
విడాకులు అనేవి ఈ మధ్య కాలంలో సర్వ సాధారణం అయిపోయాయి. మారుతున్న సామాజిక, ఆర్థిక పరిస్థితుల కారణంగా దంపతులు ఎక్కువ కాలం కలిసి ఉండలేక పోతున్నారు. ఈ కేసులలో మధ్యంతర భరణం అనేది ఒక ముఖ్యమైన అంశం. విడిపోయిన తర్వాత భార్య, పిల్లల పోషణకు భర్త భరణం ఇవ్వడం చట్టపరంగా అమలవుతూ వస్తోంది. అయితే తాజాగా ఈ అంశంపై ఢిల్లీ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది.
విడాకుల కేసులో ఢిల్లీ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. సంపాదించేందుకు కావాల్సిన అర్హతలు ఉన్న వారు భర్త నుండి భరణం కోరడానికి వీలు లేదని తేల్చిచెప్పింది. మార్చి 19న హియరింగ్ కు వచ్చిన భరణం కేసులో వాదనలు విన్న జడ్జి.. మహిళ పిటిషన్ ను తిరస్కరించారు. చదువు, అర్హత, వయసు ఉండి.. సంపాదించే అవకాశం ఉన్నందున, భరణం ఇవ్వాలని సదరు భర్తను ఆదేశించలేమని చెబుతూ పిటషన్ తిరస్కరించారు.
ఈ కేసులో వాదనలు విన్న జస్టిస్ చంద్ర ధారి సింగ్.. సెక్షన్ 125, CrPC ప్రకారం.. భార్యలు, పిల్లలు, తల్లిదండ్రుల భరణం కోసం.. జీవిత భాగస్వాముల మధ్య సమానత్వాన్ని కొనసాగించడానికి భార్యలు, పిల్లలు, తల్లిదండ్రులకు రక్షణ కల్పించడానికి చట్టం ఉంది కానీ, ఈ పేరుతో వారు పనీ పాటా లేకుండా ఉండడాన్ని కోర్టు ఆమోదించదన్నారు.
ఈ అంశంపై ఇంతకు ముందే ట్రయల్ కోర్టు మధ్యంతర భరణం ఇవ్వాల్సిందిగా వేసిన పిటిషన్ ను కొట్టివేసింది. దీంతో హైకోర్టును ఆశ్రయించగా జడ్జీ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.
‘‘బాగా చదువుకున్న మహిళ.. సూటబుల్ జాబ్ చేసేందుకు కావాల్సిన అన్ని అర్హతలు ఉన్నాయి. అలాంటప్పుడు కేవలం భర్త ఇచ్చే భరణంపై ఆధారపడి బతకడం సబబు కాదు. ఉద్యోగం చేసుకునే అర్హత, వయసు, తెలివి ఉన్నప్పుడు భరణం అడగటం సమంజసం కాదు. ప్రపంచ అంశాలపై అవగాహన ఉంది. జాబ్ చేసిన అనుభవం ఉంది. అందుకే ఈ కేసులో మధ్యంతర భరణం ఇవ్వాల్సిందిగా ఆదేశించలేం’’ అని వ్యాఖ్యానించింది.
ఈ కేసులో పిటిషన్ దారు అయిన మహిళ, ఆమె భర్త 2019లో వివాహం చేసుకుని ఉద్యోగం కోసం సింగపూర్ వెళ్లారు. అయితే భర్త నుంచి గృహహింస ఎదుర్కొన్నానని, చివరికి అత్తా మామలు కూడా వేదించారని పేర్కొంది. 2021 లో తిరిగి ఇండియాకు వచ్చింది. భర్త నుంచి దూరం అయ్యాక తన బంగారు ఆభరణాలు అమ్ముకున్నానని, ఆర్థిక సమస్యలతో తన బాబాయ్ దగ్గర ఉంటున్నట్లు పేర్కొంది. తన భర్త నుంచి మధ్యంతర భరణం ఇప్పించాల్సిందిగా 2021 జూన్ నెలలో పిటిషన్ వేసింది.
ఈ కేసులో ట్రయల్ కోర్టు పిటిషన్ కొట్టి వేయడంతో హైకోర్టులో మరో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు.. ఉద్యోగం చేయాల్సిన విద్యార్హతలు, సామర్థ్యం ఉన్నందున భరణం ఇప్పించలేమని ఆమె పెటిషన్ ను కొట్టివేసింది.