పాకిస్థాన్ క్రికెట్‌లో కెప్టెన్సీ వివాదం రోజురోజుకు ముదురుతోంది. 2023 వన్డే ప్రపంచ కప్‌లో పేలవ ప్రదర్శన అనంతరం బాబర్ ఆజాంను కెప్టెన్సీ నుంచి తప్పించిన బోర్డు పెద్దలు.. తిరిగి మరోసారి అతనికే పగ్గాలు అప్పగించాలని యోచిస్తున్నారు. అందుకు బాబర్ మొగ్గు చూపుతున్నా.. బోర్డు పెద్దల ముందు కొన్ని షరతులు ఉంచినట్లు తెలుస్తోంది. మూడు ఫార్మాట్లకు తననే కెప్టెన్‌గా నియమించాలని సెలెక్టర్లకు బాబర్ అల్టిమేటం ఇచ్చినట్లు కథనాలు వస్తున్నాయి. అలా అయితేనే తాను కెప్టెన్సీ బాధ్యతలు చేపడతానని బాబర్ చెప్పినట్లు సారాంశం. అయితే, ఈ అంశంపై ప్రస్తుతం జాతీయ సెలక్షన్ కమిటీలో విభేదాలు ఉన్నందున అతని డిమాండ్లను ఆమోదించలేదని సమాచారం.
పీసీబీ విచ్చిన్నం
కెప్టెన్సీ వివాదంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) పెద్దలు రెండు వర్గాలుగా విడిపోయారు. మూడు ఫార్మాట్లకు బాబర్ ఆజాంను కెప్టెన్ గా నియమించడానికి కొందరు అంగీకరిస్తుంటే, మరికొందరు టీ20 కెప్టెన్‌గా షాహీన్ షా అఫ్రిదీని కొనసాగించాలని పట్టుబడుతున్నారు. పొట్టి ప్రపంచ కప్ సమీపిస్తున్నందున ప్రయోగాలు వద్దని, అఫ్రిదీపై నమ్మకం ఉంచాలని వారు కోరుతున్నారు. త్వరలో స్వదేశంలో కివీస్‌తో జరిగే టీ20 సిరీస్ కు అతనే నాయకత్వం వహించాలని పట్టుబడుతున్నారు.
Update: The selectors are on their way to Kakul, Abbottabad to convince Babar Azam to take only T20I captaincy. Babar wants to become captain of all three formats and also wants certain conditions to be met 🇵🇰🤯
— Farid Khan (@_FaridKhan) March 30, 2024
A press conference on this decision is imminent [Express News] pic.twitter.com/QNImv2qPIe
తప్పుకున్న షాహీన్ షా అఫ్రిదీ!
మరోవైపు, టీ20 కెప్టెన్సీ బాధ్యతల షాహీన్ షా అఫ్రిదీ తప్పుకుంటున్నట్లు పాక్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అఫ్రిది నాయకత్వంలో.. పాకిస్తాన్ 4-1తో న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయింది. ఈ ఓటములకు నైతిక బాధ్యత వహిస్తూ అతను వైదొలిగినట్లు సమాచారం. ఈ మేరకు అఫ్రిదీ పీసీబీ (PCB) ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీకి సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే, దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.