భవితకు పునాది వేసే సమతూకపు బడ్జెట్

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కమ్మేసిన అసాధారణ పరిస్థితుల నడుమ 2022–23 బడ్జెట్ రూపొందింది. ఆ మేరకు వరుసగా రెండో ఏడాది ప్రభుత్వం పెట్టుబడులను భారీగా పెంచడం ద్వారా ఉపాధి అవకాశాలను సృష్టించడంతోపాటు వృద్ధికి ఊతమివ్వడం ప్రధాన కర్తవ్యంగా బడ్జెట్​ను ప్రవేశపెట్టింది. అదే సమయంలో వ్యవసాయం, ఆరోగ్యం, విద్య, సంక్షేమ కార్యక్రమాలకూ మద్దతు కొనసాగించింది. తదనుగుణంగా ఈ బడ్జెట్​లో మూలధన వ్యయం 35 శాతానికిపైగా పెరిగింది. ఇక ‘పీఎం-–గతిశక్తి’ కార్యక్రమం మౌలిక సదుపాయాల విస్తరణకు మాత్రమే పరిమితం కాలేదు. సునిశిత, శ్రద్ధతో కూడిన ప్రణాళిక ద్వారా ఉన్నత ప్రమాణాలతో అది ముందంజ వేయాల్సి ఉంటుంది. సాధారణంగా రోడ్డు–రైలు–మెట్రో, రేవులు–రోడ్లు వంటి విభాగాల నడుమ సమన్వయ లోపం మనకు తరచూ అనుభవంలోకి వచ్చే అంశమే. ఈ నేపథ్యంలో సమీకృత ప్రణాళిక అమలు ద్వారా దేశీయ ఉత్పాదకతను, ఎగుమతుల్లో పోటీ సామర్థ్యాన్ని మనం గణనీయంగా 
పెంచుకోగలం.

లక్షలాది ఉద్యోగ, ఉపాధి అవకాశాల సృష్టి
లాభదాయక ఉపాధిని సృష్టించడం ప్రస్తుత బడ్జెట్ లోని మరో కీలక అంశం. ఆ మేరకు ఒక్క మూలధన వ్యయం పెంపుతోనే లక్షలాది ప్రత్యక్ష, ఇతర రంగాలపై ప్రభావంతో పరోక్ష ఉద్యోగాల సృష్టి సాధ్యమవుతుంది. ఇక రాష్ట్రాల్లో మూలధన వ్యయం కోసం అనూహ్యంగా చేయూత కల్పించడం ఈ బడ్జెట్​లో ఒక ప్రత్యేకత. ఇందుకోసం 50 సంవత్సరాల వడ్డీరహిత రుణ రూపేణా తోడ్పాటును ఇస్తూ రూ.లక్ష కోట్లు కేటాయించారు. ఇది ఆయా రాష్ట్రాల సాధారణ రుణసమీకరణ పరిమితికి అదనం. మరోవైపు ఎంఎస్ఎంఈలకు రుణహామీ పథకాన్ని నవీకరించి భారీ స్థాయిలో రూ.2 లక్షల కోట్ల దాకా కొత్త రుణాల మంజూరుకు భరోసా ఇచ్చారు. అలాగే ఇప్పటికే విజయవంతంగా అమలవుతున్న అత్యవసర దశలవారీ రుణహామీ పథకం ద్వారా కరోనా మహమ్మారి వల్ల ప్రభావితమైన ఆతిథ్య, పర్యాటక తదితర రంగాలకు అదనపు రుణ సౌకర్యం కల్పిస్తారు. ఇక పీఎం గ్రామ్ సడక్ యోజన కేటాయింపులు కూడా 27 శాతం మేర పెరిగాయి. అంతేకాకుండా కొన్ని ప్రాధాన్య శాఖలకు సంబంధించి రాష్ట్రాలు తమ వాటా సమకూర్చడానికి అనుబంధ నిధులు కూడా కేటాయించారు.

వ్యవసాయానికి అదనపు కేటాయింపులు
ఎరువుల సబ్సిడీలు, ధాన్యం సేకరణ సహా వ్యవసాయ రంగానికి మద్దతు కోసం అదనపు కేటాయింపులు చేశారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ప్రస్తుతం అమలవుతున్న జాతీయ ఆరోగ్య కార్యక్రమం, ఆయుష్ కార్యక్రమాలకు తోడు సరికొత్త ‘పీఎం స్వయం సమృద్ధ ఆరోగ్య మౌలిక సదుపాయాల కార్యక్రమం’ ద్వారా భారత ఆరోగ్య రంగ సామర్థ్యం మరింత మెరుగుపడే అవకాశాలు ఏర్పడతాయి. అదేవిధంగా అవసరాల ప్రాతిపదికన ఈశాన్య భారతం కోసం పీఎం ప్రగతి కార్యక్రమం(పీఎం-డివైన్) పేరిట మరో కొత్త, సరళ పథకం ప్రారంభమైంది. ప్రామాణిక పథకాల పరిధిలోకి రాని పథకాల పనులను దీని కింద చేపడతారు. ఇక 15వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు 130 కేంద్ర ప్రాయోజిత పథకాలు మరింత సరళమైనవిగా మార్పులు చేసి 65కు కుదించారు. అలాగే బెంగాల్ నుంచి ప్రవహించే జలాలతో మధ్య భారతంలో పంటల సాగుపై దార్శనికుడైన సుబ్రమణ్య భారతి ‘భారతదేశం’ కవితలో తన కలను ప్రకటించారు. ఆ మహాకవి 1921లో మరణించగా, ఇప్పుడు వందేళ్ల తర్వాత కెన్-బెత్వా ప్రాజెక్టు రూపంలో మొట్టమొదటి నదీ అనుసంధాన పథకం శ్రీకారం చుట్టుకోవడం గమనార్హం. 

పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో బడ్జెట్లు అనేక లక్ష్యాలను సాధించేందుకు తోడ్పడతాయి. ఇవి సాధారణ వార్షిక ఆర్థిక నివేదికలే అయినా, అత్యంత కీలకమైనవేగాక.. విధాన లక్ష్యాలను వెల్లడించే ప్రకటనలు కూడా. ప్రైవేట్ రంగం తరహాలో  ప్రభుత్వాలు తమ వినియోగదారులను ఎంచుకోలేవు. అవి ప్రజలందరికీ సేవలు అందించాల్సిందే. ఆ మేరకు అవి ‘కీలక సామర్థ్యాల’పై మాత్రమే దృష్టి కేంద్రీకరించే పరిస్థితి ఉండదు. కాబట్టి పార్లమెంట్, ప్రజలు ఆకాంక్షించే ప్రతి అంశాన్నీ నెరవేర్చాలి. అలాగే అనేక ‘ఉచితాల’ను అందిస్తాయి కాబట్టి సరఫరా లేదా పంపిణీతో పోలిస్తే వాటి కోసం డిమాండ్ చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రభుత్వాలు పన్నులు వసూలు చేస్తాయి. ఇందుకు ప్రజామోదం తక్కువే అయినా ఇది ఒక అనివార్య ప్రక్రియ. ఇలాంటి అనేక కారణాల వల్ల బడ్జెట్ రూపకల్పన అన్నది అత్యంత క్లిష్టమైనది. దీనికి తగ్గట్టుగానే ప్రస్తుత కేంద్ర బడ్జెట్​ సమతూకంతో రూపొందిందని చెప్పవచ్చు. ఆర్థికశాస్త్ర పరిభాషలో సమతూకపు బడ్జెట్ అంటే.. రాబడి-వ్యయం సమానంగా ఉండటం. అయితే, 2022–23 బడ్జెట్ విభిన్న కోణాల్లో సమతూకమైనది. ఎలాగంటే- భవిష్యత్ దార్శనికత, ఆచరణాత్మక విజ్ఞతతో వర్తమానంలో చర్యలు చేపట్టే వైఖరిని ఈ బడ్జెట్ ప్రతిబింబిస్తోంది.

వ్యయంపై కఠిన నియంత్రణ
ఇదంతా స్థూల ఆర్థిక స్థిరత్వ పరిరక్షణ లక్ష్యంగా ఎంతో జాగ్రత్తగా తీసుకున్న విధానపరమైన ఆర్థిక చర్యల సమాహారం. కరోనా మహమ్మారి ఫలితంగా పెరిగిన వ్యయం, పెట్టుబడుల ఉపసంహరణ లోటు వంటివి ఉన్నప్పటికీ, రాబడుల్లో అత్యధిక వృద్ధి సహా వ్యయంపై కఠిన నియంత్రణతో బడ్జెట్ అంచనాల స్థాయికి తగినట్లు 2021-22లో ద్రవ్యలోటును జీడీపీలో 6.9 శాతానికి పరిమితం చేయడం సాధ్యమైంది. ఒక ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటును ఇంత భారీ స్థాయికి తగ్గించడం ఇదే తొలిసారి. వచ్చే ఏడాది ఈ లోటు జీడీపీలో 6.4 శాతంగా ఉంటుందని అంచనా వేశారు. రాష్ట్రాలకు మూలధన వ్యయం కోసం ప్రత్యేక నిధుల బదిలీని మినహాయిస్తే ద్రవ్యలోటు వాస్తవంగా 6.0 శాతంగానే ఉంటుందన్నది గమనించాల్సిన విషయం. ఇక రాబడి లోటు కూడా 4.7 శాతం నుంచి బాగా తగ్గి 3.8 శాతానికి రాగలదని అంచనా వేశారు. నిరుటి బడ్జెట్​లో ప్రకటించినట్లు జీడీపీలో ద్రవ్యలోటును 2020-21 నాటి 9.2 శాతం నుంచి 2025-26 కల్లా 4.5 శాతానికి నియంత్రిస్తామన్న హామీతో కొత్త పన్నులేవీ విధించకుండానే సమీకృత బాటలో తాజా బడ్జెట్ రూపొందింది.