ఈటల రాజేందర్ కేసీఆర్ బొమ్మపైనే గెలిచారన్నారు టీఆర్ఎస్ నేత,రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతారావు. హుజురాబాద్ ప్రెస్ మీట్ లో మాట్లాడిన ఆయన..ఈటలకు తాను మొదటి నుంచి ఓటరునని తెలిపారు. అసైన్డ్ లాండ్స్ ను ఈటల కొన్నట్టు అక్కడి ప్రజలు సీఎంకు చెప్పారని..అలాంటి విషయం పై త్వరగా పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. ఈటలకు సీఎం కేసిఆర్ ఎన్నో అవకాశాలు కల్పించారన్నారు. అలాంటి మంత్రిపై అభియోగాలు వచ్చినప్పుడు విచారణ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందన్నారు లక్ష్మీకాంతారావు.
ఈటల ను ఉద్యమకారుడు కాదనడం లేదన్న కెప్టెన్ లక్ష్మీకాంతారావు..రైతు బంధును రాజేందర్ నియోజకవర్గంలోనే సీఎం ప్రారంభిస్తే దాన్ని విమర్శించారని తెలిపారు.తన కుమారుడు సతీష్ కుమార్ నియోజక వర్గమైన హుస్నాబాద్ కు RDO మంజూరైతే.. అది కాకుండా హుజూరాబాద్ లో ఏర్పాటు చేసుకున్నారన్నారు. తన భార్య సరోజన MPP అయితే అవిశ్వాసం పెట్టించారని చెప్పారు.ఈటల స్వంత పార్టీ వారినే ఇబ్బందులకు గురిచేశారని ఆరోపించారు. అలాంటి వ్యక్తి పై అభియోగాలు వస్తే సీఎం విచారణ జరిపితే ఏదో అయిపోయినట్టు చేస్తున్నారన్నారు.
సీఎం కేసీఆర్ ఈటలను ఎప్పుడు తక్కువ చేసి చూడలేదని తెలిపారు లక్ష్మీకాంతారావు. బిసిలకు సీఎం సముచిత స్థానం కల్పించారన్నారు.అసైన్డ్ భూములు కొనరాదని తెలిసికూడా తెలియనట్లు వ్యవహరించడం సమంజసం కాదన్నారు. మంత్రి పదవి నుంచి తొలగిస్తే ఎదో ఆయిపోయినట్టు ప్రజాభిప్రాయం సేకరించడం సరైంది కాదన్నారు. తమ నాయకుడు ఆదేశిస్తే హుజూరాబాద్ నుంచి పోటీ చేస్తానని అన్నారు.