- రూ.450 కోట్ల పెట్టుబడులకు క్యాపిటల్ ల్యాండ్ కంపెనీ ఒప్పందం
- సీఎం రేవంత్ రెడ్డితో ఉన్నతస్థాయి సమావేశంలో ప్రకటన
- 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు
- హైదరాబాద్ అభివృద్ధిలో మరో మైలురాయిగా నిలుస్తుందన్న సీఎం
- ముగిసిన సింగపూర్ పర్యటన.. నేడు దావోస్‌కు సీఎం బృందం
- 24న తిరిగి రాష్ట్రానికి రాక
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో రూ.450 కోట్ల పెట్టుబడులకు సింగపూర్‌కు చెందిన క్యాపిటల్ ల్యాండ్ కంపెనీ ముందుకొచ్చింది. హైదరాబాద్‌లో అత్యాధునిక ఐటీ పార్క్‌ను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఆదివారం సింగపూర్‌లో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ అంశాన్ని వెల్లడించింది. క్యాపిటల్ ల్యాండ్ చేపట్టే కొత్త ఐటీ పార్క్.. హైదరాబాద్ అభివృద్ధిలో మరో మైలురాయిగా నిలుస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. క్యాపిటల్ ల్యాండ్ నిర్ణయాన్ని స్వాగతించారు. సింగపూర్ కేంద్రంగా విస్తరించిన ఈ కంపెనీ.. ప్రపంచస్థాయి రియల్ ఎస్టేట్ సంస్థల్లో ఒకటి.
హైదరాబాద్‌లో 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో భారీ ఐటీ పార్క్‌ను అభివృద్ధి చేయనుంది. బ్లూ చిప్ కంపెనీలకు కావాల్సిన ప్రీమియం సదుపాయాలు, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లకు పెరుగుతున్న డిమాండ్‌ను అందుకునే అన్ని సౌకర్యాలు ఈ ఐటీ పార్క్‌లో అందుబాటులో ఉంటాయి.ఈ సందర్భంగా క్యాపిటల్ ల్యాండ్ తరఫున ఇండియా ట్రస్ట్ మేనేజ్మెంట్ సీఈవో గౌరీ శంకర్ నాగభూషణం మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో హైదరాబాద్ అన్ని రంగాల్లో సుస్థిరంగా వృద్ధి చెందుతోందన్నారు. తమ కంపెనీ కార్యకలాపాలను తెలంగాణలో విస్తరించడం ఆనందంగా ఉందని చెప్పారు. క్యాపిటల్ ల్యాండ్ సంస్థ ఇప్పటికే హైదరాబాద్‌లో అంతర్జాతీయ టెక్ పార్క్ (ఐటీపీహెచ్), అవాన్స్ హైదరాబాద్, సైబర్‌పెర్ల్ పార్క్‌లను ఏర్పాటు చేసింది. గతంలో ఈ సంస్థ ప్రకటించిన 25 మెగావాట్ల ఐటీ లోడ్ డేటా సెంటర్ కూడా ఈ ఏడాది మధ్యలోనే అందుబాటులోకి రానుంది. ఐటీపీహెచ్ రెండో దశ ఈ ఏడాదిలో ప్రారంభమై 2028 నాటికి పూర్తి కానుంది. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, స్పెషల్ సీఎస్ జయేశ్ రంజన్, ఇన్వెస్ట్ మెంట్ ప్రమోషన్ స్పెషల్ సెక్రటరీ విష్ణువర్ధన్ రెడ్డి, సీఎంవో స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి, క్యాపిటల్ ల్యాండ్ సంస్థ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మనోహర్ కియాతానీ తదితరులు పాల్గొన్నారు. కాగా సీఎం రేవంత్ రెడ్డి సింగపూర్ నదిలో పడవలో ప్రయాణించి.. అక్కడి నది పునరుద్ధరణ కార్యక్రమాలను పరిశీలించారు.
సీఎం సింగపూర్ టూర్ సక్సెస్..
సీఎం రేవంత్‌రెడ్డి సింగపూర్ టూర్ సక్సెస్ అయింది. సీఎం నేతృత్వంలోని రాష్ట్ర ప్రతినిధి బృందం మూడు రోజుల పాటు బిజీ బిజీగా గడిపింది. వివిధ రంగాల్లో పేరొందిన ప్రపంచ స్థాయి సంస్థల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలతో కీలక చర్చల్లో పాల్గొంది. ఆశించిన పెట్టుబడుల ఒప్పందాలతో పాటు సింగపూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్(ఐటీఈ)తో తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పరస్పర అవగాహన కుదుర్చుకుంది. హైదరాబాద్ లోని ఫ్యూచర్ సిటీలో అత్యాధునిక ఏఐ ఆధారిత డేటా సెంటర్ ఏర్పాటుకు ఎస్టీ టెలీ మీడియా గ్లోబల్ డేటా సెంటర్ ముందుకు వచ్చింది. రాష్ట్రంలో సెమీ కండక్టర్ల తయారీ పరిశ్రమలు, పెట్టుబడుల అవకాశాలపై సింగపూర్ సెమీ కండక్టర్ ఇండస్ట్రీ అసోసియేషన్‌తో జరిపిన చర్చలు ఫలవంతమయ్యాయి. చివరి రోజున సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం అక్కడి ప్రధాన వ్యాపార సంస్థల అధినేతలు, సింగపూర్ బిజినెస్ ఫెడరేషన్ (ఎస్బీఎఫ్) ప్రతినిధులతో చర్చలు జరిపింది.
నేడు దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు..
సీఎంతో పాటు మంత్రి శ్రీధర్ బాబు, అధికారులు సోమవారం దావోస్ కు చేరుకుంటారు. అక్కడ ఈ నెల 23 వరకు జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వార్షిక సదస్సులో పాల్గొంటారు. ఈ నెల 24వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి బృందం రాష్ట్రానికి చేరుకుంటుంది.
తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునేటోళ్లకు బుద్ది చెప్పాలి: సీఎం
దొరల పాలన నుంచి విముక్తి పొంది ప్రజల తెలంగాణగా మారిన రాష్ట్రాన్ని.. ఉద్యమ పంథాలోనే పునర్ నిర్మించుకుందామని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్ర సాధన ఉద్యమంలో ద్రోహులను తరిమేసిన విధంగా ఇప్పుడు తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్న వారికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. సింగపూర్ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి.. అక్కడి తెలంగాణ కల్చరల్ సొసైటీ ఆధ్వర్యం లో నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. సమగ్ర అభివృద్ధిని సాధించుకునే క్రమంలో ప్రపంచంతో పోటీపడి తెలంగాణను నంబర్ 1గా నిలబెట్టుకుందామన్నారు. ఆ దిశగా పెట్టుబడులు పెట్టాలని తెలంగాణ ప్రవాసులను ఆయన కోరారు.
అభివృద్ధిని అడ్డుకునేవాళ్లకు బుద్ధిచెప్పాలి
దొరల పాలన నుంచి తెలంగాణ విముక్తి పొంది.. ప్రజల తెలంగాణగా మారింది. ఉద్యమ పంథాలోనే రాష్ట్రాన్ని పునర్ నిర్మించుకుందాం. రాష్ట్ర సాధన ఉద్యమంలో ద్రోహులను తరిమేసినట్లే ఇప్పుడు తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్న వారికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది.
- తెలంగాణ కల్చరల్ సొసైటీ ప్రోగ్రామ్‌లో సీఎం రేవంత్