డబ్ల్యూటీసీ ఫైనల్‌‌ చేరాలంటే మేం దూకుడుగా ఆడాల్సిందే: కేఎల్ రాహుల్

డబ్ల్యూటీసీ ఫైనల్‌‌ చేరాలంటే మేం దూకుడుగా ఆడాల్సిందే: కేఎల్ రాహుల్

చట్టోగ్రామ్‌‌:  వరల్డ్‌‌ టెస్ట్ చాంపియన్‌‌షిప్‌‌ ఫైనల్‌‌ బెర్తు సాధించాలంటే  బంగ్లాదేశ్‌‌తో టెస్టు సిరీస్‌‌లో  దూకుడుగా ఆడటం తప్ప మరో ఆప్షన్‌‌ లేదని ఇండియా స్టాండిన్‌‌ కెప్టెన్‌‌ కేఎల్‌‌ రాహుల్‌‌ అన్నాడు. బుధవారం ఇరు జట్ల మధ్య తొలి మ్యాచ్‌‌ మొదలవనుండగా,  గాయాల కారణంగా కెప్టెన్‌‌ రోహిత్‌‌ శర్మ, పేసర్లు బుమ్రా, షమీ, స్పిన్నర్‌‌ రవీంద్ర జడేజా లేకుండానే ఇండియా బరిలోకి దిగుతోంది. రోహిత్‌‌ ప్లేస్‌‌లో రాహుల్‌‌ కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్నాడు. సోమవారం బంగ్లా కెప్టెన్​ షకీబ్​తో కలిసి సిరీస్‌‌ ట్రోఫీ ఆవిష్కరించిన తర్వాత రాహుల్‌‌ మీడియాతో మాట్లాడాడు.

‘డబ్ల్యూటీసీ ఫైనల్‌‌ క్వాలిఫికేషన్‌‌ ఉంది కాబట్టి మేం దూకుడుగా ఆడాల్సిందే. ప్రస్తుతం మేం ఎక్కడ ఉన్నామో, ఫైనల్ చేరాలంటే ఏం చేయాలో మాకు తెలుసు. ప్రతి రోజు, ప్రతి సెషన్‌‌లో నిర్దిష్ట సమయంలో టీమ్‌‌కు ఏం అవసరమో అంచనా వేస్తూ మా బెస్ట్‌‌ ఇస్తాం. అంతే తప్ప ప్రత్యేకంగా ఓ మైండ్‌‌సెట్‌‌తోనే ఆడం. దూకుడుగా, ధైర్యంగా ఆడి రిజల్ట్‌‌ వచ్చేలా చేస్తాం. ఐదు రోజుల మ్యాచ్‌‌ కాబట్టి  చిన్న చిన్న టార్గెట్లు పెట్టుకొని ముందుకెళ్లడం ముఖ్యం. ప్రతి సెషన్‌‌లో డిమాండ్లు భిన్నంగా ఉంటాయి. కానీ, మా నుంచి చాలా దూకుడైన క్రికెట్‌‌ చూస్తారని  నేను హామీ ఇవ్వగలను’ అని అని రాహుల్‌‌ చెప్పాడు. కెప్టెన్‌‌ రోహిత్‌‌ గాయం నుంచి కోలుకొని రెండో టెస్టు వరకు అందుబాటులోకి వస్తాడని రాహుల్‌‌ ఆశాభావం వ్యక్తం చేశాడు.  

బంగ్లాతో వన్డే సిరీస్‌‌లో ఓడిపోయిన ఇండియా.. వరల్డ్‌‌  టెస్టు చాంపియన్‌‌షిప్‌‌ పాయింట్స్‌‌ టేబుల్లో టాప్‌‌ ప్లేస్‌‌లో ఉండాలంటే బంగ్లాతో రెండు టెస్టులతో పాటు సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టుల్లోనూ గెలవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఇండియా 52.08 పర్సెంటేజ్‌‌ పాయింట్లతో నాలుగో ప్లేస్‌‌లో ఉండగా.. ఆస్ట్రేలియా (75), సౌతాఫ్రికా (60) టాప్‌‌2లో ఉన్నాయి.  మరోవైపు తొలి టెస్టు కోసం టీమిండియా మొదటి ప్రాక్టీస్ సెషన్‌‌లో పాల్గొంది.  కేఎల్‌‌ రాహుల్‌‌, పంత్‌‌, గిల్‌‌ సహా బ్యాటర్లంతా నెట్స్‌‌లో చెమటలు చిందించారు.  గ్రౌండ్‌‌లో ఫీల్డింగ్‌‌ డ్రిల్స్‌‌ కూడా చేశారు.