జూబ్లీహిల్స్‎లో కారు బీభత్సం.. బాలకృష్ణ ఇంటి ఫెన్సింగ్ ఢీకొట్టిన కారు

జూబ్లీహిల్స్‎లో కారు బీభత్సం.. బాలకృష్ణ ఇంటి ఫెన్సింగ్ ఢీకొట్టిన కారు

హైదరాబాద్: జూబ్లీహిల్స్‎లో కారు బీభత్సం సృష్టించింది. శుక్రవారం (మార్చి 14) ఉదయం అతి వేగంగా దూసుకొచ్చిన కారు.. జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 1లోని సినీహీరో బాలకృష్ణ ఇంటి ముందున్న ఫుట్ పాత్ పైకి దూసుకెళ్లింది. బాలకృష్ణ ఇంటి ఫెన్సింగ్‎ను ఢీకొట్టి ఆగిపోయింది. ప్రమాదంలో ఫెన్సింగ్‎తో పాటు.. కారు ముందు భాగం తుక్కుతుక్కు అయ్యింది. 

మాదాపూర్ వైపు నుంచి జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 45 మీదుగా జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వైపునకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. కారు అతివేగంతో దూసుకురావడంతో రోడ్డుపై ఉన్న జనం పరుగులు తీశారు. కారు డ్రైవర్ నిద్రమత్తే ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.