రాజధానుల్ని మార్చడమనేది ఎప్పట్నుంచో ఉన్నదే. ఒకప్పుడు బ్రిటన్, డచ్, స్పానిష్, బెల్జియం దేశాల పాలనలో ఉన్న ప్రాంతాలు ఇండిపెండెన్స్ తెచ్చుకున్నాక సొంత కేపిటల్ సిటీలను ఏర్పాటు చేసుకున్నాయి. మన దేశంలోకూడా అలాంటి మార్పు జరిగింది. అయితే, బ్రిటిషర్ల పాలనలోనే మార్పు జరగడంవల్ల మనకంతగా తెలియలేదు.
ఇండియా కేపిటల్‌గా మొదట్లో కలకత్తా ఉండేది. ఈస్టిండియా కంపెనీ మన దేశంలో స్థిరపడ్డాక 1772 నుంచి కలకత్తా రాజధానిగా పాలించేది. ఆ తర్వాత రోజుల్లో బ్రిటిష్ రాచరికపు పాలనలోకి వెళ్లి, 1911 వరకు అక్కడి నుంచే గవర్నమెంట్ పనిచేసేది. 1911లో ఢిల్లీని కొత్త కేపిటల్‌గా చేసుకుని అడ్మినిస్ట్రేషన్‌ని మార్చేశారు. 1931లో ప్రస్తుతమున్న న్యూఢిల్లీకి మారింది. అలాగే, ఇండియా వాతావరణంవల్ల సిమ్లాకి వేసవిలో వెళ్లిపోయేవారు. 1850 నుంచి 1947 వరకు సిమ్లా నగరం సమ్మర్ కేపిటల్‌గా పనిచేసింది.
లాగోస్ టు అబూజా
నైజీరియా రాజధానిగా మొదట్లో లాగోస్ ఉండేది. ఒక పద్ధతి లేకుండా అడ్డగోలుగా నగరం పెరిగిపోయింది. అలాగే, ఆ ప్రాంతంపై హక్కు కోసం అక్కడి తెగలు తరచు దొమ్మీకి దిగేవి. ఈ పోరాటాలతో ప్రభుత్వం విసిగిపోయింది. ఒక న్యూట్రల్ ప్రదేశంకోసం వెదికి, అబూజాని ఎంచుకున్నారు. ఈ ప్రాంతాన్ని ఏ ఒక్క తెగవాళ్లు తమదిగా క్లెయిమ్ చేసుకోరు. అదీగాక, దేశం మధ్యలో అబూజా ఉంటుంది. 1980లో నిర్మాణం మొదలెట్టి, పదేళ్లలో పూర్తి చేశారు. 1991 నుంచి నైజీరియాకి కొత్త రాజధానిగా అబూజా మారింది.
ఆల్మటి టు నూర్–సుల్తాన్
1991లో సోవియట్ యూనియన్ నుంచి విడిపోయాక కజక్‌స్థాన్ కేపిటల్‌గా ఆల్మటి ఉండేది. ఆ నగరం ఇరుకుగా ఉండడమే కాకుండా, భూకంపాల ప్రభావం బాగా ఎక్కువ. మరోపక్క చైనా బోర్డర్ ఉండడంతో కజక్‌స్థాన్‌లో పాలనకు పొలిటికల్‌గా చాలా ఇబ్బంది ఏర్పడింది. దాంతో 1997లో ఆస్థానా నగరాన్ని కొత్త కేపిటల్ చేసుకున్నారు. కజక్‌స్థాన్‌ను ఎక్కువ కాలం పరిపాలించిన ప్రెసిడెంట్ నూర్ సుల్తాన్ నజర్బయేవ్ పేరుమీద ఆస్థానాని నూర్–సుల్తాన్‌గా పేరు మార్చుకున్నారు.
రియో డి జెనీరో టు బ్రసీలియా
ఎన్నో ఏళ్లపాటు బ్రెజిల్‌కి రియో డి జెనీరో రాజధానిగా ఉండేది. క్రమంగా కిక్కిరిసిపోయేసరికి, కేవలం అడ్మినిస్ట్రేషన్కోసమే కొత్త కేపిటల్ అవసరమైంది. రియో డి జెనీరోకి 1,100 కిలోమీటర్ల దూరంలోని బ్రసీలియా తగిన ప్రదేశంగా ఖాయం చేశారు. ఆర్కిటెక్ట్‌లు, ఇంజినీర్లు, సిటీ ప్లానర్లు కలిసికట్టుగా ప్లాన్ రూపొందించారు. 1960లో బ్రసీలియాని కొత్త రాజధానిగా తయారైంది. ఎక్కడా కన్ఫ్యూజన్ లేకుండా బ్లాక్‌లవారీగా ప్లాన్ చేశారు. ఆర్కిటెక్చర్ రీత్యా దీనిని వరల్డ్ హెరిటేజ్ సెంటర్గాయునెస్కో గుర్తించింది.
రంగూన్ టు నేపిటావ్
ఒకప్పటి రంగూన్ నగరంతో మన తెలుగువాళ్లకు బాగా అనుబంధముంది. బర్మా (మయన్మార్)కి ఇదే ఎన్నో ఏళ్లపాటు కేపిటల్. 2005లో అక్కడి మిలిటరీ పాలకులు రంగూన్‌కి 320 కిలోమీటర్ల దూరంలోని నేపిటావ్కి రాజధానిని మార్చారు. ఎందుకు మార్చాల్సి వచ్చిందనే దానికి సరైన కారణం లేదు. కొందరు చెప్పడమేమిటంటే, కేపిటల్ని గనుక మార్చకపోతే విదేశీ దాడులు జరిగే ప్రమాదముందని జ్యోతిషుడు చెప్పడంతో మార్చేశారట!