నిర్మల్: కోతులను తప్పించబోయి ప్రమాదవశాత్తూ కారులో బోల్తా పడి భార్యభర్తలిద్దరూ మృతి చెందారు. ఈ విషాద ఘటన నిర్మల్ జిల్లాలోని మామడ మండలం బూరుగపల్లి గ్రామం వద్ద నేషనల్ హైవే 44పై శనివారం (జనవరి 18) రాత్రి చోటు చేసుకుంది. మృతులను మధ్యప్రదేశ్‌కు చెందినవారిగా గుర్తించారు పోలీసులు. మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీశైలం దర్శనానికి కుటుంబంతో కలిసి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో కారులో మొత్తం ఐదుగురు ఉండగా.. ఇద్దరు మృతి చెందారు.
మరో ముగ్గురు స్వల్ప గాయాలతో ప్రాణపాయం నుంచి బయటపడ్డారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను ఆసుత్రికి తరలించారు. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం నిర్మల్ జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుల కుటుంబ సభ్యుల మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.