క్యాప్సికమ్.. ఇది కొందరికి బాగా నచ్చుతుంది. మరికొందరికి అస్సలు నచ్చదు. కానీ,ఏ కూరగాయ అయినా ఒకేలా వండితే కొన్నాళ్లకు బోర్ కొట్టేస్తుంది. అందుకే అప్పుడప్పుడు కొత్త వెరైటీలు కూడా ట్రై చేస్తుండాలి. మరి క్యాప్సికమ్‌తో ఇంటిల్లిపాదికి నచ్చేలా మున్నాయి? అంటారా.. ఇదిగో అందరూ ఇష్టంగా తినేలా మంచూరియా, బజ్జీ, పకోడీలు,వాటి తయారీ విధానం..
కావాల్సినవి :
శనగపిండి – ఒక కప్పు
బియ్యప్పిండి – రెండు కప్పులు
కారం – అర టీస్పూన్
ఉప్పు, నీళ్లు – సరిపడా
ఇంగువ – చిటికెడు
ఉల్లిగడ్డ, క్యారెట్ – ఒక్కోటి
కొత్తిమీర, నిమ్మరసం – కొద్దిగా
తయారీ : ఒక గిన్నెలో శనగపిండి, బియ్యప్పిండి, పావు టీస్పూన్ కారం, ఉప్పు, ఇంగువ వేసి బాగా కలపాలి. అందులో నీళ్లు పోసి బజ్జీలు వేసుకోవడానికి వీలుగా ఉండేలా కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో క్యాప్సికమ్‌లను ముంచి, కాగిన నూనెలో ఒక్కోటిగా వేసి వేగించాలి. ఒక గిన్నెలో ఉల్లిగడ్డ తరుగు, క్యారెట్ తురుము, ఉప్పు, మరో పావు టీస్పూన్ కారం, కొత్తిమీర కూడా వేసి కలపాలి. వేగించిన క్యాప్సికమ్‌ను మధ్యకు కట్ చేసి, లోపల ఈ స్టఫింగ్ పెట్టాలి. ఆపై నిమ్మరసం చల్లుకుని తింటే టేస్ట్ అదిరిపోతుంది.
పకోడి
కావాల్సినవి :
ఉల్లిగడ్డలు – రెండు
అల్లం తరుగు – ఒక టీస్పూన్
పచ్చిమిర్చి, క్యాప్సికమ్ – ఒక్కోటి
సోంపు, కారం – ఒక్కోటి అర టీస్పూన్
పసుపు – పావు టీస్పూన్
ఉప్పు, నీళ్లు – సరిపడా
కొత్తిమీర – కొద్దిగా
జీడిపప్పులు – ఐదు
తయారీ : ఒక గిన్నెలో సన్నగా, పొడవుగా తరిగిన ఉల్లిగడ్డ, అల్లం, పచ్చిమిర్చి తరుగు, సోంపు, కారం, పసుపు, ఉప్పు వేసి బాగా కలపాలి. తర్వాత అందులో పొడవుగా తరిగిన క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసి కలపాలి. మూతపెట్టి పది నిమిషాలు పక్కన పెట్టాలి. ఆ తర్వాత అందులో జీడిపప్పు తరుగు, కొత్తిమీర వేసి కలపాలి. ఆపై నీళ్లు పోసి పకోడీలు వేసుకునేందుకు వీలుగా ఉండేలా కలుపుకోవాలి. పాన్‌లో నూనె వేడి చేసి అందులో పకోడీలు వేసుకోవాలి. అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేగిస్తే సరి.
మంచూరియా
కావాల్సినవి :
క్యాప్సికమ్, క్యారెట్, ఉల్లిగడ్డ – ఒక్కోటి, ఉప్పు – సరిపడా, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, చిల్లీసాస్, కెచప్ – ఒక్కో టీస్పూన్, మైదా – రెండు టీస్పూన్లు
సోయా సాస్, నీళ్లు – రెండు టీస్పూన్లు
తయారీ :ఒక గిన్నెలో క్యాప్సికమ్, క్యారెట్, ఉల్లిగడ్డ తరుగు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, మైదా, ఉప్పు వేసి బాగా కలపాలి. మూతపెట్టి పది నిమిషాలు పక్కన పెట్టాలి. ఆ తర్వాత ఆ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేయాలి. పాన్‌లో నూనె వేడి చేసి అందులో ఉండల్ని వేసి బాగా వేగించాలి. మరోపాన్‌లో నూనె వేడి చేసి ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, వెల్లుల్లి తరుగు వేసి వేగించాలి. అందులో కెచప్, సోయాసాస్, చిల్లీసాస్ వేసి, నీళ్లు పోసి కలపాలి. తర్వాత వేగించిన మంచూరియా బాల్స్ వేసి కలపాలి.