మెల్‌బోర్న్: ఆస్ట్రేలియాతో బాక్సింగ్ డే టెస్టుకు ముందు టీమిండియా అభిమానులకు కెప్టెన్ రోహిత్ శర్మ ఊరట కలిగించాడు. ప్రాక్టీస్ టైమ్‌లో అయిన మోకాలి దెబ్బ నయం అయిందని తెలిపాడు. తన మోకాలు బాగానే ఉందని మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో తెలిపాడు. దాంతో రోహిత్‌కు తీవ్ర గాయం అయిందన్న పుకార్లకు పుల్‌స్టాప్ పడింది. అయితే, గురువారం మొదలయ్యే నాలుగో టెస్టులో తన బ్యాటింగ్ పొజిషన్ గురించి స్పష్టత ఇవ్వకుండా సస్పెన్స్‌లో పెట్టాడు. తొలి టెస్టుకు దూరంగా ఉన్న హిట్‌మ్యాన్ గత రెండు మ్యాచ్‌ల్లో కేఎల్ రాహుల్‌ను ఓపెనర్‌గా కొనసాగించి తాను మిడిలార్డర్‌లో దిగాడు.
కానీ, ఈ రెండింటిలో తను నిరాశపరిచాడు. బాక్సింగ్ డే టెస్టులో జట్టుకు ఉపయోగపడే స్థానంలో బ్యాటింగ్‌కు వస్తానని రోహిత్ తెలిపాడు. ‘ఎవరు ఏ పొజిషన్‌లో బ్యాటింగ్ చేస్తారనే విషయంపై ఆందోళన వద్దు. ఆ విషయం మేం చేసుకుంటాం. దానిపై ఇక్కడ చర్చ వద్దు. జట్టుకు ఏది మంచిదో అదే చేస్తాం’ అని కెప్టెన్ స్పష్టం చేశాడు. కోహ్లీ ఫామ్ గురించి, అతని ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ వీక్‌నెస్ గురించి ఆందోళన అక్కర్లేదన్నాడు.
ఈ తరం గొప్ప ఆటగాడైన విరాట్‌కు తన సమస్యను తానే పరిష్కరించుకుంటాడని చెప్పాడు. ఇక, యంగ్‌స్టర్స్ యశస్వి జైస్వాల్, గిల్, పంత్ ఈ సిరీస్‌లో అంతగా ఆకట్టుకోలేకపోవడంపై హిట్‌మ్యాన్ స్పందించాడు. ‘ఈ ముగ్గురూ ప్రస్తుతం ఒకే నావలో ఉన్నారు. తమ సత్తా ఏంటో వారికి తెలుసు. మనం దీని (ఫామ్) గురించి మాట్లాడి, సూచనలు ఇచ్చి ఈ విషయాన్ని మరింత క్లిష్టతరం చేయకూడదు’ అని రోహిత్ అభిప్రాయపడ్డాడు.