
న్యూఢిల్లీ: అమెరికా వస్తువులపై దిగుమతి సుంకాలను తగ్గిస్తామని ఆ దేశానికి హామీ ఇవ్వలేదని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద వెల్లడించారు. రెండు దేశాలూ పరస్పరం ప్రయోజనకరంగా ఉండేలా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి చర్చలకు ప్లాన్ చేస్తున్నట్టు తెలిపారు. మంగళవారం లోక్ సభకు ఆయన ఈ మేరకు రాతపూర్వకంగా సమాధానమిచ్చారు. ఒప్పందంలో భాగంగా రెండు దేశాలూ మార్కెట్ యాక్సెస్‌ను పెంచుకోవడం, టారిఫ్ లను తగ్గించుకోవడం, సప్లై చైన్‌ను మెరుగుపర్చుకోవడం వంటి అంశాలపై దృష్టి పెట్టనున్నాయని పేర్కొన్నారు.
‘‘ఈ రోజు వరకూ ఇండియాపై అమెరికా ప్రతీకార టారిఫ్ లు విధించలేదు. బైలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ పై చర్చించేందుకు మాత్రం రెండు దేశాలు సిద్ధమవుతున్నాయి” అని ఆయన స్పష్టం చేశారు. ఇండియా డబ్ల్యూటీవోలో సభ్య దేశంగా ఉన్నందున, సంబంధిత రూల్స్ కు అనుగుణంగానే గరిష్టంగా టారిఫ్ లను విధిస్తుందన్నారు. వాణిజ్యాన్ని నియంత్రించడం, దేశీయ పరిశ్రమలను కాపాడటం, వస్తువుల ఎగుమతులు, దిగుమతుల ద్వారా ట్యాక్స్ ఆదాయం పెంచుకోవడం వంటి అంశాల ఆధారంగానే భారత టారిఫ్ పాలసీ ఉంటుందన్నారు.
అమెరికా, ఇండియా మధ్య ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని, ట్రేడ్ టారిఫ్‌లపై ఇంకా ఒప్పందానికి రాలేదని సోమవారం వాణిజ్య శాఖ సెక్రటరీ సునీల్ బర్త్వాల్ కూడా విదేశీ వ్యవహారాలపై నియమితమైన పార్లమెంటరీ ప్యానెల్‌కు వివరించారు. టారిఫ్ లను తగ్గించుకునేందుకు ఇండియా అంగీకరించిందని, ఏప్రిల్ 2 నుంచి ఇండియా సహా వివిధ దేశాలపై ప్రతీకార సుంకాలు అమలు చేస్తామని ట్రంప్ ఇటీవల ప్రకటనలు చేసిన నేపథ్యంలో పార్లమెంటరీ ప్యానెల్ కు ఈ మేరకు సునీల్ బర్త్వాల్ వివరణ ఇచ్చారు.