పాటియాలా నుంచి కెప్టన్ అమరీందర్ సింగ్ పోటీ

పంజాబ్ లో వచ్చే ఏడాది  అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, ఆప్, అకాళీదల్ పార్టీల మధ్య ప్రధాన పోటీ నెలకొంది. ఇటీవల కొత్త పార్టీ పెట్టిన పంజాబ్ మాజీ సీఎం కెప్టెట్ అమరీందర్ సింగ్ కూడా గట్టి పోటీ ఇచ్చేందుకు రెడీ అయ్యారు. ఎన్నికల్లో తాను ఎక్కడి నుంచి పోటీ చేసే దానిపై స్పష్టత ఇచ్చారు. పంజాబ్‌లో తమ కుటుంబానికి కంచుకోటగా ఉన్న పాటియాలా అసెంబ్లీ నియోజకవర్గం నుంచే కెప్టన్ అమరీందర్ సింగ్ పోటీ చేయనున్నారు. తమ కుటుంబానికి పాటియాలాతో 400 ఏళ్ల అనుబంధం ఉందని ఆయన గుర్తుచేసుకున్నారు.

పాటియాలా నియోజకవర్గం అమరీందర్ సింగ్‌ కుటుంబానికి గత కొన్ని దశాబ్ధాలుగా కంచుకోటలా ఉంది. పాటియాలా నియోజకవర్గం నుంచి కెప్టెన్ అమరీందర్ సింగ్ నాలుగు సార్లు గెలిచారు. కాంగ్రెస్ పార్టీ తరుపున 2002, 2007, 2012, 2017 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత  సీఎంగా సేవలు అందించారు. అమృతసర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎన్నికకావడంతో 2014లో అమరీందర్ సింగ్ పాటియాలా అసెంబ్లీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో ఆయన సతీమణి ప్రణీత్ కౌర్ పోటీ చేసి గెలుపొందారు. ఈ నియోజకవర్గం నుంచి ఆమె మూడుసార్లు ప్రాతినిధ్యం వహించారు.

పంజాబ్ పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సిద్ధూతో విభేదాల కారణంగా సీఎం పదవికి రాజీనామా చేసి.. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకొచ్చారు. పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేశారు. ఈ పార్టీ తరుపున ఆయన పోటీ చేయబోతున్నారు.