
చెన్నై: ఐపీఎల్ 18వ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) చెత్తాటపై ఆ టీమ్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ నిస్సహాయత వ్యక్తం చేశాడు. తుది జట్టులో ఒకేసారి నలుగురు, ఐదుగురు ఫామ్ కోల్పోతే ఏమీ చేయలేమని, ఆశించిన ఫలితాలు అందుకోలేమని చెప్పాడు. శుక్రవారం రాత్రి సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో సీఎస్కే ఐదు వికెట్ల తేడాతో ఓడిపోయింది. మొత్తంగా ఏడో ఓటమి కావడంతో ఆ టీమ్ ప్లే-ఆఫ్ అవకాశాలపై భారీ దెబ్బ పడింది.
ఇలాంటి టోర్నీలో ఒకటి రెండు ఏరియాల్లో లోపాలను అయితే సరిచేయవచ్చన్న మహీ.. మెజారిటీ ఆటగాళ్లు బాగా ఆడకపోతే జట్టు గెలవడం కష్టమవుతుందని మ్యాచ్ అనంతరం చెప్పాడు. సీఎస్కే ఈ సీజన్‌లో ఇప్పటివరకు తొమ్మిది మ్యాచ్‌ల్లో 19 మంది ప్లేయర్లను ఆడించింది. ఆశించిన ఫలితాలు లేనప్పుడు తుది జట్లను మారుస్తూ వివిధ కాంబినేషన్‌లను పరిశీలించక తప్పలేదని ధోనీ తెలిపాడు. ‘మెజారిటీ ఆటగాళ్లు బాగా రాణిస్తే వాళ్లకు ఎక్కువ మ్యాచ్‌లు ఇవ్వొచ్చు. లేదంటే మరో ప్లేయర్ వైపు చూడాల్సి వస్తుంది.
కానీ, ఒకేసారి నలుగురు నిరాశపరిస్తే అదే జట్టును కొనసాగించలేం కదా. అందుకే తుది జట్టును మార్చాల్సి ఉంటుంది’ మహీ పేర్కొన్నాడు. మిడిల్ ఓవర్లలో స్పిన్నర్లను మెరుగ్గా ఎదుర్కోవడంలో బ్యాటర్ల వైఫల్యం ఈసారి జట్టు డీలా పడటానికి ప్రధాన కారణమని ధోనీ గుర్తించాడు. అదే సమయంలో సన్ రైజర్స్ స్పిన్నర్లపై ఎదురుదాడి చేసి 42 రన్స్ సౌతాఫ్రికా యంగ్‌స్టర్ డెవాల్డ్ బ్రేవిస్ రాబోయే మ్యాచ్‌ల్లో కీలక పాత్ర పోషిస్తాడని చెప్పాడు.
‘బ్రేవిస్ చాలా బాగా బ్యాటింగ్ చేశాడు. మిడిలార్డర్‌లో మాకు అలాంటి ఆటగాడు అవసరం. స్పిన్నర్లను ఎదుర్కోవడంలో మేం కొంచెం ఇబ్బందిపడ్డాం. మిడిల్ ఓవర్లలో స్పిన్నర్లపై ఆధిపత్యం చెలాయించడంలో, వేగంగా రన్స్ రాబట్టడంలో మేము ఫెయిలయ్యామని భావిస్తున్నా’ అని ధోనీ పేర్కొన్నాడు.
సన్ రైజర్స్‌తో మ్యాచ్‌లో పిచ్ స్ట్రోక్ -మేకింగ్‌కు అనుకూలంగా ఉన్నప్పటికీ తాము చాలా తక్కువ స్కోరు చేశామని చెప్పాడు. ‘ఫస్ట్ ఇన్నింగ్స్‌లో పిచ్ మెరుగ్గానే ఉంది. బాల్ పెద్దగా టర్న్ అవ్వలేదు. అయినా మేం వెంటవెంటనే వికెట్లు కోల్పోయాం. 155 అనేది కాపాడుకునే స్కోరు కాదు. ఇంకో15–-20 చేయాల్సింది’ అని మహీ వివరించాడు.