పేదల కష్టాలు కేసీఆర్​కు కన్పిస్తలేవా?: రాజగోపాల్ రెడ్డి

  • కౌలు రైతులకు రైతుబంధు అడిగితే పట్టించుకోలే
  • కష్టాలు పోవాలంటే బీజేపీ జెండా ఎగరాలని పిలుపు 

సంస్థాన్‌‌‌‌ నారాయణపురం, వెలుగు:  మునుగోడులో జరిగేది రాజకీయ ఎన్నిక కాదని ఇది ఒక ధర్మ యుద్ధం అని బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ప్రభుత్వ దవాఖాన్లలో సౌలతులు సరిగా లేక నిరుపేద కుటుంబాల ప్రజలు అవస్థలు పడ్తున్నారన్నారు. పేదల కష్టాలు పోవాలంటే బీజేపీ జెండా ఎగరాలన్నారు. మునుగోడులో బీజేపీ గెలిస్తే చౌటుప్పల్ లో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి, నారాయణపురంలో హ్యాండ్లూమ్ పార్కు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. కేంద్ర హోం మంత్రి అమిత్​షాతో మాట్లాడి వీటిపై హామీ కూడా తీసుకున్నానని వెల్లడించారు. మునుగోడు ఉప ఎన్నిక బీజేపీ స్టీరింగ్ కమిటీ చైర్మన్‌‌‌‌ వివేక్‌‌‌‌ వెంకటస్వామి, ఎమ్మెల్యే రఘునందన్ రావు, నేతలు గంగిడి మనోహర్‌‌‌‌రెడ్డి, స్వామిగౌడ్, కాసం వెంకటేశ్వర్లుతో కలిసి శనివారం యాదాద్రి జిల్లా గుజ్జ, మల్లారెడ్డిగూడెం, సర్వేల్‌‌‌‌, అల్లందేవి చెరువు, చిమిర్యాల, గుడిమల్కాపురం, కొత్తగూడెం, నారాయణపురం గ్రామాల్లో రాజగోపాల్ రెడ్డి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో విచ్చలవిడిగా మద్యం షాపులు తెరిచి మహిళల పుస్తెలతాళ్లు తెంపుతున్నాడని విమర్శించారు. కౌలు రైతులకు కూడా రైతుబంధు ఇవ్వాలని తాను కొట్లాడినా సీఎం స్పందించలేదన్నారు. కేసీఆర్ కుటుంబం దోచుకున్న రూ. లక్ష కోట్లను కక్కించి జైలుకు పంపిస్తామన్నారు. కేటీఆర్ మునుగోడును దత్తత తీసుకుంటానని అంటున్నాడని, ఇక్కడ ఉన్న అభ్యర్థికి ఆ సత్తా లేదా? అని మరోసారి ప్రశ్నించారు. ఇప్పటివరకు తెలంగాణలో బతుకమ్మ ఆడిన కవిత వచ్చే ఏడాది తీహార్ జైల్లో ఆడుతుందని రాజగోపాల్ రెడ్డి ఎద్దేవా చేశారు. కవితకు ఢిల్లీలో 600 లిక్కర్‌‌‌‌ షాపులు ఉన్నాయని ఆయన ఆరోపించారు.  

టీఆర్ఎస్​కు ఆఫీసర్ల ప్రచారమా?: రఘునందన్ రావు 

మునుగోడులో టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌కు ఓటు వేయాలని ఆఫీసర్లే ప్రజలకు చెబుతున్నారని, ఈ విషయంపై కలెక్టర్‌‌‌‌ స్పందించి చర్యలు తీసుకోవాలని రఘునందన్‌‌‌‌రావు డిమాండ్ చేశారు. కలెక్టర్ చర్యలు తీసుకోకుంటే ఎలక్షన్ కమిషన్‌‌‌‌కు కంప్లైంట్‌‌‌‌ చేస్తామన్నారు. రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చినట్లు టీఆర్ఎస్ నిరూపిస్తే.. బీజేపీ లీడర్లమంతా మునుగోడు నుంచి వెళ్లిపోతామని రఘునందన్‌‌‌‌రావు సవాల్‌‌‌‌ చేశారు. ఓట్లు అడిగేందుకు వచ్చిన టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ లీడర్లను డబుల్‌‌‌‌ బెడ్రూం ఇండ్ల కోసం నిలదీయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. 

అవినీతిలో కేసీఆర్ నంబర్ 1: వివేక్ వెంకటస్వామి

అవినీతికి పాల్పడటం, మోసం చేయడంలో సీఎం కేసీఆర్‌‌‌‌ నంబర్‌‌‌‌ వన్‌‌‌‌ అని వివేక్‌‌‌‌ వెంకటస్వామి అన్నారు. ఎన్నికల సమయంలో మాయమాటలు చెప్పి ఓట్లు వేయించుకొని, తర్వాత ఫామ్‌‌‌‌హౌజ్‌‌‌‌లో పడుకుంటారని విమర్శించారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వని సీఎం.. తన కుటుంబంలో అందరికీ పదవులు ఇచ్చుకున్నాడన్నారు. కల్వకుంట్ల కుటుంబం ప్రతి నెలా ప్రభుత్వ ఖజానా నుంచి రూ.25 లక్షలు జీతాల రూపంలో తీసుకుంటోందన్నారు. ఉద్యోగులకు జీతాలివ్వడానికి పైసలు లేకపోయినా.. రూ.100 కోట్లు పెట్టి విమానం కొంటున్నారన్నారు. ఉద్యమ టైంలో నయాపైసా లేని కేసీఆర్‌‌‌‌కు ఇప్పుడు రూ.కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. పేదలకు మూడెకరాల భూమి ఇవ్వని కేసీఆర్ తన కుటుంబసభ్యులకు ఫామ్‌‌‌‌హౌజ్‌‌‌‌లు కట్టించుకున్నాడని ఆరోపించారు. రాజగోపాల్‌‌‌‌రెడ్డి మాత్రం నారాయణపురం మండలం కొత్తగూడెంలో తన సొంత నిధులతో పేదలకు ఇండ్లు కట్టించారని గుర్తు చేశారు.