకునేలా కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ పరిధిని పెంచుతున్నట్లు సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌, జస్టిస్‌ జె.బి.పార్థివాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఈ తీర్పునిచ్చింది. 

మరోసారి పరీక్ష నిర్వహించాలన్న పిటిషన్‌ను తిరస్కరిస్తున్నప్పటికీ, పరీక్షలో అవకతవకలు జరిగినందున 44 మంది అభ్యర్థులు కచ్చితమైన మార్కులు సాధించారని చీఫ్‌ జస్టిస్‌ ఈ సందర్భంగా తెలిపారు. పరీక్షల నిర్వహణ వ్యవస్థలో లోపాలను సరిదిద్దేందుకు నియమించిన ఇస్రో మాజీ చీఫ్‌ కె.రాధాకృష్ణన్‌తో కూడిన కమిటీ సెప్టెంబర్‌ 30లోగా నివేదిక సమర్పించాల్సిందిగా గడువు విధించింది. పరీక్షా విధానాన్ని పటిష్టం చేసేందుకు సాంకేతికత పురోగతిని స్వీకరించేలా ప్రామాణిక ఆపరేటింగ్‌ విధానాన్ని రూపొందించడాన్ని కె.రాధాకృష్ణన్‌ కమిటీ పరిశీలించాలని సూచించింది.