షార్ట్ సర్క్యూట్ తో కారు దగ్ధం

  • ప్రాణాలతో బయటపడ్డ ముగ్గురు వ్యక్తులు

కౌడిపల్లి, వెలుగు: షార్ట్ సర్క్యూట్ తో  షిఫ్ట్ డిజైర్ కారు పూర్తిగా దగ్ధమైన సంఘటన మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం తిమ్మాపూర్ పంచాయతీ పరిధిలోని కుషన్ గడ్డ తండా సమీపంలో గురువారం సాయంత్రం జరిగింది. హైదరాబాద్​కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి తండా సమీపంలో 20 ఎకరాల భూమి కొనుగోలు చేసి షెడ్ నిర్మాణం చేస్తున్నారు. ఈ క్రమంలో సమీపంలోని  33 కేవీ విద్యుత్ లైన్ నుంచి కరెంట్  కనెక్షన్ తీసుకుని వెల్డింగ్ పనులు చేస్తున్నారు. 

ముగ్గురు వర్కర్లు పనిచేస్తుండగానే ఒక్కసారిగా విద్యుత్తు లైను షార్ట్ సర్క్యూట్ కావడంతో పక్కనే ఉన్న కారుకు మంటలు అంటుకున్నాయి.  దీంతో కారు పూర్తిగా దగ్ధమైంది. కారు పక్కనే ఉన్న ముగ్గురు వ్యక్తులు గమనించి అక్కడి నుంచి తప్పుకోవడంతో ప్రాణాలతో బయటపడ్డారు. మీటర్ ఉన్నప్పటికీ అక్రమంగా విద్యుత్తు లైన్ తీసుకోవడంతోనే షార్ట్ సర్క్యూట్ జరిగి షిఫ్ట్ డిజైర్ కారు దగ్ధమైందని  తండావాసులు తెలిపారు.